సెమీస్ లో యువ భారత్

సెమీస్ లో యువ భారత్


అండర్-19 ప్రపంచకప్ 

క్వార్టర్స్‌లో నమీబియాపై ఘన విజయం

రిషబ్ పంత్ సెంచరీ


ఫతుల్లా: అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. ఓపెనర్ రిషబ్ పంత్ (96 బంతుల్లో 111; 14 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ సెంచరీకి తోడు ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ (76 బంతుల్లో 76; 6 ఫోర్లు; 1 సిక్స్), అర్మాన్ జాఫర్ (55 బంతుల్లో 64; 4 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రెచ్చిపోవడంతో భారత జట్టు సెమీఫైనల్లో ప్రవేశించింది. శనివారం నమీబియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 197 పరుగులతో భారీ విజయాన్ని అందుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఇషాన్ (6) తక్కువ స్కోరుకే వెనుదిరిగినా పంత్ తన దూకుడును మరోసారి కనబరిచాడు. అన్‌మోల్ ప్రీత్ (42 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 103 పరుగులు, సర్ఫరాజ్‌తో కలిసి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.


ఆ తర్వాత ఆర్మాన్, సర్ఫరాజ్ నమీబియా బౌలర్లను ఆడుకున్నారు. బంతికో పరుగు చొప్పున సాధిస్తూ జట్టు భారీ స్కోరుకు దోహదపడ్డారు. ఈ జోడి మధ్య నాలుగో వికెట్‌కు 98 పరుగులు చేరాయి. చివర్లో లోమ్రోర్ (21 బంతుల్లో41 నాటౌట్; 1 ఫోర్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. కొయిట్జీకి మూడు వికెట్లు దక్కాయి. అనంతరం భారీ స్కోరు ఛేదన కోసం బరిలోకి దిగిన నమీబియా 39 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. తొలి వికెట్‌కు 59 పరుగులు జత చేరినా ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగింది. డేవిన్ (30 బంతుల్లో 33; 5 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్. దాగర్, అన్‌మోల్‌లకు మూడు, సుందర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top