పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలుశిక్ష

పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలుశిక్ష


ప్రియురాలి హత్య కేసులో తుది తీర్పు



 ప్రిటోరియా: గతేడాది తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో దక్షిణాఫ్రికా బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ శిక్ష వెంటనే అమల్లోకి రానుంది. దీంతో 20 నెలలుగా సాగుతున్న ఈ కేసు విచారణ ముగిసినట్టయ్యింది. 2013, ఫిబ్రవరి 14న రీవా స్టీన్‌కాంప్‌ను ఆగంతుకుడిగా భావించిన పిస్టోరియస్ తన ఇంట్లోనే కాల్చి చంపిన విషయం తెలిసిందే.



అయితే ఉద్దేశపూర్వకంగాచంపిన కేసులో తను నిర్దోషిగా బయటపడినా... అనాలోచితంగా వ్యవహరించి ఒకరి మరణానికి కారకుడైనందుకు ఈ శిక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. తన శిక్షలో మూడొంతుల కాలం జైలులో గడిపిన అనంతరం పెరోల్‌పై విడుదలయ్యేందుకు ఆస్కార్‌కు అవకాశముంటుంది. ప్రిటోరియా హైకోర్టు జడ్జి థొకోజిలే మసీపా తన తీర్పును వెలువరిస్తున్న సమయంలో తీవ్ర ఆవేదనకు గురైన పిస్టోరియస్ భోరున విలపిస్తూ కనిపించాడు.



ఈ శిక్షాకాలంలో పది నెలల అనంతరం అతడు విడుదలయ్యే అవకాశం ఉందని... ఆ సమయంలో అతడు గృహనిర్భంధంలో ఉంటాడని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘ఆస్కార్‌కు శిక్ష వేయకుంటే తప్పుడు సంకేతాలు పంపినట్టవుతుంది. అయితే సుదీర్ఘ కాలం శిక్ష కూడా తగదు. అతడు పెరోల్‌కు అర్హుడే. వికలాంగులకు దక్షిణాఫ్రికా జైళ్లు అనుకూలంగా లేవనే వాదనను నేను అంగీకరించను’ అని జడ్జి తెలిపారు. ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.



అయితే రీవా కుటుంబం ఈ శిక్షపై సంతోషం వ్యక్తం చేసింది. మరోవైపు ఐదేళ్ల శిక్షపై అప్పీల్ చేయదలుచుకోలేదని, ఈ తీర్పును తాము అంగీకరిస్తున్నామని పిస్టోరియస్ మామయ్య ఆర్నాల్డ్ తెలిపారు. ఐదేళ్ల జైలు శిక్షా కాలంలో ఆస్కార్ పిస్టోరియస్ పారాలింపిక్స్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అనుమతించబోమని అంతర్జాతీయ పారాలింపిక్స్ కమిటీ అధికార ప్రతినిధి క్రెగ్ స్పెన్స్ స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top