విరాట్ సేన విలవిల

విరాట్ సేన విలవిల


పుణె: అదేమీ లక్ష్య ఛేదన కాదు. అలాగని చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కూడా కాదు. అందులోనూ స్వదేశంలో జరుగుతున్న మ్యాచ్. మరి ఇంకేముంది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటను సాగించవచ్చు. అలా జరగలేదు. ప్రత్యర్థి ఆసీస్ పేరును చూసి భయపడినట్లు ఉన్నారు. భారత ఆటగాళ్లు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కనీసం క్రీజ్లో నిలబడటానికి యత్నించకుండానే భారత ఆటగాళ్లు క్యూకట్టేశారు. శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ జట్టు.. టీ విరామానికి ముందుగానే ఆలౌట్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఈ రోజు ఆటలో 40.1 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 105 పరుగులకే చాప చుట్టేసింది. 94 పరుగుల వద్ద నాల్గో వికెట్ కోల్పోయిన భారత్.. మరో 11 పరుగుల వ్యవధిలో మిగతా వికెట్లను కోల్పోవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది.





ప్రధానంగా లంచ్ తరువాత ఆసీస్ స్పిన్నర్ ఓకీఫ్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీసి భారత్ కు షాకిచ్చాడు. ఇన్నింగ్స్ 33 ఓవర్ లో భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (64), రహానే(13),సాహా(0)లను ఓకీఫ్ పెవిలియన్ కు పంపాడు. ఆపై లయన్ బౌలింగ్ లో అశ్విన్(1)అవుట్ కావడంతో భారత్ వంద పరుగులలోపే ఏడో వికెట్ ను నష్టపోయింది. ఇక ఆపై తేరుకోలేని భారత్  మరో మూడు వికెట్లను కూడా వెంటనే కోల్పోయింది. చివరి మూడు వికెట్లను కూడా ఓకెఫీ సాధించడం విశేషం. ఓవరాల్ గా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ పతనాన్ని శాసించగా, అతనికి జతగా స్టార్క్ రెండు, హజల్ వుడ్, లయన్ లు తలో వికెట్ తీశారు.



256/9 ఓవర్ నైట్ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్..మరో నాలుగు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్ ను కోల్పోయింది. ఓవర్ నైట్ ఆటగాడు మిచెల్ స్టార్క్(61) ఆఖరి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత తొలి ఇన్నింగ్స్ ను ఆరంభించిన భారత్ ఆదిలోనే మురళీ విజయ్(10) వికెట్ ను కోల్పోయింది. మురళీ విజయ్ ను హజల్ వుడ్ అవుట్ చేశాడు. ఆ తరువాత పూజారా, కోహ్లిలు స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో  44 పరుగులు వద్ద భారత్ మూడో వికెట్ ను కోల్పోయింది. ఆ పై కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ మినహా ఎవరూ రాణించలేదు. టాపార్డర్ తో పాటు లోయర్ ఆర్డర్ కూడా ఘోరంగా వైఫల్యం చెందడంతో భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఎనిమిది మంది భారత ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం ఇక్కడ గమనార్హం.


 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top