రూ.400 కోట్లు చెల్లించండి!

రూ.400 కోట్లు చెల్లించండి! - Sakshi


ముంబై: భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వెస్టిండీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోయిన నేపథ్యంలో బీసీసీఐ ప్రతీకార చర్యలకు దిగేందుకు సిద్ధమవుతోంది. ముందుగా తమకు తీవ్ర నష్టాన్ని కలిగించినందుకు దాదాపు రూ.400 కోట్ల చెల్లింపు కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)పై  దావా వేయాలనుకుంటోంది. ఈమేరకు తుది నిర్ణయాన్ని ఈనెల 21న హైదరాబాద్‌లో జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకోనున్నారు.



షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఐదు వన్డేలు, ఒక టి20, మూడు టెస్టులు జరగాల్సి ఉంది. అయితే విండీస్ ఆటగాళ్లు తమ బోర్డుతో ఏర్పడిన విభేదాల కారణంగా నాలుగో వన్డే అనంతరం టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ.. మ్యాచ్‌లు జరిగే 17 రోజుల ఆదాయాన్ని (మూడు టెస్టులకు 15 రోజులు, ఒక వన్డే, ఒక టి20) కోల్పోయింది. అయితే వీరి స్థానంలో శ్రీలంక ఐదు వన్డేల సిరీస్‌కు అంగీకారం తెలిపింది. అయినా 12 రోజుల ఆదాయం బోర్డుకు గండి పడినట్టే. విండీస్‌తో సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ద్వారా బోర్డుకు రోజుకు దాదాపు రూ.33 కోట్ల ఆదాయం వచ్చేది.



ఈ నేపథ్యంలో మొత్తం నష్టం రూ.396 కోట్లుగా ఉండనుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకే డబ్ల్యుఐసీబీపై దావా వేయాలని చూస్తోంది. ‘మాతో ద్వైపాక్షిక సిరీస్‌కు విండీస్ అంగీకరించింది. అంతర్గత సమస్యల కారణంగా మధ్యలోనే రద్దు చేసుకుంది. అందుకే మేం నష్టపరిహారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఈ విషయాన్ని మా లీగల్ సెల్‌కు తెలిపాం. ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై 21న వివరించాలని వారికి చెప్పాం. న్యాయ నిపుణుల సలహా మేరకు వర్కింగ్ కమిటీ తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తుంది’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు.



 విండీస్‌లో పర్యటన రద్దు!

 ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భవిష్యత్‌లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లేది అనుమానంగానే మారింది. బోర్డు సభ్యులు కూడా దీనిపై పట్టుదలగానే ఉన్నారు. సంయుక్త కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అయితే ఏకంగా వారితో సంబంధాలన్నీ తెగదెంపులు చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఎనిమిదేళ్లలో కరీబియన్ షెడ్యూల్‌ను సగానికి సగం తగ్గించుకోవాలని మెజారిటీ సభ్యులు స్పష్టం చేస్తున్నారు.



ఎఫ్‌టీపీ ప్రకారం 2015 నుంచి 2023 వరకు ఇరు జట్ల మధ్య 10 టెస్టులు, 15 వన్డేలు, నాలుగు టి20లు జరగాల్సి ఉంది. 2016, 2017లో భారత జట్టు విండీస్‌లో పర్యటించాల్సి ఉంది. కనీసం ఈ పర్యటనలకైనా దూరంగా ఉండాలని వర్కింగ్ కమిటీలో సభ్యులు డిమాండ్ చేయనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top