దేవుడు కరుణించలేదు

దేవుడు కరుణించలేదు


మైదానంలో ఎంతో సాధించాలని కలలుగన్నాడు... బంగారంలాంటి భవిష్యత్‌ను ఊహించుకున్నాడు...ప్రాణం కంటే మిన్నగా ఆటను ప్రేమించాడు...బంతులతో ఆడుకున్నాడు... బ్యాట్లతో సావాసం చేశాడు... కానీ ఎన్నడూ జరగని.. ఎప్పుడూ ఊహించని రీతిలో...విధి ఆడిన వింత ‘ఆట'లో ఓడిపోయాడు.



సొంత మైదానం.. అదే ఆట.. అదే బంతి...25 ఏళ్ల యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్‌ను శాశ్వతంగా ఈ లోకం నుంచి తీసుకుపోయింది. విధి ఆడిన ఈ క్రూర నాటకంలో... భగవంతుడూ దయ చూపలేదు... దేవుళ్లుగా భావించే డాక్టర్లూ ప్రాణం నిలుపలేదు. ఇది ఆ కుటుంబానికి కోలుకోలేని విషాదం... క్రికెట్‌కు దుర్దినం.


 

 సిడ్నీ: మెదడుకు గాయంతో రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆస్ట్రేలియా యువ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ (25) మరణాన్ని జయించలేకపోయాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్యాన్ని అందించినా ఫలితం లేకపోయింది. శస్త్రచికిత్స అనంతరం కృత్రిమ కోమాలో ఉన్న హ్యూస్... కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య గురువారం ఆసుపత్రి బెడ్ మీదే కన్నుమూశాడు.



దీంతో క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. మంగళవారం దక్షిణ ఆస్ట్రేలియా-న్యూ సౌత్ వేల్స్‌ల మధ్య జరిగిన దేశవాళీ మ్యాచ్‌లో సీన్ అబాట్ వేసిన బంతి హ్యూస్ మెడను బలంగా తాకడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే సెయింట్ విన్సెంట్ ఆసుపత్రికి తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేసినా ప్రయోజనం లేకపోయింది. గాయం తర్వాత అతను స్పృహలోకి రాలేకపోయాడని డాక్టర్లు వెల్లడించారు.



ఆసుపత్రికి ఆటగాళ్లు

ఇక హ్యూస్ మరణం ఖాయమని తెలియగానే ఆసీస్ క్రికెటర్లందరూ ఆసుపత్రికి వచ్చారు. హాడిన్, స్మిత్, వాట్సన్, వార్నర్, లియోన్, హెన్రిక్, స్టార్క్, డానియెల్ స్మిత్, కోచ్ డారెన్ లీమన్‌లతో పాటు హ్యూస్‌కు అత్యంత సన్నిహితుడు కెప్టెన్ క్లార్క్ ఎక్కువ సమయం ఆసుపత్రిలోనే గడుపుతూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.



మెదడులో రక్తం వరద

హ్యూస్‌కు అయిన గాయాన్ని వైద్య భాషలో ‘వర్టిబ్రల్ ఆర్టరీ డిసెక్షన్’ అంటారని ఆస్ట్రేలియా టీమ్ డాక్టర్ పీటర్ బ్రూక్నెర్ వెల్లడించారు. ఈ గాయం ‘సబ్‌అర్కానైడ్ హేమరెజ్’కు దారితీస్తుందని చెప్పారు. ‘బంతి క్రికెటర్ మెడను తగిలినప్పుడు మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే వెన్నుపూస ప్రధాన ధమనుల్లో ఒకటి కుంచిం చికుపోయి  తెగిపోయింది. దీంతో మెదడులో తీవ్ర రక్తస్రావం జరిగింది. ఇలాంటి ఉదంతాల్లో ఈ సంఘటన చాలా అరుదుగా చోటు చేసుకుంటుంది.



ఎందుకంటే మెడ మీద గాయమైనప్పుడు మెదడులో రక్తస్రావం కావడమనేది అరుదు. ఇప్పటి వరకు వైద్య చరిత్రలో ఇలాంటి కేసులు 100 నమోదైతే అందులో క్రికెట్ బంతి తగిలి గాయపడటం ఇది రెండోసారి మాత్రమే’ అని బ్రూక్నెర్ తెలిపారు. మరోవైపు ఇలాంటి సంఘటనల్లో తరచుగా లేదా తక్షణమే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని హ్యూస్‌కు చికిత్స అందించిన సెయింట్ విన్సెంట్ ఆసుపత్రి ట్రూమా విభాగం అధిపతి డాక్టర్ టోనీ గ్రాబ్స్ అన్నారు.



గతంలో ఇలాంటి వాటికి ఆసుపత్రిలో చికిత్స అందించిన దాఖలాలు లేవన్నారు. ‘హ్యూస్ గాయం ఓ విపత్తులాంటిది. దాన్ని అంచనా వేయడానికి అత్యవసరంగా స్కానింగ్‌లు తీశాం. మెదడుపై ఒత్తిడి తగ్గించేందుకు శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు నిర్ణయించారు. కొన్నిసార్లు రోగిని మగతలో ఉంచేందుకు తక్కువ మొత్తంలో రక్తాన్ని మెదడు చుట్టూ ఉంచాల్సి వస్తుంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. కాబట్టి ఈ పరిస్థితిని నివారించడానికి ఆపరేషన్ థియేటర్‌లో శస్త్రచికిత్స ద్వారా హ్యూస్ పుర్రెలో కొంత భాగాన్ని తొలగించాం.



మెదడు వ్యాకోచం చెందడానికి వీలుగా ఇది చేయాల్సి వచ్చింది. గంటా 20 నిమిషాల్లో దీన్ని ముగించి హ్యూస్‌ను కృత్రిమ కోమాలో ఉంచాం. 48 గంటల్లో అతను కోలుకోవాల్సి ఉంది. కానీ క్రికెటర్ పరిస్థితిలో పెద్దగా మెరుగుదల కనిపించలేదు. మెదడు యథాస్థితికి రాలేకపోయింది. దీంతో హ్యూస్‌కు ప్రాణాపాయం తప్పలేదు’ అని గ్రాబ్స్ వెల్లడించారు. మైదానంలో హ్యూస్‌కు అందించిన చికిత్స బాగుందని ఇద్దరు డాక్టర్లు స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top