నాదల్ జోరు

నాదల్ జోరు


మూడో రౌండ్‌లోకి ప్రవేశం

సెరెనా, క్విటోవా, జొకోవిచ్, ముర్రే కూడా..

వోజ్నియాకి, ప్లిస్కోవాలకు షాక్  

ఫ్రెంచ్ ఓపెన్


 

 పారిస్ : పదేళ్లుగా క్లే కోర్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్... ఈసారి కూడా ఫ్రెంచ్ ఓపెన్‌లో దూసుకుపోతున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆరోసీడ్ నాదల్ 6-4, 6-3, 6-1తో నికోలస్ అల్మెర్గో (స్పెయిన్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. రెండు గంటలా 19 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌కు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. తొలి సెట్‌లో తన సర్వీస్‌లో బ్రేక్ పాయింట్ కాపాడుకుని నాదల్ ఆధిక్యంలోకి రాగా.. స్కోరు 3-5 ఉన్న దశలో అల్మెర్గో మూడు సెట్ పాయింట్లను కాచుకున్నాడు. అయితే ఓ  అద్భుతమైన ఫోర్‌హ్యాండ్‌తో నాదల్ సెట్‌ను ముగించాడు.



రెండోసెట్ ఆరంభంలో అల్మెర్గో సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన నాదల్ బేస్‌లైన్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. నాలుగు, ఆరో గేమ్, తొమ్మిదో గేమ్‌లో రెండు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు. తర్వాత రెండు ఏస్‌లతో సెట్‌ను చేజిక్కించుకున్నాడు. మూడో గేమ్‌లో నాదల్ వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 6-4, 6-4తో గేల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై; మూడోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) 6-2, 4-6, 6-4, 6-1తో జో సోసా (పోర్చుగల్)పై; 9వసీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7-6 (3), 6-1, 6-1తో ఆర్నాబోల్డి (ఇటలీ)పై; పాలెబో అండుజర్ (స్పెయిన్) 6-1, 7-6 (5), 3-6, 3-6, 6-4తో 22వ సీడ్ కోల్చెర్బర్ (జర్మనీ)పై; గోఫిన్ (బెల్జియం)6-3, 4-6, 7-5, 6-2తో గిరాల్డో (కొలంబియా)పై; కొకినాకిస్ (ఆస్ట్రేలియా) 3-6, 3-6, 6-3, 6-4, 8-6తో బెర్నార్డ్ టోమిక్ (ఆస్ట్రియా)పై గెలిచి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు.



 వోజ్నియాకికి నిరాశ

 మహిళల విభాగంలో టాప్‌సీడ్ సెరెనా మూడో రౌండ్‌లోకి ప్రవేశించగా, ఐదో సీడ్ వోజ్నియాకికి నిరాశ ఎదురైంది. సింగిల్స్ రెండో రౌండ్‌లో సెరెనా (అమెరికా) 5-7, 6-3, 6-3తో లెనా ప్రీడ్జమ్ (జర్మనీ)పై నెగ్గగా.... జూలియా జార్జెస్ (జర్మనీ) 6-4, 7-6 (4)తో వోజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది. ఇతర మ్యాచ్‌ల్లో నాలుగోసీడ్ పెట్రా క్విటోవా (చెక్) 6-7 (4), 6-4, 6-2తో సిల్వియా సోలెర్ (స్పెయిన్)పై; షియావోన్ (ఇటలీ) 6-7 (11), 7-5, 10-8తో 18వ సీడ్ కుజ్‌నెత్సోవా (రష్యా)పై; అజరెంకా (బెలారస్) 6-2, 6-3తో హర్డెకా (చెక్)పై; ఆండ్రీ మిట్టూ (రొమేనియా) 2-6, 7-6 (5), 6-4తో 12వ సీడ్ ప్లిస్కోవా (చెక్)పై; సారా ఎరానీ (ఇటలీ) 6-3, 4-6, 6-2తో కరినా వితోఫ్ట్ (జర్మనీ)పై; 10వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ) 4-6, 6-4, 6-4తో లౌర్డెస్ లినో (స్పెయిన్)పై; 16వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6-0, 6-3తో బిలిండా బెనిచ్ (స్విట్జర్లాండ్)పై; పిరంకోవా (బల్గేరియా) 6-3, 7-6 (2)తో అలెత్రోవా (చెక్)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.

 

 మిక్స్‌డ్‌లో సానియా జోడి ఓటమి

 భారత స్టార్ సానియా మీర్జా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడి.. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో నిరాశపర్చింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన ఈ భారత్-బ్రెజిల్ ద్వయం స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చలేదు. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో సానియా-సోరెస్ 2-6, 2-6తో వరుస సెట్లలో అనా గ్రెన్‌ఫీల్డ్ (జర్మనీ)-జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం చవిచూసింది. ఏస్‌లు సంధించడంలో విఫలమైన సానియా జంట... కీలక సమయంలో రెండు డబుల్ ఫాల్ట్‌లు, రెండుసార్లు అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ మొత్తంలో వచ్చిన ఏడు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో సానియా జోడి కేవలం రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు ప్రత్యర్థి జోడి తొమ్మిది అవకాశాల్లో ఏడింటిని నెగ్గి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top