కూతకు వేళాయె

కూతకు వేళాయె


నేటినుంచి ప్రొ కబడ్డీ లీగ్

సీజన్-4 వేలంతో మారిన ఆటగాళ్లు

జూలై 31న హైదరాబాద్‌లో ఫైనల్






తొలి ఏడాది సక్సెస్... కొన్ని సార్లు టీవీ రేటింగ్‌లు ఐపీఎల్ మ్యాచ్‌ల స్థాయిలో ఉన్నాయి. రెండో సంవత్సరం సూపర్ సక్సెస్... కబడ్డీ గురించి తెలియనివారు కూడా ఒక్కసారిగా ఇదేదో చూసేద్దాం అనే ఆసక్తి చూపించారు. అదే ఉత్సాహంలో మూడో సీజన్‌ను కూడా జనం మెచ్చేశారు... ఇక ప్రొ కబడ్డీ భారత అభిమానుల స్పోర్ట్స్ మెనూలో భాగమైపోయింది. అంతే... మీ ఆదరణ ఉంటే ఏడాదికి రెండుసార్లు అంటూ నిర్వాహకులు సిద్ధమయ్యారు. అటు నగరాలను, ఇటు గ్రామాలను ఏకకాలంలో అలరించిన ఫలితమే... ఇప్పుడు 2016లో రెండోసారి ప్రొ కబడ్డీ లీగ్. కొత్త జట్లకు మారిన ఆటగాళ్లు నాలుగో సీజన్‌లో ‘అస్లీ పంగా’ అంటూ తొడకొట్టేందుకు సిద్ధమైపోయారు.

 



ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్‌కు రంగం సిద్ధమైంది. సీజన్-4లో భాగంగా నేటి (శనివారం) నుంచి మ్యాచ్‌లు జరగనున్నాయి. ముంబైలో జరిగే తొలి మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌తో తెలుగు టైటాన్స్ తలపడుతుండగా, మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్లు జైపూర్ పింక్ పాంథర్స్, యు ముంబై అమీతుమీ తేల్చుకోనున్నాయి. తొలి మూడు సీజన్లలాగే ఈ సారి కూడా ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లతో పాటు నాలుగు నాకౌట్ మ్యాచ్‌లు కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. పుణే మినహా మిగతా ఏడు జట్లకు చెందిన నగరాలలో మ్యాచ్‌లు జరుగుతాయి. జూలై 29న సెమీ ఫైనల్, జూలై 31న ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాద్ వేదిక కానుంది.





రూ. 12.82 కోట్లతో...

ఐపీఎల్ తరహాలోనే ప్రొ కబడ్డీ లీగ్‌లో కూడా మూడు సీజన్ల తర్వాత ఆటగాళ్ల కోసం గత నెలలో మళ్లీ వేలం నిర్వహించారు. ప్రతీ జట్టు ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించారు. వేలంలో 198 మంది ఆటగాళ్లు పోటీ పడగా, 96 మందిని ఫ్రాంచైజీలు ఎంచుకున్నాయి. వీరికి చెల్లించిన మొత్తం రూ. 12.82 కోట్లు. అత్యధికంగా మంజీత్ ఛిల్లర్ కోసం బెంగళూరు బుల్స్ రూ. 53 లక్షలు వెచ్చించింది. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఫజెల్ అత్రాచలి (ఇరాన్)కు రూ. 38 లక్షలు దక్కాయి. డిఫెన్స్ సర్వీసెస్‌లో పని చేస్తున్న 15 మంది సైనికులు లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రతిభాన్వేషణలో భాగంగా ప్రతీ జట్టు గతంలో లీగ్ ఆడిన అనుభవం లేని 18-22 ఏళ్ల వయసు గల ముగ్గురు యువ ఆటగాళ్లను కూడా ఎంచుకున్నాయి.





పెరుగుతున్న ఆదరణ

ప్రొ కబడ్డీ లీగ్‌లో ఈసారి భారత్‌తో పాటు 12 దేశాలకు చెందిన 24 మంది ఆటగాళ్లు పాల్గొంటుండటం విశేషం. వీటిలో కెన్యా, జపాన్, ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇద్దరు పాకిస్తానీలు తెలుగు టైటాన్స్ టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు.  మూడు సీజన్లలో టీవీ రేటింగ్‌ను అంతకంతకూ పెంచుకున్న ఈ లీగ్ నాలుగో సీజన్‌ను దాదాపు వంద దేశాల్లో ప్రసారం చేయాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

 టైటాన్స్ టైటిల్ కల!

 

ప్రొ కబడ్డీ లీగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల అభిమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న టైటాన్స్ జట్టు గత మూడు ప్రయత్నాల్లోనూ ఫైనల్‌కు చేరడంలో విఫలమైంది. హైదరాబాద్‌లో జరిగిన 2015 సీజన్‌లో మెరుగ్గా రాణించిన జట్టు మూడో స్థానంలో నిలిచింది. తొలి ఏడాది, ఆ తర్వాత మూడో సీజన్‌లో మాత్రం ఐదో స్థానంతోనే సరిపెట్టుకుంది. రాహుల్ చౌదరి రూపంలో స్టార్ ప్లేయర్ జట్టులో ఉండగా, సుకేశ్ హెగ్డే మరో కీలక ఆటగాడు. ఈ సారి సందీప్ నర్వాల్, జస్మీర్ సింగ్‌లను తీసుకోవడంతో టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. మూడు సీజన్లలో కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ 22 గెలిచి 16 ఓడింది.



మరో 6 మ్యాచ్‌లు ‘టై’గా ముగిశాయి. ఈసారి జట్టు తొలి లక్ష్యం సెమీ ఫైనల్ చేరుకోవడం. హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడని జట్టు... సెమీస్ చేరితే సొంతగడ్డపై విజయావకాశాలుంటాయి.



తెలుగు టైటాన్స్ జట్టు: రాహుల్ చౌదరి (కెప్టెన్), సుకేశ్ హెగ్డే, సందీప్ నర్వాల్, సందీప్ ధుల్, జస్మేర్ సింగ్ గులియా, రూపేశ్ తోమర్, వినోద్ కుమార్, ప్రపంజన్, నీలేశ్ సాలుంకే, వినోత్ కుమార్, శశాంక్ వాంఖడే, సాగర్ కృష్ణ, విశాల్ భరద్వాజ్, అతుల్, సోంబిర్ గులియా (భారత్), మొహమ్మద్ మగ్సూద్ (ఇరాన్), అఖ్లాఖ్ హుస్సేన్, మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top