క్రికెట్ నుంచి చాలా నేర్చుకోవచ్చు

క్రికెట్ నుంచి చాలా నేర్చుకోవచ్చు


ఒలింపిక్ క్రీడాకారులకు ద్రవిడ్ సూచన



 న్యూఢిల్లీ: రకరకాల వికెట్లపై తన బ్యాటింగ్ ప్రతిభను చూపిన మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్... ఇప్పుడు క్రికెటేతర క్రీడల అభివృద్ధిపై దృష్టిపెట్టాడు. ఇందుకోసం కేంద్ర క్రీడాశాఖ ప్రవేశపెట్టిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (ఓటీపీ)’ కార్యక్రమంలో అతను భాగస్వామి అయ్యాడు. క్రికెట్ నుంచి ఒలింపిక్ క్రీడాకారులు చాలా నేర్చుకోవచ్చని మంగళవారం ‘సాయ్’ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ద్రవిడ్ అన్నాడు. ‘ఏ స్థాయి ప్రదర్శన అయినా ఎంతో కొంత నేర్చుకోవచ్చు. చాలా ఏళ్లు నేను అంతర్జాతీయ క్రీడలో ఉన్నా. కాబట్టి అంతర్జాతీయ అథ్లెట్లకు ఏం కావాలో గుర్తించగలను.



అందుకే ఈ గ్రూప్‌లో నాకు చోటు లభించిందనుకుంటా. అయితే షూటర్లు, షట్లర్లు, ఇతర అథ్లెట్ల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే వాటిపై బింద్రా, గోపీ, అంజులకు నా కంటే ఎక్కువ అవగాహన ఉంది. భారత్‌లో క్రికెట్ కాకుండా ఇతర క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో సందేహం లేదు. ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు సాధించాలంటే టాప్ అథ్లెట్లకు కావాల్సిన సహాయం అందించాలి’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.



దేశ వ్యాప్తంగా 2016, 2020 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అథ్లెట్లను గుర్తించి, వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడానికి ఎనిమిది మందితో ఎలైట్ గ్రూప్‌ను రూపొందించారు. ఇందులో ద్రవిడ్, మేరీ కోమ్, గోపీచంద్, అంజూ బాబ్జీ, బింద్రాలతో పాటు మరో ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఉపాధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. జాతీయ క్రీడాభివృద్ధి నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్) కింద ఓటీపీ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.



 ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోంది: గోపీచంద్

 గత కొన్నేళ్లుగా అథ్లెట్లపై ప్రభుత్వం చాలా ఖర్చు చేస్తోందని బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ అన్నారు. ‘ఎలైట్ అథ్లెట్లకు ‘సాయ్’ అన్ని రకాల శిక్షణ ఇస్తోంది. దానికి అదనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా ఉండే పోటీని ఎదుర్కోవాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఓ ఆటగాడ్ని గుర్తించి, నీవు టాప్ ప్లేయర్‌వి అని చెప్పడంతో పాటు అతను సరైన ఫలితం అందుకునే వరకు అన్ని విధాలుగా ఉపయోగపడటం దీని ముఖ్య ఉద్దేశం’ అని గోపీ వెల్లడించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top