రేసు రసవత్తరం

రేసు రసవత్తరం


భారత జట్టు ప్రపంచకప్ నిలబెట్టుకోవాలంటే కచ్చితంగా మంచి ఓపెనర్లు కావాలి. గత ప్రపంచకప్ విజయంలో సెహ్వాగ్, గంభీర్‌ల పాత్ర మరచిపోలేనిది. ఈసారి ఈ ఇద్దరూ కనుమరుగయ్యారు. ఇంగ్లండ్‌లో రోహిత్ గాయపడటంతో దొరికిన అవకాశాన్ని వినియోగించుకున్న రహానే... నిలకడగా ఆడి ఓపెనర్ స్థానానికి అర్హుడనని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఓపెనర్ల కోసం ముగ్గురి మధ్య పోటీ ఉంది. రహానే, రోహిత్, ధావన్.. ఈ ముగ్గురి మధ్య రేసు మొదలైంది.

 

 సాక్షి క్రీడావిభాగం

 శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా మొదటి మూడు వన్డేల కోసం ప్రకటించిన జట్టులో రోహిత్‌కు స్థానం దక్కలేదు. ఇంగ్లండ్ సిరీస్‌లో గాయపడ్డ తర్వాత రోహిత్ కోలుకున్నా... నేరుగా జట్టులోకి తీసుకోలేదు. సాధారణంగా ధోని, కోహ్లి లాంటి ఆటగాడు గాయపడ్డా... కోలుకుంటే ఎలాంటి పరీక్షలు లేకుండా జట్టులోకి వస్తాడు. కానీ రోహిత్ విషయంలో సెలక్టర్లు నేరుగా ఆ అవకాశం ఇవ్వలేదు. దీనికి కారణం బహుశా తన మీద పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడమే కావచ్చు. వెస్టిండీస్ పర్యటన రద్దు కాకపోయి ఉంటే... టెస్టుకు ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా రోహిత్ మైదానంలో అడుగుపెట్టేవాడేమో.



 శ్రీలంకతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ ఎ తరఫున ఆడే అవకాశం రోహిత్‌కు వచ్చింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు ఈ ముంబై స్టార్ ఆటగాడు. 111 బంతుల్లోనే 142 పరుగులు చేసి... గత ఏడాది ఆస్ట్రేలియాపై సిరీస్‌ను గుర్తు తెచ్చాడు. ఆ సిరీస్‌లో ఏకంగా డబుల్ సెంచరీ చేసిన రోహిత్... మళ్లీ ఆ స్థాయిలో బ్యాట్ ఝళిపించాడు. ఈ మ్యాచ్ ద్వారా అతడి ఆత్మవిశ్వాసం కచ్చితంగా పెరిగి ఉంటుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కూడా రోహిత్ ఆడిన తీరుకు ముగ్ధుడయ్యారు. తనకి పరీక్ష పెట్టారనే కసి రోహిత్‌లో ఉందేమో.... కట్, పుల్, డ్రైవ్, స్వీప్ ఇలా అన్ని ర కాల షాట్లు ఆడి బౌండరీల వర్షం కురిపించాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల్లో ఓపెనర్లుగా ఆడిన రహానే, ధావన్ ఇద్దరూ పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు.



ప్రపంచకప్‌కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియాలో ముక్కోణపు వ న్డే టోర్నీ ఆడుతుంది. కానీ ఆ టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి భారత జట్టును ప్రపంచకప్ కోసం ప్రకటించాలి. కాబట్టి ఆటగాళ్ల వన్డే ఆటను పరిశీలించడానికి ప్రస్తుతం జరుగుతున్న శ్రీలంక సిరీస్ ఒక్కటే మంచి మార్గం. ఆఖరి రెండు వన్డేలకు రోహిత్ జట్టులోకి రావడం ఖాయం. కాబట్టి తొలి మూడు వన్డేల్లో ధావన్, రహానేల ద్వయం ఏం చేస్తారో చూడాలి. ప్రపంచకప్‌కు ఓ రిజర్వ్ ఓపెనర్ కూడా ఉండాలి. కాబట్టి ఈ ముగ్గురూ మెగా టోర్నీకి ఎంపికైతే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఏ ఇద్దరు తుది జట్టులో ఉంటారనేదే ఆసక్తికరం. ఎవరి అవకాశాలు ఎంతనేది చూద్దాం...



 రోహిత్ శర్మ: గతంలో మిడిలార్డర్‌లో ఆడినా.. ఏడాదికిపైగా ఓపెనర్‌గానే ఆడుతున్నాడు. స్వదేశంలో చెలరేగి ఆడటం తనకు సానుకూలాంశం. అయితే తను ఓపెనర్ అయ్యాక పూర్తి స్థాయిలో పరీక్ష ఎదురుకాలేదు. ఇంగ్లండ్‌లో పేస్ వికెట్‌పై ఆడిన ఒక్క ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. రోహిత్ పూర్తి ఫిట్‌నెస్, ఫామ్‌తో ఉంటే తను ఓపెనర్‌గా ఆడటమే మంచిది.



 శిఖర్ ధావన్: సాధారణంగా కుడి, ఎడమల కాంబినేషన్‌తో ఓపెనర్లు ఉండాలని మెజారిటీ జట్లు కోరుకుంటాయి. రేసులో ఉన్న ముగ్గురిలో ధావన్ ఒక్కడే ఎడమచేతి వాటం ఆటగాడు. ఇది తనకు పెద్ద సానుకూలాంశం. అయితే ఫామ్‌లో లేకపోతే కాంబినేషన్ ను పట్టించుకోరు. గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్‌ను భారత్ గెలుచుకోవడంలో తనదే కీలక పాత్ర. అయితే గత ఏడాది కాలంగా మాత్రం పూర్తి సామర్థ్యంతో ఆడలేకపోతున్నాడు.



 అజింక్య రహానే: దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో రహానేకు ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. అందుకే ఇంగ్లండ్‌లో రోహిత్ గాయపడగానే రహానే ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. బ్యాకప్‌గా విజయ్‌ను పిలిపించినా... ఇంగ్లండ్‌లో రహానే ఆటతీరు చూశాక భారత్ మరో ఓపెనర్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదు. రహానేను ఓపెనర్‌గా ఆడించాలనేది ధోని ఆలోచన. ఒకవేళ రోహిత్ వచ్చినా మిడిలార్డర్‌లో ఆడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జట్టు మేనేజ్‌మెంట్ చేస్తోంది.



 భారత సెలక్టర్లకు ఓపెనర్ల విషయంలో ఉన్న అనుమానాలు శ్రీలంకతో ఐదు వన్డేలు ముగిసే సరికే తీరిపోతాయి. రోహిత్ చివరి రెండు వన్డేలకు రావడం ఖాయమే అయితే... ప్రస్తుతం ఉన్న ఇద్దరిలో ఎవరు తప్పుకుంటారనే ప్రశ్నకు తొలి మూడు వన్డేల ద్వారా సమాధానం దొరుకుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top