చారిత్రాత్మక మ్యాచ్లో..రికార్డుకు చేరువలో

చారిత్రాత్మక మ్యాచ్లో..రికార్డుకు చేరువలో


కాన్పూర్: ఇప్పటికే ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్న టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డుకు చేరువలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లతో రాణించిన అశ్విన్..  రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లను సాధిస్తే 200 వికెట్ల క్లబ్లో చేరతాడు. దాంతోపాటు టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలుస్తాడు.


 


అంతకుముందు ఈ ఘనత పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్ డెన్నిస్ లిల్లీ పేరిట ఉంది. వీరిద్దరు 38 టెస్టుల్లో 200 వికెట్లు సాధించి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. అయితే న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ అశ్విన్కు 37వ ది కావడంతో వారి రికార్డును బద్దలు కొట్టేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు.  ఈ చారిత్రాత్మక టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ మూడు వికెట్లు తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకునే అవకాశాలు ఎక్కువగా  కనబడుతున్నాయి. అయితే అత్యంత వేగవంతంగా 200 టెస్టు వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రెమెట్ తొలి స్థానంలో ఉన్నాడు.  36 టెస్టుల్లో క్లారీ గ్రెమెట్ ఈ ఘనతను సాధించాడు.


 


ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్టు మ్యాచ్లో అశ్విన్ అటు బంతితో పాటు, ఇటు బ్యాట్తో కూడా రాణించిన సంగతి తెలిసిందే.  విండీస్తో సిరీస్లో 235 పరుగులు(రెండు సెంచరీలు), 17 వికెట్లతో అశ్విన్ మెరిశాడు. ఈ క్రమంలోనే ఒక సిరీస్లో రెండు సార్లు ఐదు వికెట్లకు పైగా తీయడంతో పాటు, రెండు సార్లు 50కు పైగా పరుగులు నమోదు చేసిన మూడో భారత ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు  ఈ ఫీట్ ను కపిల్ దేవ్  రెండు సార్లు, భువనేశ్వర్ కుమార్ ఒకసారి సాధించారు.1979-80లో పాకిస్తాన్పై, 1981-82లో ఇంగ్లండ్పై కపిల్ దేవ్ ఈ ఘనతను నమోదు చేయగా, రెండు సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ తో టెస్టు మ్యాచ్ లో భువనే్శ్వర్ కుమార్ రెండుసార్లు ఐదేసి వికెట్లను, 50కు పైగా స్కోరును రెండు సార్లు సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top