ఆట తెలియదు...ఆడించేస్తారట!

ఆట తెలియదు...ఆడించేస్తారట!


చిన్న చిన్న దేశాలూ ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తుంటే... 125 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం తమ ఉనికిని చాటుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది. కేవలం ఒలింపిక్స్ సమయంలో నిరాశాజనక ప్రదర్శన ఆధారంగా విమర్శలు చేసే వాళ్లు ఎందరో ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు మాత్రం ఎవరూ చొరవ చూపడంలేదు. ఒక రంగంలో అభివృద్ధి జరగాలంటే ఆ రంగానికి చెందిన నిష్ణాతుల భాగస్వామ్యం అత్యవసరం. కానీ మన దగ్గర మాత్రం ఆట గురించి తెలియనివాళ్లు, ఎప్పుడూ ఆడని వాళ్లు ఆయా సంఘాలకు అధ్యక్షులుగా బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటారు. భారత క్రీడా వ్యవస్థలో ఉన్న లోపాలు... మన క్రీడారంగం బాగు పడాలంటే ఏం చేయాలి... తదితర అంశాలపై ఓ అధ్యయనం...


 


ఒక్కరే... ఒక్కరు...

భారత ఒలింపిక్ సంఘానికి (ఐఓఏ) అనుబంధంగా ఉన్న 38 క్రీడా సంఘాల్లో ఒక్కటంటే ఒక్క సంఘానికి మాత్రమే మాజీ క్రీడాకారుడు అధ్యక్షుడిగా ఉన్నారు. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడిగా ఉన్న అదిలె సుమరివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బరిలోకి దిగారు.


 

మరో 9 క్రీడా సంఘాల్లో మాజీ, ప్రస్తుత క్రీడాకారులు కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. 12 క్రీడా సంఘాలు అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల పదవీకాలం గురించి కనీస వివరాలు అందుబాటులో ఉంచలేదు. కేవలం రెండు క్రీడా సంఘాలు మాత్రమే తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించాయి. హాకీ ఇండియాను (34 శాతం) మినహాయిస్తే మిగతా క్రీడా సంఘాల్లో మహిళల ప్రాతినిధ్యం 2 నుంచి 8 శాతంలోపే ఉంది.తొమ్మిది క్రీడా సంఘాలు తమ లక్ష్యాలు, ఉద్దేశాలను తెలియజేయలేదు. 10 క్రీడా సంఘాలు తమ నియమావళిని అందుబాటు లో ఉంచడంలో విఫలమైంది. 10 క్రీడా సంఘాలు తమ అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల విధులు, బాధ్యతలను తెలియజేయలేదు.

 


     

ఎనిమిది క్రీడా సంఘాల్లో అసలు మహిళలకు ప్రాతినిధ్యమే లేదు. 11 క్రీడా సంఘాలు తమ కార్యవర్గం పదవీకాలం, నియమావళికి సంబంధించిన సమాచారం అందించలేదు. 12 క్రీడా సంఘాలు తమ అధ్యక్ష, కార్యవర్గ సభ్యుల పదవీకాలానికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచలేదు. మిగతా 15 క్రీడాసంఘాల్లో ఆరు మాత్రమే అధ్యక్ష పదవికి నిర్ణీత కాలవ్యవధిని నిర్ణయించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య, ఇండియన్ గోల్ఫ్ యూని యన్ మాత్రమే తమ భవిష్యత్ ప్రణాళికను రూపొందించాయి.16 క్రీడా సంఘాలు తమ ఆర్థిక లావాదేవీలను క్రమం తప్పకుండా ప్రకటించడంలేదు. కేవలం ఫుట్‌బాల్ సమాఖ్య మాత్రమే తమ ఆర్థిక వ్యవహారాలను ఆడిటర్ ద్వారా ఆడిట్ చేయించింది. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య మాత్రమే కీలక సభ్యులకు సంబంధించి జీతభత్యాలను వెల్లడించింది.  ఏ క్రీడా సంఘం కూడా తమ కార్యవర్గ సభ్యులు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో అనే సమాచారాన్ని తెలియజేయలేదు.


 


ఇలా చేస్తే బాగుంటుంది...

భారత ఒలింపిక్ సంఘంతోపాటు అన్ని క్రీడా సంఘాలు భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేయాలి. ఈ వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉండాలి. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు సాకారం అవుతున్నాయో లేదో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి.


అన్ని క్రీడా సంఘాలు తమ ఎన్నికల విధానంలో మార్పులు తేవాలి. అధ్యక్షుడితోపాటు కార్యదర్శి, కోశాధికారి, ఇతర కార్యవర్గ సభ్యులకు నిర్ణీత పదవీకాలాన్ని నిర్ణయించాలి. ఆ పదవీకాలం దాటిపోతే వారు భవిష్యత్‌లో మళ్లీ పోటీ చేయకూడదు.


ఆయా క్రీడా సంఘాలు తమ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత పాటించాలి. ఎవరికి ఎంతెంత చెల్లిస్తున్నారో, ఖర్చులు ఎంత అవుతున్నాయో అన్ని వివరాలను తమ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచాలి.


పరస్పర విరుద్ధ ప్రయోజనాలను తగ్గించుకోవాలి లేదా వదులుకోవాలి. ఇలాంటివి ఉంటే అన్ని వివరాలను తెలియజేయాలి.


{Mీడా సంఘాల్లో క్రీడాకారులకు, మహిళలకు ప్రాతినిధ్యం పెంచాలి. ముఖ్యంగా భారత ఒలింపిక్ సంఘంలో పారదర్శకత పెరగాలి. తమ బడ్జెట్ వివరాలు, దేశవిదేశాల పర్యటనలకు ఎవరెవరిని పంపిస్తున్నారు, వారికయ్యే ఖర్చులు సవివరంగా సమర్పించాలి.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top