విరాట్ సేనకు చెక్ పెడతాడా?

విరాట్ సేనకు చెక్ పెడతాడా?


సిడ్నీ:వచ్చే నెల్లో భారత్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు తమ ప్రణాళికల్ని వేగవంతం చేసింది. భారత్లో టీమిండియాపై ఎలా ఆడితే నెగ్గుకు రాగలమో?అనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగా ఇంగ్లండ్ మాజీ లెఫ్టార్మ్ స్సిన్నర్ మాంటే పనేసర్ను ఆసీస్ జట్టుకు మెంటర్(సలహాదారు)గా నియమించింది. 2012-13 సీజన్లో భారత్పై సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో సభ్యుడైన పనేసర్ సేవల్ని ఆసీస్ ఉపయోగించుకోనుంది.  ఆ సిరీస్లో పనేసర్  17 వికెట్లు తీసి భారత్ ను కంగుతినిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా.. అతన్ని మెంటర్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వారంలో ఆసీస్ జట్టుతో పనేసర్ కలిసే యువ స్పిన్నర్లకు సలహాలు ఇవ్వనున్నాడు.


 


ప్రస్తుత ఆసీస్ జట్టులో స్పిన్నర్లకు పనేసర్ మెళుకువలు నేర్పనున్నట్లు ఆసీస్ హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ హోవార్డ్ తెలిపారు. ప్రధానంగా లెప్టార్మ్ స్పిన్నర్లైన స్టీవ్ ఓ కీఫ్, మాట్ రెన్షాలకు పనేసర్ సలహాలిస్తాడన్నారు. 'భారత్లో స్పిన్ బౌలింగ్పై పనేసర్కు మంచి అవగాహన ఉంది. స్పిన్ను ఆడేటప్పుడు బ్యాట్స్మెన్ ఎలా ఆలోచిస్తారు? అదే సమయంలో బౌలర్లు ఎలా బౌలింగ్ చేయాలి?అనే దానిపై పనేసర్ సేవల్ని ఉపయోగించుకోనున్నాం. పనేసర్ ఎంపిక మా జట్టుకు కలిసొస్తుందని ఆశిస్తున్నాం'అని హోవార్డ్ పేర్కొన్నారు.



ఇంగ్లండ్ తరపున 50 టెస్టు మ్యాచ్లు ఆడిన పనేసర్.. 2013-14 లో జరిగిన యాషెస్ సిరీస్లో చివరిసారి పాల్గొన్నాడు. అయితే ఇటీవల భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో ఇంగ్లండ్ 4-0 తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రధానంగా భారత్లో స్పిన్ బౌలింగ్ను ఆడటంలో విఫలమైన ఇంగ్లండ్ ఘోర ఓటమి పాలైంది. ఈ సిరీస్కు పాకిస్తాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ సేవల్ని ఉపయోగించుకున్న ఈసీబీ.. తమ దేశ స్సిన్నర్ అయిన పనేసర్ ను పక్కను పెట్టేసింది. కాగా, ఆసీస్ మాత్రం ఇంగ్లండ్ ఓటమిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు రచిస్తోంది. భారత్ లో విరాట్ సేనకు గట్టి పోటీ ఇవ్వాలంటే అటు సుదీర్ఘ బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ కూడా ప్రధానమని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. ఇంగ్లిష్ స్పిన్నర్ పనేసర్ను స్పిన్ కన్సెల్టెంట్ గా ఎంపిక చేసింది. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న విరాట్ అండ్ గ్యాంగ్కు పనేసర్ చెక్ పెడతాడా?లేదా?అనేది చూడాలంటే కొంత సమయం ఆగాల్సిందే. ఫిబ్రవరి నెలలో ఆసీస్-భారత్ జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరుగనుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top