‘వర్షం’ కలిసొచ్చింది!

‘వర్షం’ కలిసొచ్చింది!


బోనస్‌లు, రన్‌రేట్‌లతో పని లేదు. గణాంకాల లెక్కలు అవసరంలేదు. అనుకోని అతిథిలా వచ్చిన వర్షం ఓ రకంగా భారత్‌ను ఆదుకుంది. చివరి మ్యాచ్‌లో ఎలాంటి గందరగోళం లేకుండా చేసింది. ఇక ‘నాకౌట్’ మ్యాచ్ ఒక్కటే మిగిలింది. ముక్కోణపు సిరీస్‌లో భారత్ ఫైనల్ చేరాలంటే ఇంగ్లండ్‌ను ఓడిస్తే చాలు. ఓడితే, ఇక నేరుగా ప్రపంచ కప్ బరిలోకే.

 

సిడ్నీ: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా సోమవారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. మొదటి నుంచి వాతావరణం మ్యాచ్‌ను ఇబ్బంది పెట్టినా... 16 ఓవర్ల అనంతరం వచ్చిన వర్షం ఆ తర్వాత ఏ మాత్రం తెరిపినివ్వలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఆ సమయానికి భారత్ 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది.



ఫలితంగా ఇరు జట్లకు చెరో 2 పాయింట్లు కేటాయించారు. టోర్నీలో ఆస్ట్రేలియా (15 పాయింట్లు) ఇప్పటికే ఫైనల్ చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 2, ఇంగ్లండ్ ఖాతాలో 5 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి చివరి లీగ్ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు ఫైనల్‌కు అర్హత సాధిస్తారు. ఈనెల 30న పెర్త్‌లో జరిగే ఈ మ్యాచ్ ఒక వేళ రద్దయితే అప్పుడు ఇంగ్లండ్ ముందుకు వెళుతుంది.

 

ధావన్ మళ్లీ విఫలం...

టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ బెయిలీ, భారత్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. గాయాల నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా... ఉమేశ్, భువనేశ్వర్‌ల స్థానాల్లో జట్టులోకి వచ్చారు. చిరుజల్లుల కారణంగా మ్యాచ్ 40 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కాగా, 2.4 ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. ఫామ్‌లో లేని ధావన్ (8) మళ్లీ నిరాశపరిచాడు. రాయుడు (24 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) దూకుడగా ఆడి అవుట య్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మ్యాచ్ నిలిచిపోయింది. దాదాపు మూడు గంటలకు పైగా వర్షం ఆగకపోవడంతో మ్యాచ్ రద్దయింది.

 

స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రహానే (నాటౌట్) 28, ధావన్ (సి) ఫించ్ (బి) స్టార్క్ 8; రాయుడు (సి) వార్నర్ (బి)  మార్ష్ 23; కోహ్లి (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16 ఓవర్లలో 2 వికెట్లకు) 69; వికెట్ల పతనం: 1-24; 2-62; బౌలింగ్: స్టార్క్ 4-0-11-1; హాజల్‌వుడ్ 5-0-25-0; మిషెల్ మార్ష్ 3-0-21-1; డోహర్తి 3-0-10-0; ఫాల్క్‌నర్ 1-0-2-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top