ధన్... ధనాధన్..!

ధన్... ధనాధన్..!


రాయ్‌పూర్: బౌండరీల హోరు... సిక్సర్ల జోరు... కావలసినంత పరుగుల వినోదానికి రంగం సిద్ధమైంది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి నేడు తెరలేవనుంది. ఇక్కడి షహీద్ వీర్‌నారాయణ్ సింగ్ స్టేడియంలో నేటి నుంచి జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో టోర్నీ ఆరంభం కానుంది. తొలి రోజు జరిగే మ్యాచ్‌లలో ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్... లాహోర్ లయన్స్‌తో, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో తలపడనున్నాయి. ఆదివారం, మంగళవారం ఇతర క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌ల ద్వారా రెండు జట్లు ముందంజ వేస్తాయి. బుధవారం జరిగే ప్రధాన పోటీల తొలి మ్యాచ్‌లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఎదుర్కొంటుంది.

 పటిష్టంగా ముంబై

 క్వాలిఫయింగ్ రౌండ్‌లోని ఇతర మూడు జట్లతో పోలిస్తే అన్ని విధాలా ముంబై ఇండియన్స్ పటిష్టంగా ఉంది. డిఫెండింగ్ చాంపియన్ కూడా అయిన ముంబై ఈసారి ముందుగా ప్రధాన పోటీలకు అర్హత సాధించి ఆ తర్వాత టైటిల్‌పై దృష్టి పెట్టవచ్చు. విధ్వంసకర ఆటగాళ్లు కీరన్ పొలార్డ్, కోరీ అండర్సన్‌లతో పాటు లెండిల్ సిమన్స్, రాయుడు, ఆదిత్య తారేలాంటి ఆటగాళ్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. అయితే రోహిత్ శర్మ గైర్హాజరీతో చెప్పుకోదగ్గ దేశవాళీ ఆటగాడు లేకపోవడం ముంబైకి ఇబ్బందిగా ఉన్నా... అగ్రశ్రేణి హిట్టర్లు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడానికి సరిపోతారని జట్టు భావిస్తోంది. ఇక బౌలింగ్‌లోనైతే లసిత్ మలింగ రూపంలో తిరుగులేని పేస్ ఆయుధం ఆ జట్టు వద్ద ఉంది. హర్భజన్, ఓజావంటి భారత స్పిన్నర్లతో పాటు పేసర్లు ప్రవీణ్ కుమార్, బుమ్రా ప్రభావం చూపించగలరు. చాంపియన్స్ లీగ్‌ను రెండు సార్లు నెగ్గిన ఏకైక జట్టు అయిన ముంబై ఇండియన్స్ ముందంజ వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అర్హత దశలో ఈ జట్టు మ్యాచ్‌లపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 పాక్ జట్టు నిలబడుతుందా!

 గత ఏడాది వీసా కష్టాల తర్వాత పాక్ జట్టు ఫైసలాబాద్ వోల్వ్‌స్ సీఎల్‌టి20 బరిలోకి దిగి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడూ దాదాపు అదే స్థితిలో లాహోర్ లయన్స్ భారత్‌కు వచ్చింది. గత జట్టుతో పోలిస్తే ఇది కొంత వరకు పటిష్టంగా కనిపిస్తున్నా తొలి మ్యాచ్‌లో ముంబైకి ఏ మాత్రం పోటీ ఇవ్వగలదో చూడాలి. కెప్టెన్ హఫీజ్ టి20 స్పెషలిస్ట్ కాగా...ఉమర్ అక్మల్ ప్రభావవంతమైన ఆటగాడు. నాసిర్ జంషెద్, అహ్మద్ షహజాద్, వహాబ్ రియాజ్ కొంత వరకు గుర్తింపు ఉన్న ఆటగాళ్లు. మిగతా వారంతా పాక్ దేశవాళీ ఆటగాళ్లే.

 అంతంత మాత్రమే

 ఇక క్వాలిఫయింగ్ బరిలో ఉన్న మిగతా రెండు జట్లు బలహీనంగా కనిపిస్తున్నాయి. మలింగ ముంబైకి ఆడటం, దిల్షాన్ తప్పుకోవడంతో శ్రీలంక జట్టు సదరన్ ఎక్స్‌ప్రెస్ బలహీనంగా మారింది. మహరూఫ్, ముబారక్‌వంటి వెటరన్లు తప్ప చెప్పుకోదగ్గవారు ఎవరూ లేరు. కుషాల్ పెరీరా ఒక్కడే జాతీయ జట్టులో రెగ్యులర్ సభ్యుడు. ఇక న్యూజిలాండ్ టీమ్ నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇందులో కేన్ విలియమ్సన్, టిమ్ సౌతీ మినహా మిగతా ఆటగాళ్లకు పెద్దగా అనుభవం లేదు. వెటరన్ స్కాట్ స్టైరిస్ ఏ మాత్రం ప్రభావం చూపుతాడో చూడాలి.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top