నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది రవిశాస్త్రే!

నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది రవిశాస్త్రే!


నిన్న మొన్నటి వరకు పరుగులు ఎలా వస్తాయో కూడా తెలియనట్లుగా 10, 20 పరుగులు చేయడానికే కష్టపడిన శిఖర్ ధావన్.. ఉన్నట్టుండి ప్రపంచకప్ పోటీలు మొదలవగానే రెచ్చిపోయాడు. రెండు ఇన్నింగ్స్లో 105 పరుగుల సగటుతో వీర బాదుడు బాదేశాడు. ఇక శనివారం యూఏఈతో మ్యాచ్ ఉండటంతో ఈ సగటు మరింత పెరుగుతుందనే భావిస్తున్నారు. కానీ ఒక్కసారిగా అతడిలో ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి ఆత్మవిశ్వాసం అంటూ వచ్చిందంటే ఇక ఇన్నింగ్స్ మీద ఇన్నింగ్స్ వరసపెట్టి కొట్టడమేనంటున్నాడు శిఖర్ ధావన్. ఆస్ట్రేలియా సిరీస్లో వరుస వైఫల్యాల తర్వాత.. తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన వ్యక్తి రవిశాస్త్రేనని చెప్పాడు.



తన వైఫల్యాలపై ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయి.. కష్టపడటం మొదలుపెట్టానన్నాడు. అది తనకు నేర్చుకోడానికి బాగా ఉపయోగపడిందని, చిన్న చిన్న మార్పులు చేసుకుని మంచి ఫలితాలు సాధించానని అన్నాడు. ఆ సమయంలో రవిభాయ్ తమకు తోడుగా ఉండటం ఎంతో ఉపయోగపడిందని, ఆయన తనలో బోలెడంత విశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచారని ధావన్ చెప్పాడు. అదికూడా సరిగ్గా తనకు అవసరమైన సమయంలోనే ఆయన రావడం చాలా ఎనర్జీ ఇచ్చిందన్నాడు. జట్టు మొత్తం కూడా తనకు చాలా అండగా ఉందని, ఇందుకు వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు. యూఏఈ గురించి తనకు దాదాపు ఏమీ తెలియదని, వాళ్ల వీడియోలు కూడా ఇంతవరకు చూడలేదని అందువల్ల ప్రాక్టీసు అయిపోయి హోటల్కు వెళ్లగానే ముందు వాళ్ల వీడియోలు చూడాలని చెప్పాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top