వాన వెంటాడింది!

వాన వెంటాడింది! - Sakshi


తొలి రోజు 15 ఓవర్ల ఆట  

   భారత్ 50/2  

  శ్రీలంకతో మూడో టెస్టు


 

 శ్రీలంక పర్యటనలో ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టని వరుణుడు కీలక టెస్టులో తానున్నానంటూ వచ్చేశాడు. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే మూడో టెస్టు తొలి రోజే వర్షం బారిన పడింది. స్వింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై లంక పేసర్ల ధాటికి తడబాటుతో ప్రారంభమైన భారత ఇన్నింగ్స్ వాన కారణంగా గంట మాత్రమే సాగింది. అయితే ఇంత తక్కువ సమయంలోనే టీమిండియాకు అదృష్టం కూడా కలిసి రావడంతో పతనం రెండు వికెట్ల వద్దే ఆగింది.

 

 కొలంబో: భారత్, శ్రీలంక చివరి టెస్టు మ్యాచ్ తొలి రోజు ఎక్కువ భాగం వర్షార్పణమైంది. భారీ వర్షం కారణంగా శుక్రవారం 15 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు నష్టపోయి 50 పరుగులు చేసింది. నాలుగు ఓవర్ల లోపే లోకేశ్ రాహుల్ (2), అజింక్య రహానే (8) పెవిలియన్ చేరగా... ప్రస్తుతం పుజారా (19 బ్యాటింగ్), కోహ్లి (14 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. మొదటి రోజు దాదాపు 75 ఓవర్ల ఆట నష్టం జరగడంతో టెస్టు మిగతా నాలుగు రోజుల్లో మ్యాచ్‌ను 15 నిమిషాలు ముందుగా ప్రారంభించి, చివర్లో మరో 15 నిమిషాలు పొడిగిస్తారు. 15 ఓవర్ల తర్వాత పడిన వర్షం కొద్దిసేపటి తర్వాత పెరగడం, మళ్లీ ఆగడం, మరోసారి రావడం, అంపైర్ల పరిశీలన... ఇలా పదే పదే జరిగింది. చివరకు ఆట సాధ్యం కాదని తేలడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు.

 

 రెండో బంతికే...

 టాస్ గెలిచిన శ్రీలంక పిచ్‌పై తేమను దృష్టిలో ఉంచుకొని బౌలింగ్ ఎంచుకొంది. ఆ జట్టు మూడు మార్పులతో బరిలోకి దిగగా... భారత జట్టులో మురళీ విజయ్ స్థానంలో పుజారా, వృద్ధిమాన్ సాహా స్థానంలో నమన్ ఓజా జట్టులోకి వచ్చారు. పిచ్‌ను పూర్తిగా ఉపయోగించుకున్న లంక పేస్ బౌలర్లు భారత్‌ను ఆసాంతం ఇబ్బంది పెట్టారు. దమ్మిక ప్రసాద్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతినే కష్టంగా ఎదుర్కొన్న రాహుల్... రెండో బంతిని ఆడకుండా చేతులెత్తేశాడు. అది వికెట్లను గిరాటేయడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం రెండు చక్కటి ఫోర్లు కొట్టిన రహానే, ప్రదీప్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

 

 బతికిపోయిన కోహ్లి...

 ప్రదీప్ వేసిన ఆరో ఓవర్ తొలి బంతిని పుజారా స్లిప్‌లోకి ఆడగా బంతి కరుణరత్నేకు కాస్త ముందు పడింది. ఎనిమిదో ఓవర్లో కోహ్లికి ప్రమాదం తప్పింది. ప్రదీప్ విసిరిన బంతిని ఆడలేక కోహ్లి కీపర్‌కు సునాయాస క్యాచ్ ఇచ్చాడు. అయితే తొలి టెస్టు ఆడుతున్న కుషాల్ పెరీరా దానిని వదిలేశాడు. ఆ సమయంలో కోహ్లి స్కోరు 8 కాగా, జట్టు స్కోరు 28 మాత్రమే. కుషాల్ వదిలేసిన బంతి కీపర్ వెనక ఉన్న హెల్మెట్‌కు తగలడంతో భారత్‌కు ఐదు ‘పెనాల్టీ’ పరుగులు కూడా వచ్చాయి. తీవ్ర ఒత్తిడిలో ఆడిన కోహ్లి ఆ తర్వాత 9 పరుగుల వద్ద కూడా స్లిప్‌లోకి బంతిని నెట్టినా అది కూడా ఫీల్డర్ ముందు పడింది. తర్వాతి ఓవర్‌లోనే పుజారా రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో భారత్ కొద్దిసేపు ఉత్కంఠను ఎదుర్కొంది.

 

 నమన్ ఓజా అరంగేట్రం

 భారత్ తరఫున టెస్టు క్రికెట్ ఆడిన 285వ ఆటగాడిగా నమన్ ఓజా నిలిచాడు. శుక్రవారం టెస్టు బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్‌కు కెప్టెన్ కోహ్లి టీమ్ క్యాప్‌తోపాటు జెర్సీని అందించాడు. డెరైక్టర్ రవిశాస్త్రి సహా సహచరులు అతడిని అభినందించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన నమన్ గతంలో భారత్ తరఫున ఐదేళ్ల క్రితం రెండు టి20లు, ఒక వన్డే ఆడాడు. 32 ఏళ్ల ఓజాకు 112 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల అనంతరం  భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం రావడం విశేషం. శ్రీలంక తరఫున కుషాల్ పెరీరా కూడా టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. 2000 తర్వాత ఒకే మ్యాచ్‌లో ఇద్దరు వికెట్ కీపర్లు తొలిసారి బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. నాడు సబా కరీం (భారత్), ఖాలెద్ మసూద్ (బంగ్లాదేశ్) తొలి టెస్టు ఆడారు.

 

 స్కోరు వివరాలు

 భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేశ్ రాహుల్ (బి) ప్రసాద్ 2; పుజారా (బ్యాటింగ్) 19; రహానే (ఎల్బీ) (బి) ప్రదీప్ 8; కోహ్లి (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (15 ఓవర్లలో 2 వికెట్లకు) 50

 వికెట్ల పతనం: 1-2; 2-14.

 బౌలింగ్: ప్రసాద్ 4-0-16-1; ప్రదీప్ 6-0-16-1; మ్యాథ్యూస్ 4-2-7-0; హెరాత్ 1-0-6-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top