కోచ్ పదవిపై రవిశాస్త్రి షరతులు..?

కోచ్ పదవిపై రవిశాస్త్రి షరతులు..?


న్యూఢిల్లీ:గతేడాది అనిల్ కుంబ్లేను టీమిండియా ప్రధాన కోచ్ గా చేసినప్పుడు మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి, బీసీసీఐ క్రికెట్‌ సలహాదారుల కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్ గంగూలీల మధ్య తీవ్రస్థాయిలో జరిగిన వాగ్వాదం అందరికీ గుర్తుండే ఉంటుంది. తనకు కోచ్ పదవి రాకపోవడానికి గంగూలీనే కారణమని రవిశాస్త్రి తీవ్రస్థాయిలో విమర్శలకు దిగాడు. దానికి దాదాను కూడా ఘాటుగానే రిప్లే ఇచ్చాడు కూడా.



అయితే ఇదంతా జరిగి అప్పుడే ఏడాది అయిపోయింది. కోచ్ గా అనిల్ కుంబ్లే కూడా రాజీనామా చేశాడు. భారత క్రికెట్ జట్టులో అంతర్గత విభేదాల కారణంగా కుంబ్లే తన పదవి నుంచి భారంగా వైదొలిగాడు. ఇదే సమయంలో రవిశాస్త్రి పేరు మరోసారి తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)సైతం మరోసారి దరఖాస్తుల్ని ఆహ్వానించకుండా రవిశాస్త్రి కోసమే అనే వాదన వినిపించింది. ఇక్కడ రవిశాస్త్రి అయితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కోహ్లి చెప్పిన కారణంగానే కోచ్ కోసం మళ్లీ దరఖాస్తులు కోరినట్లు తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే,తన కోచ్ పదవిపై రవిశాస్త్రి కొన్ని షరతులు పెట్టాడనేది సమాచారం. తనను కోచ్ గా చేస్తానని హామీ ఇస్తేనే దరఖాస్తు విషయంలో ముందడుగు వేస్తానని రవిశాస్త్రి చెప్పినట్లు తెలుస్తోంది. కోచ్ ఎంపికలో క్యూలో ఉండదల్చుకోలేదని బీసీసీఐకి తెగేసి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.



గతంలో తనకు ఎదురైన చేదు అనుభవమే రవిశాస్త్రి చేత అలా చెప్పించి ఉండవచ్చు. ఇటీవల బీసీసీఐ ముందుగా దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు రవిశాస్త్రి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. తనను బీసీసీఐ అవమానించిందని భావించిన రవిశాస్త్రి.. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో రవిశాస్త్రిని కోచ్ పదవి వరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే రవిశాస్త్రి కోచ్ దరఖాస్తు కంటే కూడా షరతులతో కూడిన ఒక మెయిల్ ను పంపినట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top