'ఫెదరర్‌తో ఆడటమే అనుభవం'
లండన్:దాదాపు దశాబ్దకాలం టెన్నిస్ ప్రపంచాన్ని ఏలిన స్విస్ దిగ్గజ ఆటగాడు రోజర్ ఫెదరర్ తో ఆడటమే ఒక గొప్ప అనుభవమని బ్రిటన్ ఆటగాడు, ప్రపంచ 772వ ర్యాంకర్ మార్కస్ విలిస్ స్పష్టం చేశాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ రెండో రౌండ్లో ఫెదరర్ చేతిలో పరాజయం చెందిన విలిస్ ఆ పోరును తనకు లభించిన అద్భుతమైన అనుభవంగా అభివర్ణించుకున్నాడు.
'నా ప్రణాళికతో ఫెదరర్ తో ఆటకు సిద్ధమయ్యా. అదో తప్పో తెలీదు కానీ నేను మ్యాచ్ గెలుస్తానని అనుకున్నా. మా ఇద్దరి పోరాటం అమోఘంగా సాగింది.నిజంగా ఫెదరర్‌తో మ్యాచ్‌లో ఎటువంటి ఒత్తిడికి లోను కాలేదు. అతను చక్కటి క్లాస్ తో అలరించాడు. దాంతో నేను కూడా అదే తరహాలో మైదానంలో కదిలా. ఈ మ్యాచ్ ఓడి పోయినా, ఫెదరర్‌తో పోరును ఆద్యంతం ఎంజాయ్ చేస్తూ ఆడా.అతనితో ఆడటమే అద్భుతమైన అనుభవం 'అని విలిస్ తెలిపాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ రెండో రౌండ్లో ఫెదరర్ 6-0, 6-3, 6-4 తేడాతో విలిస్ పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించాడు.