ప్రత్యర్థిని భయపెట్టడం అవసరం!

ప్రత్యర్థిని భయపెట్టడం అవసరం!


* మాటల యుద్ధం ఎప్పటికీ ఆగదు

* మిషెల్ జాన్సన్ వ్యాఖ్య


మెల్‌బోర్న్: బ్రిస్బేన్ టెస్టులో భారత ఓటమిని శాసించిన ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ ఏడాది క్రితం ఇంతకంటే ప్రమాదకర ఆటగాడిగా కనిపించాడు. అతని ధాటికి బతుకు జీవుడా... అంటూ ఆడిన ఇంగ్లండ్ 0-5తో యాషెస్ సిరీస్‌ను సమర్పించుకుంది. ప్రత్యర్థిని భయపెడుతూ వికెట్లు తీసే తనదైన శైలి గురించి జాన్సన్ తన మనసులో మాటను వెల్లడించాడు. ‘మిషెల్ జాన్సన్: బౌన్సింగ్ బ్యాక్’ పేరుతో రూపొందిన డీవీడీ విడుదల సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ శరీరాలను లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేయడం కూడా మా యాషెస్ విజయానికి ఒక కారణం.



ఆటగాళ్లపైకి దాడి చేసినట్లుగా బౌలింగ్ ఉండాలి. యాషెస్ ఆఖరి టెస్టులో అవుటైన క్షణం ఒక్కసారి గుర్తు చేసుకోండి. ‘హమ్మయ్య... ఇక అయిపోయింది’ అనే ఉపశమనం అతని మొహంలో కనిపించింది. ముఖ్యంపై లోయర్ ఆర్డర్‌లో భయం పుట్టించాలి’ అని జాన్సన్ చెప్పాడు. మైదానంలో జరిగే మాటల యుద్ధానికి ముగింపు ఎప్పటికీ ఉండదని అతను అన్నాడు. ఏదో ఒక మాటతో ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించాలని అంతా ప్రయత్నిస్తారని, కొన్నిసార్లు అది పని చేస్తే మరికొన్ని సార్లు వ్యతిరేక ఫలితం ఇస్తుందని వ్యాఖ్యానించాడు.



‘కొన్ని సార్లు మేం అర్థంపర్థం లేని మాటలు అంటాం. కానీ కొన్ని సార్లు అవి నేరుగా బ్యాట్స్‌మెన్ మనసుపై ప్రభావం చూపిస్తాయి. నీ పాదాల కదలిక బాగా లేదనో, షార్ట్ బంతి వేస్తున్నామనే చెబితే అతను ఎంత వద్దనుకున్నా దానిపై దృష్టి మళ్లుతుంది. అది బౌలర్‌కు అనుకూలంగా మారుతుంది. ఇది నాకు ఇష్టం. నాకు తెలిసి ఇలాంటి మాటల యుద్ధం ఎప్పటికీ ఆగదు’ అని లెఫ్టార్మ్ పేసర్ అభిప్రాయపడ్డాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top