అశ్విన్ పై ప్రశంసల వర్షం

అశ్విన్ పై ప్రశంసల వర్షం


నాగ్ పూర్:గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. అశ్విన్ ప్రపంచ అత్యుత్తమ స్పిన్నరంటూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు. రెండో టెస్టులో టీమిండియా విసిరిన 310 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యమే అయినా.. ఒంటిచేత్తో మ్యాచ్ లు గెలిపించే సత్తా ఉన్నా సఫారీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ను అశ్విన్ అవుట్ చేసిన తీరు నిజంగా ఒక అద్భుతమన్నాడు. అదే అశ్విన్ ను ప్రపంచ ఉత్తమ స్పిన్నర్ గా నిలబెడుతుందన్నాడు. దక్షిణాఫ్రికా కోల్పోయిన మొత్తం వికెట్లు స్పిన్నర్లే దక్కడం ఒక ఎత్తయితే.. అందులో అశ్విన్ 12 వికెట్లు  సాధించడం అద్వితీయమన్నాడు.


 


ప్రపంచ ప్రమాదకరమైన బౌలర్లలో అశ్విన్ ఒకడంటూ మరో మాజీ భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసించాడు. అశ్విన్ భారత్ పిచ్ లు పైనే కాదు, విదేశాల్లో కూడా తన చక్కటి స్పిన్ తో ఆకట్టుకుంటూ జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాడని మంజ్రేకర్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ 31 టెస్టు మ్యాచ్ లు ఆడిన అశ్విన్ 169 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడమే అతని ప్రతిభకు అద్దం పడుతుందని కొనియాడాడు.ప్రస్తుత సిరీస్ లో మూడు టెస్టుల్లో 24 వికెట్లు తీసిన అశ్విన్ ఒక ఉత్తమ స్పిన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top