రూ.203 కోట్లు

రూ.203 కోట్లు


  భారత క్రికెట్‌కు స్పాన్సర్‌గా పేటీఎం

   నాలుగేళ్ల కాలానికి బీసీసీఐతో ఒప్పందం

   ఒక్కో మ్యాచ్‌కు రూ.2.42 కోట్లు చెల్లింపు


 న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అంతర్జాతీయ సిరీస్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను పేటీఎం కంపెనీ దక్కించుకుంది. 2019 వరకు భారత్‌లో జరిగే అన్ని సిరీస్‌లనూ పేటీఎం కప్‌గా పిలుస్తారు. ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి రూ.203.28 కోట్ల ఆదాయం సమకూరనుంది. గురువారం జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో మ్యాచ్‌కు రూ.1.68 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా... పేటీఎం రూ.2.42 కోట్లు చెల్లిస్తామంటూ దాఖలు చేసిన బిడ్‌కు కమిటీ ఆమోదముద్ర వేసింది. గత ఏడాది మైక్రోమ్యాక్స్ సంస్థ ఒక్కో మ్యాచ్‌కు రూ.2.02 కోట్లు చెల్లించింది.



 ఈసారి కూడా మైక్రోమ్యాక్స్ బిడ్ దాఖలు చేసినా... సరైన పత్రాలను అందించడంలో విఫలమైందని బోర్డు తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో (2019 వరకు) భారత్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 84 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరుగుతాయి. ఒన్ 97 సంస్థకు చెందిన పేటీఎంతో అనుబంధాన్ని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్వాగతించారు. అలాగే ప్రస్తుతం భారత జట్టు దుస్తుల ఒప్పందం నైకీతో ఉంది. ఇది డిసెంబరులో ముగుస్తుంది. అయితే నైకీతో పాటు అడిడాస్ కూడా ఆసక్తి చూపుతోందని, ఈసారి దుస్తుల స్పాన్సర్ విషయంలోనూ గట్టి పోటీ ఉంటుందని బోర్డు వర్గాలు తెలిపాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top