అంత సులువు కాదు

అంత సులువు కాదు


వింబుల్డన్‌లో విజయంపై నాదల్‌

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచినా... గ్రాస్‌కోర్ట్‌ ఈవెంట్‌లో తాను ఫేవరెట్‌ను కాదని స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ స్పష్టం చేశాడు. 2008, 2010లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌తోపాటు వింబుల్డన్‌ టైటిల్‌ను గెలిచిన ఈ స్టార్‌ ప్లేయర్‌ను మళ్లీ ఈ ఏడాది ఆ ఫీట్‌ ఊరిస్తోంది. సోమవారం విడుదల చేసిన ర్యాం కుల్లో అతను రెండో ర్యాంకుకు ఎగబాకాడు. 2014 తర్వాత నాదల్‌కిదే మెరుగైన ర్యాంకు. ఎప్పటిలాగే పదో టైటిల్‌నూ సుప్రసిద్ధ ఈఫిల్‌ టవర్‌ వద్ద ముద్దాడిన 31 ఏళ్ల రాఫెల్‌ ఫొటో సెషన్‌లో సందడి చేశాడు.



ఇబ్బంది అంతా గాయంతోనే...

‘2012 నుంచి మోకాలి గాయం పదేపదే ఇబ్బంది పెడుతోంది. ప్రత్యేకించి గ్రాస్‌కోర్టులపై ఆడుతుంటే అది మరింత ప్రభావం చూపెడుతోంది. ఈసారి  ఏమవుతుందో చూడాలి. ఇక్కడ క్లేకోర్టులో ఆడినట్లు గ్రాస్‌కోర్టులో ఆడలేం. రెండు మ్యాచ్‌లైతే గెలవొచ్చు... కానీ ఆ తర్వాతే పరిస్థితులు మారతాయి’ అని పదోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ సాధించిన నాదల్‌ అన్నాడు.  వింబుల్డన్‌లో ఐదుసార్లు ఫైనల్‌ చేరినప్పటికీ కేవలం రెండుసార్లే టైటిల్‌ గెలుచుకున్నాడు. ‘ఇపుడైతే నేను రెండో ర్యాంకర్‌ను. మిగతా ఏడాదంతా ఏం జరుగుతుందో చూడాలి. అది నా ఆటతీరుమీదే ఆధారపడి ఉంటుంది’ అని అన్నాడు.



విమర్శకులకు ఇదే నా జవాబు...

గాయాలతో సతమతమవుతున్న నాదల్‌ ఇక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలవలేడనే వారికి తన పదో టైటిలే జవాబిచ్చిందని స్పెయిన్‌ స్టార్‌ అన్నాడు. ‘మూడేళ్ల నుంచి నిన్నమొన్నటి వరకు నా సామర్థ్యంపై ఎన్నో సందేహాలు రేకెత్తించినవారికి నా సత్తాతో సమాధానమిచ్చా. అయినా జీవితమెప్పుడూ సాఫీగా ఉండదు. అలా ఉంటే అహంభావమూ ఉంటుంది. నేను అహంభావిని కాదు’ అని నాదల్‌ చెప్పుకొచ్చాడు. గాయాలు, వైఫల్యాలతో 2015లో పదో ర్యాంకుకు పడిపోయిన నాదల్‌ గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మణికట్టు గాయం వల్ల మూడో రౌండ్లోనే వెనుదిరిగాడు. కానీ ఆరు నెలల వ్యవధిలోనే ఈ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top