పెర్త్ (వాకా)

పెర్త్ (వాకా)


ప్రపంచంలోని ఫాస్టెస్ట్ పిచ్ లలో ఒకటిగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానానికి గుర్తింపు ఉంది. 1893లో అధికారికంగా ఈ స్టేడియాన్ని ప్రారంభిస్తే 1894లో టర్ఫ్ వికెట్‌పై తొలి మ్యాచ్ ఆడారు. పెర్త్ సామాజిక, సంస్కృతికి నిలయంగా ఈ స్టేడియం ఉంటుంది. అథ్లెటిక్స్, ఏఎఫ్‌ఎల్, బేస్‌బాల్, సాకర్, రగ్బీ లీగ్స్‌లకు ఆతిథ్యమిస్తున్నా... ఎక్కువగా క్రికెట్‌తోనే ప్రాచుర్యంలోకి వచ్చింది. మైదానంలో ఉన్న వాకా మ్యూజియంలో క్రికెట్ చరిత్రకు సంబంధించిన ఎన్నో గుర్తులు కనిపిస్తుంటాయి.



రవాణవ్యవస్థలో ఇబ్బందులు ఉండటం వల్ల ఆసీస్ ప్రధాన క్రికెట్‌తో ఇది ఎక్కువగా అనుసంధానం కాలేకపోయింది. ఇప్పటికీ ఇక్కడికి వెళ్లాంటే షెడ్యూల్ ప్రకారం ఉన్న విమానాల్లోనే వెళ్లాల్సి వస్తుంది. 1970-71లో వేసిన పిచ్‌పైనే రెండు మూడేళ్లు క్రికెట్ ఆడారు. కానీ తర్వాతి రోజుల్లో దాన్ని తొలగించి కొత్త వికెట్‌ను రూపొందించారు. స్వాన్ నదిపై నుంచి వచ్చే వేడి గాలుల వల్ల మధ్యాహ్నం విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. 2002లో మైదానం పునర్‌నిర్మాణంలో భాగం గా సీటింగ్ కెపాసిటీని తగ్గించారు.



ఆట ఆడే ప్రాంతాన్ని కూడా కుదించారు. మైదానంలో చిన్న చిన్న స్టాండ్లు, ప్లేయర్స్ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. కానీ మైదానానికి రెండు వైపుల ఎక్కువ భాగం పచ్చికతో ఏర్పాటు చేసిన నేలపైనే కూర్చొని మ్యాచ్‌ను తిలకిస్తారు. దీంతో స్టేడియం సామర్థ్యం 22 వేలకు పడిపోయింది. పెద్ద మ్యాచ్‌లకు తాత్కాలిక సీట్లను ఏర్పాటు చేసి సామర్థ్యాన్ని 24,500కు పెంచుతారు. పెర్త్‌లో పచ్చని పొదలు, స్థానికంగా లభించే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైన్, సముద్రపు గాలులు ఆహ్లాదాన్ని కల్గిస్తాయి. భారత్ ఫిబ్రవరి 28న యూఏఈతో, మార్చి 6న వెస్టిండీస్‌తో ఇక్కడ ఆడుతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top