పాక్ క్రికెటర్లూ.. ఇక చాలు, పరువు తీయొద్దు

పాక్ క్రికెటర్లూ.. ఇక చాలు, పరువు తీయొద్దు - Sakshi


ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెటర్ల తీరుపై స్వదేశంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సెంచరీ చేసినా లేదా మ్యాచ్ గెలిచినా మైదానంలో పాక్ ఆటగాళ్లు బస్కీలు తీయడాన్ని తప్పుపడుతున్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతింటుదని అధికార పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్౦-నవాజ్ సెనెటర్ రాణా అఫ్జాల్ ఖాన్ విమర్శించారు.



బుధవారం క్రీడల సెనెట్ స్టాండింగ్ కమిటీ సమావేశం సందర్భంగా అఫ్జాల్ ఖాన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 'క్రికెట్ అన్నది జెంటిల్మెన్ గేమ్. ఆటగాళ్లు ఇలా బస్కీలు చేస సంబరాలు చేసుకోవడం హుందాగా ఉండదు. క్రికెటర్లు ఇలా చేయడం వల్ల దేశ ప్రతిష్ట పోతుంది. ఇలాంటి విన్యాసాలను ఆపాలి. దీనికి బదులుగా మరో పద్ధతిలో సంబరాలు చేసుకోవచ్చు' అని అఫ్జాల్ ఖాన్ సూచించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇతర చట్టసభ సభ్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజామ్ సేథీ స్పందిస్తూ.. క్రికెటర్లు ఇకమీదట ఇలాంటి విన్యాసాలు చేయకుండా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా క్రికెటర్లు ఇలా ప్రవర్తించారని, భవిష్యత్లో ఇలా చేయకుండా ఆంక్షలు విధిస్తామని చెప్పారు.



గత జూలైలో ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ సెంచరీ చేసిన తర్వాత తొలిసారి బస్కీలు చేశాడు. ఆ తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లందరూ కెప్టెన్ బాటలో నడిచారు. లార్డ్స్ టెస్టు గెలిచాక పాకిస్థాన్ క్రికెటర్లందూ బస్కీలు తీయడంపై విమర్శలు వచ్చాయి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top