‘పద్మశ్రీ’ అవార్డు ఆశ్చర్యపరిచింది

‘పద్మశ్రీ’ అవార్డు ఆశ్చర్యపరిచింది


న్యూఢిల్లీ: ఈసారి పద్మ అవార్డుల్లో భారత క్రికెట్ సూపర్‌స్టార్లు కెప్టెన్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి కూడా రేసులో ఉన్న విషయం తెలిసిందే. అయితే వీరితో పాటు మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఉన్నప్పటికీ వారిని కాదని అవార్డు తనను వరిస్తుందని ఆమె కలలో కూడా అనుకోలేదు. జరిగింది మాత్రం అదే... ఎవరూ ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం మిథాలీని ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డుకు ఎంపిక చేసింది.



దీంతో 32 ఏళ్ల ఈ హైదరాబాదీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇది నిజంగా ఏమాత్రం ఊహించని పరిణామమని, చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటిదాకా 153 వన్డేలు, 10 టెస్టులు, 47 టి20 మ్యాచ్‌లు ఆడింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ పురస్కారాన్ని అందుకోనున్న మిథాలీ రాజ్ తన భావాలను మీడియాతో పంచుకుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే....

 

కోహ్లితో పోటీ అనగానే ఆశ వదులుకున్నా: నిజాయితీగా చెప్పాలంటే పద్మశ్రీ అవార్డుకు క్రికెటర్ల నుంచి నాకు పోటీగా కోహ్లి ఉన్నాడనగానే ఆశలు వదులుకున్నాను. ఎందుకంటే పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మేమెక్కడో ఉంటాం. అందుకే కోహ్లిలాంటి స్టార్‌ను కాదని నాకిస్తారనుకోలేదు. కానీ జాబితాలో నా పేరు చూసి ఎంతగానో ఆశ్చర్యపోయాను. అసలే మాత్రం ఊహించని విషయమిది.

 

ప్రతిభకు తగిన పురస్కారమిది: మన చిత్తశుద్ధిని, అంకితభావాన్ని గుర్తించారనడానికి కేంద్ర అవార్డులు నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే నేను ఆడటం ప్రారంభించే నాటికి మహిళల క్రికెట్‌పై ఎక్కడా అవగాహన లేదు. అసలు మాకు కూడా క్రికెట్ జట్టు ఉందనే విషయం ప్రజలకు తెలీదు. అలాంటి స్థితి నుంచి మహిళల క్రికెట్‌ను కూడా ఫాలో కావాలనే కోరిక ప్రజల్లో కలిగించేలా చేశాం. దీనికి చాలా సమయమే పట్టింది.

 

తల్లిదండ్రులకు అంకితం: నా కెరీర్ కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడ్డారు. చాలా వాటిని త్యాగం చేయాల్సి వచ్చింది. అందుకే ఈ అవార్డు వారికే అంకితం అని చె ప్పేందుకు సంతోషిస్తున్నాను.

 

ఈ అవార్డు ప్రేరణగా నిలుస్తుంది: భారత్‌లో క్రికెట్‌ను కెరీర్‌గా తీసుకునేందుకు నాకు దక్కిన ఈ అవార్డు యువ క్రీడాకారిణులకు ప్రేరణగా నిలుస్తుందని భావిస్తున్నాను. ఇక నుంచి ముఖ్యంగా క్రికెట్ అభిమానులు... మహిళా క్రికెట్‌ను మరింత ఆసక్తిగా అనుసరిస్తారేమో!

 

కొందరిలా నేను డిమాండ్ చేయలేను: కొందరు ఆటగాళ్లు ఫలానా అవార్డుకు, గుర్తింపునకు తాము అర్హులమేనని భావిస్తుం టారు. అయితే నేను మాత్రం ఆ కేటగిరీకి చెందను. నాకు దక్కినప్పుడే తీసుకుంటాను. ప్రస్తుతానికి నాకు అవార్డు వచ్చింది. కాబట్టి సంతోషమే.

 

మాకు మరిన్ని మ్యాచ్‌లు దక్కుతాయి: ఐసీసీ కొత్త ఫార్మాట్ ప్రకారం మేం మరిన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడగలమని అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా తక్కువ అంతర్జాతీయ సిరీస్‌ల గురించి అభిమానులు, మీడియా పట్టించుకునేది. అయితే ఇకనుంచి ఎక్కువగా మ్యాచ్‌లు జరుగుతాయి కాబట్టి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top