బ్రేవో రాకతో బలం పెరిగింది!

బ్రేవో రాకతో బలం పెరిగింది!

సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో డ్వేన్ బ్రేవో అర్ధాంతరంగా గాయపడటంతో తాము ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు అతని రాకతో చెన్నై సూపర్ కింగ్స్ బలం పెరిగిందని జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. చాంపియన్స్ లీగ్ టి20 తొలి మ్యాచ్‌కు రెండు రోజుల ముందు తమ విజయావకాశాలపై ధోని సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడాడు. ‘ఐపీఎల్‌లో బ్రేవో గాయం చెన్నై జట్టు కాంబినేషన్, స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపించింది. అతను తిరిగి రావడం సంతోషాన్నిచ్చే విషయం. మా జట్టులోని సభ్యులంతా కొంత కాలంగా రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతూ ఫామ్‌లో కూడా ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం అంతా బాగుంది. అయితే పరిస్థితులకు మేం ఎంత త్వరగా అలవాటు పడతామో చూడాలి’ అని ధోని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ లీగ్‌లో పాల్గొంటున్న భారత జట్లకు మంచి చాన్స్ ఉందన్న ధోని, టి20 క్రికెట్ లాటరీలాంటిదన్నాడు. ‘టి20లో అనిశ్చితి ఎక్కువ. ఒక్క ఆటగాడు మ్యాచ్ పరిస్థితిని మార్చేయగలడు. ఆ రోజు బాగా ఆడటం ముఖ్యం. భారత జట్లన్నీ పటిష్టంగా కనిపిస్తున్నాయి’ అని విశ్లేషించాడు. తొలి మ్యాచ్ ప్రత్యర్థి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గతంలో చాలా సార్లు ఆడిన అనుభవం పనికొస్తుందన్న చెన్నై కెప్టెన్, తమ బలాలపైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు. ‘గంభీర్ జట్టు బాగుంది. కొద్ది మంది మినహా ఎక్కువ మంది ఆటగాళ్లు అందులోనే కొనసాగుతున్నారు. అయితే ప్రతీ జట్టుకు బలాలతో పాటు బలహీనతలు కూడా ఉంటాయి. మా బలంపై మేం ఆధారపడ్డాం. కాబట్టి ఇతర అంశాల గురించి ఆలోచన అనవసరం’ అని ధోని స్పష్టం చేశాడు. వెంటవెంటనే వేర్వేరు ఫార్మాట్‌లు ఆడటంలో సమస్యలు లేకపోయినా... ఆటగాళ్లు కలిసిపోవడానికి తక్కువ వ్యవధి లభిస్తోందని, వీటికి అలవాటు పడటం వ్యక్తిగతంగా సవాల్‌వంటిదని ఎమ్మెస్ అన్నాడు.  

 త్వరలోనే స్థాయి పెరుగుతుంది: ఐపీఎల్‌తో పోలిస్తే చాంపియన్స్ లీగ్ ప్రజాదరణలో వెనుకబడి ఉందన్న విషయాన్ని ధోని అంగీకరించాడు. ఐపీఎల్‌లో అగ్రశ్రేణి భారత క్రికెటర్లు ఉండటం వల్లే అభిమానులకు చేరువైందని, రాబోయే రోజుల్లో సీఎల్‌టి20 కూడా ఆ స్థాయికి చేరుతుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘సీఎల్‌టి20లో భారత  జట్లు తలపడుతున్నప్పుడు మినహా ఇతర మ్యాచ్‌లకు ప్రేక్షకులు రావడం లేదు. మున్ముందు పరిస్థితి మెరుగు కావచ్చు’ అని ధోని అన్నాడు. 

 

 

 


 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top