తేలని భవితవ్యం!

తేలని భవితవ్యం!


నర్సింగ్‌పై నాడా విచారణ పూర్తి

శని లేదా సోమ వారాల్లో తీర్పు


ఒలింపిక్స్ అవకాశం లేనట్లే


 


న్యూఢిల్లీ: డోపింగ్‌లో పట్టుబడ్డ రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఒలింపిక్స్‌లో పాల్గొనే అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల పాటు రెజ్లర్‌ను సుదీర్ఘంగా విచారించిన నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) తీర్పును వాయిదా వేసింది. దీంతో నర్సింగ్ ఒలింపిక్స్ ఆశలు సన్నగిల్లడంతో పాటు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మాత్రం పెరిగింది. అయితే శని లేదా సోమ వారాల్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయని సమాచారం. గురువారం కూడా విచారణకు హాజరైన నర్సింగ్ తరఫు న్యాయవాదులు డోప్ పరీక్ష ఫలితాలపై తమ వాదనలను వినిపించారు. దీన్ని నోట్ చేసుకున్న నాడా న్యాయ బృందం పూర్తిస్థాయి నివేదికను క్రమశిక్షణ కమిటీకి అందజేయనుంది. ‘విచారణ పూర్తయింది. శని లేదా సోమవారాల్లో తీర్పు రావొచ్చు. అయితే నర్సింగ్ ఒలింపిక్స్ వెళ్లేందుకు అర్హుడు కాడని నాడా బలంగా వాదిస్తోంది. ఎందుకంటే అతనిపై కుట్రపూరితంగా నేరం మోపారని రెజ్లర్ చెబుతున్నాడు. కానీ ఇందుకు సంబంధించిన ఆధారాలు, రుజువులు మాత్రం చూపలేకపోతున్నాడు. తను తాగే నీటిలో ఏదో కలిపారని అఫిడవిట్ దాఖలు చేశాడు. కానీ నాడా, వాడాను సంతృప్తిపరిచే స్థాయిలో దాన్ని రుజువు చేయలేకపోతున్నాడు. ఉద్దేశపూర్వకంగా తను తప్పు చేయకపోతే అందుకు సంబంధించిన ఆధారాలను ఇవ్వాలని లేకపోతే శిక్ష పడుతుందని ఘాటుగా హెచ్చరించాం. ఓ అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా తను తీసుకునే ఆహారంపై శ్రద్ధ తీసుకోకుంటే ఎలా అని ప్రశ్నించాం. అయినా సరే ప్యానెల్‌కు నర్సింగ్ సమర్పించిన ఆధారాలు ఏమాత్రం సరితూగడం లేదు’ అని నాడా న్యాయవాది గౌరాంగ్ కాంత్ పేర్కొన్నారు. ‘వాడా’ నిబంధన ప్రకారం సరైన ఆధారాలు ఇవ్వని పక్షంలో ఒలింపిక్స్‌కు అనర్హత వేటు వేస్తూ శిక్ష పడుతుంది. మరోవైపు నర్సింగ్‌కు న్యాయం జరగాలని అతని మద్దతుదారులు నాడా ప్రధాన కార్యాలయం ముందు నినాదాలు చేశారు. 




సాయ్ సెంటర్‌కు పోలీసులు

సోనేపట్: డోపింగ్‌పై నర్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల బృందం ‘సాయ్’లో విచారణ జరిపింది. సాక్షులు, కోచ్‌లు, వార్డెన్లతో పాటు మరికొంత మందిని కూడా ప్రశ్నించామని నేర విచారణ విభాగం (సీఐఏ) అధికారి ఇందర్‌వీర్ తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఈయనను ప్రత్యేకంగా నియమించారు. కేసుతో సంబంధం ఉన్న అందరి నుంచి స్టేట్‌మెంట్లను సేకరించామని, నర్సింగ్ అనుమానాలు వ్యక్తం చేసిన  రెజ్లర్ జితేశ్‌ను తర్వాత విచారిస్తామని ఇందర్‌వీర్ చెప్పారు. పోలీసులు విచారణ జరుపుతున్నప్పుడు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ అక్కడే ఉన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే ఏదైనా జరగొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. సాయ్ సెంటర్ తమ పరిధిలోకి రాదని అందుకే జోక్యం చేసుకోలేకపోతున్నామన్నారు.


 


నర్సింగ్‌పై వాడా కన్ను!

మొత్తానికి నర్సింగ్ డోపింగ్ అంశం వాడా దృష్టికి కూడా వెళ్లింది. వాడా సలహా మేరకే ఈ నెల 5న రెజ్లర్‌కు సంబంధించి రెండో శాంపిల్‌ను సేకరించి పరీక్షించినా అందులోనూ పాజిటివ్ ఫలితమే వచ్చింది. వాస్తవంగా జూన్ 25న సేకరించిన రెండు శాంపిల్స్‌లో మొదట ఒకదాన్ని పరీక్షించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో ఈనెల 21న నర్సింగ్ సమక్షంలో బి-శాంపిల్‌నూ టెస్టు చేయగా అక్కడ కూడా ప్రతికూల ఫలితమే వచ్చింది. దీంతో వాడా ఆదేశాల మేరకు ఈనెల 5న నర్సింగ్ నుంచి ప్రత్యేకంగా రక్త, మూత్ర నమూనాలను తీసి పరీక్షించామని నాడా డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. మరోవైపు నాడా విచారణలో నర్సింగ్ నిర్దోషిగా తేలితే ప్రవీణ్ రాణా స్థానంలో మళ్లీ అతన్ని ఎంపిక చేస్తామని ఐఓఏ వెల్లడించింది.


 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top