‘సూపర్’ పంజాబ్

‘సూపర్’ పంజాబ్


ఇక ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో మొండిగా పోరాడిన పంజాబ్... రాజస్తాన్ రాయల్స్ విజయాల జోరుకు నాటకీయంగా బ్రేక్ వేసింది. తొలుత మ్యాచ్‌ను టై చేసుకుని... ఆ తర్వాత సూపర్ ఓవర్లో గెలిచింది. సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన షాన్‌మార్ష్... పంజాబ్ పాలిట ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. సంచలన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్న మార్ష్... సూపర్ ఓవర్లో చెలరేగి పంజాబ్‌కు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందించాడు.



 రాజస్తాన్ వరుస విజయాలకు బ్రేక్

సూపర్ ఓవర్‌లో నెగ్గిన కింగ్స్ ఎలెవన్

షాన్‌మార్ష్ సంచలన ఇన్నింగ్స్


అహ్మదాబాద్: నరాలు తెగే ఉత్కంఠ... ఇరు జట్లతో విజయం దోబూచులాట... చెరో 20 ఓవర్ల పాటు ఆడినా రాని ఫలితం... వెరసి ఈ సీజన్ ఐపీఎల్‌లో తొలిసారి అద్భుతమైన మ్యాచ్ జరిగింది. పంజాబ్, రాజస్తాన్‌ల మధ్య టై అయిన మ్యాచ్‌లో... సూపర్ ఓవర్ ద్వారా కింగ్స్ ఎలెవన్ విజయం సాధించింది. తొలుత ఇరు జట్లూ 20 ఓవర్లలో 191 పరుగులు చేయగా... సూపర్ ఓవర్‌లో పంజాబ్ 15 పరుగులు చేస్తే, రాజస్తాన్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.  



సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భుజం గాయంతో బాధపడుతున్న బెయిలీ స్థానంలో సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. రహానే (54 బంతుల్లో 74; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వాట్సన్ (35 బంతుల్లో 45; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కరుణ్ నాయర్ (13 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. తర్వాత పంజాబ్ కూడా 20 ఓవర్లలో ఆరు వికెట్లకు సరిగ్గా 191 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (40 బంతుల్లో 65; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. మిల్లర్ (30 బంతుల్లో 54; 1 ఫోర్, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు.

 

రహానే నిలకడ: ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించిన ఓపెనర్లు రహానే, వాట్సన్‌లు వేగంగా ఆడారు. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీలతో స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టిన వాట్సన్... తర్వాతి ఓవర్‌లోనూ మరో సిక్సర్ బాదడంతో రాజస్తాన్ తొలి 10 ఓవర్లలో 90 పరుగులు చేసింది. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 12వ ఓవర్‌లో వాట్సన్‌ను అవుట్ చేసి అక్షర్ పటేల్ విడగొట్టాడు.



దీంతో తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన హుడా (9 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. రహానేతో కలిసి రెండో వికెట్‌కు 41 పరుగులు జోడించి అవుటయ్యాడు. మూడు బంతుల తేడాలో స్మిత్ (0) కూడా వెనుదిరగడంతో పంజాబ్ మళ్లీ పుంజుకుంది. తర్వాత కరణ్ నాయర్ వేగంగా ఆడాడు. రహానేతో కలిసి నాలుగో వికెట్‌కు కేవలం 13 బంతుల్లో 25 పరుగులు జోడించాడు. అయితే రహానేతో పాటు వరుస ఓవర్లలో ఫాల్క్‌నర్ (1), నాయర్‌లు అవుట్ కావడంతో భారీ స్కోరుకు కళ్లెం పడింది.

 

విజృంభించిన బౌలర్లు: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌ను రాజస్తాన్ బౌలర్లు దెబ్బతీశారు. వరుస విరామాల్లో విజయ్ (18 బంతుల్లో 21; 2 సిక్సర్లు), సెహ్వాగ్ (1), మ్యాక్స్‌వెల్ (1)లను అవుట్ చేసి ఒత్తిడి పెంచారు. అయితే మార్ష్, మిల్లర్‌లు చెలరేగి ఆడి నాలుగో వికెట్‌కు 35 బంతుల్లోనే 58 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. ఈ దశలో మార్ష్ అవుటైనా... మిల్లర్ భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. సాహా (8 బంతుల్లో 19; 4 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 35 పరుగులు జోడించి విజయంపై ఆశలు రేకేత్తించారు. అయితే ఈ ఇద్దరు స్వల్ప విరామాల్లో అవుటైనా.. చివర్లో అక్షర్ పటేల్ (12 నాటౌట్; 1 ఫోర్), జాన్సన్ (13 నాటౌట్; 1 ఫోర్)లు చెలరేగిపోయారు. ఆఖరి ఓవర్‌లో 14 పరుగులు చేయాల్సిన దశలో 13 పరుగులు చేశారు. చివరి బంతికి అక్షర్ పటేల్ బౌండరీ కొట్టడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది.

 

సూపర్ ఓవర్ సాగిందిలా!

మొదట పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది.

మోరిస్ వేసిన తొలి బంతికి మిల్లర్ అవుట్‌కాగా, రెండో బంతికి మ్యాక్స్‌వెల్ సింగిల్ తీశాడు.

తర్వాత వరుసగా మూడు బంతులకు మార్ష్ మూడు ఫోర్లు కొట్టాడు. ఇందులో ఒకటి నోబాల్.

ఇక చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగే  రావడంతో పాటు మార్ష్ రనౌటయ్యాడు. దీంతో పంజాబ్ మొత్తం 15 పరుగులు చేసింది.

16 పరుగుల విజయలక్ష్యంతో రాజస్తాన్ బరిలోకి దిగింది.

జాన్సన్ వేసిన తొలి బంతికి వాట్సన్ బౌల్డయ్యాడు. తర్వాతి బంతికి స్మిత్ ఫోర్ కొట్టినా. అది నోబాల్ కావడంతో మొత్తం 5 పరుగులు వచ్చాయి. తర్వాతి బంతికి సింగిల్ తీశాడు.

మూడో బంతికి ఫాల్క్‌నర్ అనూహ్యంగా రనౌట్‌కావడంతో రాజస్తాన్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓడింది.

 

స్కోరు వివరాలు:

రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (సి) సాహా (బి) జాన్సన్ 74; వాట్సన్ (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ 45; హూడా (బి) శివమ్ శర్మ 19; స్మిత్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 0; కరణ్ నాయర్ (సి) అక్షర్ (బి) అనురీత్ 25; ఫాల్క్‌నర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ 1; బిన్నీ నాటౌట్ 12; శామ్సన్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191.

వికెట్ల పతనం: 1-95; 2-136; 3-137; 4-162; 5-166; 6-175.

బౌలింగ్: సందీప్ 4-0-25-1; అనురీత్ 4-0-41-1; జాన్సన్ 4-0-33-1; అక్షర్ పటేల్ 4-0-30-2; శివమ్ శర్మ 3-0-44-1; మ్యాక్స్‌వెల్ 1-0-15-0.

 

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: విజయ్ రనౌట్ 21; సెహ్వాగ్ రనౌట్ 1; షాన్ మార్ష్ (సి) రహానే (బి) తాంబే 65; మ్యాక్స్‌వెల్ (సి) స్మిత్ (బి) టెవాటియా 1; మిల్లర్ (సి) బిన్నీ (బి) హుడా 54; సాహా (బి) మోరిస్19; అక్షర్ నాటౌట్ 12; జాన్సన్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191.

వికెట్ల పతనం: 1-3; 2-42; 3-59; 4-117; 5-152; 6-166.

బౌలింగ్: మోరిస్ 4-0-34-1; బిన్నీ 2-0-13-0; ఫాల్క్‌నర్ 4-0-41-0; తాంబే 3-0-20-1; టెవాటియా 3-0-31-1; హూడా 3-0-35-1; వాట్సన్ 1-0-13-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top