టైటాన్స్‌కు షాక్

టైటాన్స్‌కు షాక్


వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమనేదే లేని తెలుగు టైటాన్స్ కీలక పోరులో చతికిలపడింది. సొంత గడ్డపై పూర్తి స్థాయిలో ప్రేక్షకుల మద్దతు లభించినా మరోసారి సెమీఫైనల్లోనే చిత్తయ్యింది. ప్రథమార్ధంలో తెగువ చూపించినా ఆ తర్వాత పేలవ ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచింది. అటు పెద్దగా స్టార్ ఆటగాళ్లు లేకున్నా సమష్టి ఆటతీరుతో రాణించిన జైపూర్ పింక్ పాంథర్స్ రెండోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్‌లో పట్నా జట్టు పుణెరిపై గెలిచింది.

 

* సెమీస్‌లో జైపూర్ చేతిలో ఓటమి   

* ప్రొ కబడ్డీ లీగ్


సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై తెలుగు టైటాన్స్‌కు షాక్ తగిలింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో సెమీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టైటాన్స్ 24-34 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో మట్టికరిచింది. తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన జైపూర్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. టైటాన్స్ నుంచి రాహుల్ చౌదరి 9, నీలేశ్ 6 రైడింగ్ పాయింట్లు సాధించగా జైపూర్ తరఫున కెప్టెన్ జస్వీర్ సింగ్  7 రైడింగ్, 2 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు.

 

ఆదివారం జరిగే ఫైనల్లో జైపూర్ జట్టు పట్నా పైరేట్స్‌తో ఢీకొంటుంది. మూడో స్థానం కోసం జరిగే పోరులో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టన్‌తో ఆడుతుంది. మ్యాచ్ ప్రథమార్ధంలో ఇరు జట్లు కొదమసింహాల్లా తలపడడంతో  పాయింట్ల మధ్య పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. దీంతో  18వ నిమిషం వరకు కూడా స్కోరు 8-8తో సమానంగానే ఉంది. ఈ దశలో టైటాన్స్‌కు నీలేష్ ఓ పాయింట్ తేగా వెంటనే జైపూర్‌కు అజయ్ కుమార్ రెండు పాయింట్లు తేవడంతో 10-9తో పైచేయి సాధించింది. ఆ తర్వాత రాహుల్ విజయవంతమైన రైడ్‌తో జట్టు ప్రథమార్ధాన్ని 11-10స్వల్పఆధిక్యంతో ముగించింది.



కానీ ద్వితీయార్ధంలో టైటాన్స్ ఆట పూర్తిగా గతి తప్పింది. దీంతో జైపూర్ రెచ్చిపోయింది. జస్వీర్ సింగ్ సూపర్ రైడింగ్‌తో అదరగొట్టాడు. దీంతో వరుసగా పాయింట్లు సాధిస్తూ టైటాన్స్‌ను ఆలౌట్ చేయడంతో జైపూర్ 17-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఒక్క పాయిం ట్‌నూ కోల్పోకుండా టైటాన్స్‌ను మరోసారి ఆలౌట్ చేయడంతో స్కోరు 26-14కు పెరిగింది. 33వ నిమిషంలో రాహుల్ వరుసగా తన రెండు రైడింగ్‌లలో రెండేసి చొప్పున 4 పాయింట్లు సాధించాడు. 34వ నిమిషంలో జైపూర్ సూపర్ ట్యాకిల్‌లో రాహుల్‌ను అవుట్ చేసి రెండు పాయింట్లు రాబట్టింది. చివరి రెండు నిమిషాల్లో వ్యత్యాసం పది పాయింట్లు తేడా ఉండడంతో టైటాన్స్ చేసేదేమీ లేకుండా పోయింది.

 

పట్నా వరుసగా రెండోసారి: డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ వరుసగా రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ఈ జట్టు 37-33 తేడాతో పుణెరి పల్టన్‌పై నెగ్గింది.  పట్నా నుంచి పర్దీప్ నర్వాల్ 8, రాజేశ్ 6 రైడింగ్ పాయింట్లతో రాణించగా కుల్దీప్  5 ట్యాకిల్ పాయింట్లు సాధించాడు. పుణెరిలో దీపక్ హుడా 9 పాయింట్లు సాధించాడు. తొలి పది నిమిషాలపాటు మ్యాచ్ 6-6 పాయింట్లతో పోటాపోటీగా సాగింది. ఈ దశలో పర్మోద్ నర్వాల్ మూడు పాయింట్లు తేవడంతో పుణెరి ఆధిక్యంలోకి వెళ్లినా మరో ఆరు నిమిషాల వరకు పట్నా హవా సాగింది. వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించి 15-9తో పుంజుకుంది.



ఇదే జోరుతో తొలి అర్ధభాగాన్ని 16-13తో ముగించింది. అయితే ద్వితీయార్ధంలో పుణెరి మెరుగ్గా ఆడింది. 32వ నిమిషంలో పట్నాను ఆలౌట్ చేయడంతో పుణెరి 25-22తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ఆధిక్యం దాదాపు చివరి వరకు కాపాడుకున్నా ఆ తర్వాత మాత్రం చేజార్చుకుంది. 37వ నిమిషంలో రాజేశ్ మొండల్ రెండు పాయింట్లు తేవడంతో పట్నా మ్యాచ్‌ను 29-29తో సమం చేసింది. ఇక పర్దీప్ నర్వాల్ సూపర్ రైడ్‌తో దూసుకెళ్లిన పట్నా మరోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top