సింధు శుభారంభం

సింధు శుభారంభం


ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి

ప్రణయ్‌ ముందంజ, జయరామ్‌ ఓటమి




బర్మింగ్‌హామ్‌: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన భారత స్టార్‌ పీవీ సింధు ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆరో సీడ్‌ సింధు 21–10, 21–11తో ప్రపంచ 33వ ర్యాంకర్‌ మెట్టీ పుల్సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధుకు ఏ దశలోనూ ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురుకాలేదు. తొలి గేమ్‌లో స్కోరు 7–6 వద్ద ఈ హైదరాబాద్‌ అమ్మాయి వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి 11–7తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఒకసారి వరుసగా మూడు, అనంతరం వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ ఆరంభం నుంచి సింధు ఆధిపత్యం చలాయించింది. స్కోరు 7–4 వద్ద సింధు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి 13–4తో ముందంజ వేసి ఇక వెనుదిరిగి చూడలేదు. గురు వారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో దినార్‌ దియా అయుస్తిన్‌ (ఇండోనేసియా)తో సింధు తలపడుతుంది. ఐదోసారి ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో ఆడుతోన్న సింధు గతంలో ఏనాడూ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.



మిశ్రమ ఫలితాలు

మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్‌లో ప్రపంచ 21వ ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 17–21, 22–20, 21–19తో కియో బిన్‌ (చైనా)పై కష్టపడి గెలుపొందగా... భారత నంబర్‌వన్, ప్రపంచ 19వ ర్యాంకర్‌ అజయ్‌ జయరామ్‌ 19–21, 13–21తో ప్రపంచ 27వ ర్యాంకర్‌ హువాంగ్‌ జియాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. గతంలో హువాంగ్‌పై మూడుసార్లు నెగ్గిన జయరామ్‌ ఈసారి మాత్రం చేతులెత్తేయడం గమనార్హం. పురుషుల డబుల్స్‌ తొలిరౌండ్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి (భారత్‌) ద్వయం 19–21, 21–10, 18–21తో పీటర్‌ బ్రిగ్స్‌–టామ్‌ ఉల్ఫెండ్‌సన్‌ (ఇంగ్లండ్‌) జంట చేతిలో... మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన–పూర్వీషా రామ్‌ (భారత్‌) జోడీ 19–21, 12–21తో సు యా చింగ్‌–వు తి జంగ్‌ (చైనీస్‌ తైపీ) జంట చేతిలో ఓడిపోయాయి.



ఇండియా ఓపెన్‌లో సింధు , సైనా  

మరోవైపు ఈ నెలాఖర్లో న్యూఢిల్లీలో జరిగే ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ ముఖాముఖిగా తలపడే అవకాశం ఉంది. మార్చి 28 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను బుధవారం విడుదల చేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు తొలి రౌండ్‌లో జియావో లియాంగ్‌ (సింగపూర్‌)తో... చియా సిన్‌ లీ (చైనీస్‌ తైపీ)తో సైనా తలపడతారు. తొలి రౌండ్‌ను దాటితే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సెనా కవాకామి (జపాన్‌)తో సింధు... పోర్న్‌పవీ చోచువోంగ్‌ (థాయ్‌లాండ్‌)తో సైనా ఆడే అవకాశముంది. ఈ అడ్డంకిని అధిగమిస్తే క్వార్టర్‌ ఫైనల్లో సైనా, సింధు ఆడతారు. ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికపై సైనా, సింధు ఏకైకసారి 2014 సయ్యద్‌ మోది గ్రాండ్‌ప్రి గోల్డ్‌ టోర్నీలో పోటీపడగా... సైనా పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్‌ తొలి రౌండ్‌లో క్వాలిఫయర్స్‌తో ఆడతారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top