ఫిఫా పదవిపై ఆసక్తి లేదు

ఫిఫా పదవిపై ఆసక్తి లేదు - Sakshi


కోల్‌కతా: ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్ష పదవిపై తనకెలాంటి ఆసక్తి లేదని సాకర్ రారాజు పీలే స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఆయన సోమవారం మీడియాతో ముచ్చటించారు. ఆయనతో పాటు అట్లెటికో డి కోల్‌కతా సహ యజమాని సౌరవ్ గంగూలీ కూడా పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ‘ఫిఫా ఎన్నికల్లో పోటీకి దిగి అధ్యక్షుడిగా కావాలనే ఉద్దేశం నాకు లేదు’ అని పీలే తేల్చారు. అలాగే ప్రస్తుత తరంలో అర్జెంటీనాకు చెందిన స్టార్ స్ట్రయికర్ మెస్సీ సూపర్ అని కొనియాడారు. గత పదేళ్లలో అతడిని మించిన ఆట గాడు లేడని చెప్పారు. అయితే బ్రెజిల్‌కే చెందిన నెయ్‌మార్, రొనాల్డోలను తక్కువ చేసి చూడలేమని కూడా అన్నారు. ‘వివిధ తరాలకు చెందిన ఆటగాళ్లను పోల్చడం అంత తేలిక కాదు. అయితే దశాబ్దకాలంగా గమనిస్తే మెస్సీ అద్భుతం అని చెప్పవచ్చు. రొనాల్డో దూకుడుగా ఆడుతూ గోల్స్ చేస్తున్నా.. మెస్సీ శైలి విభిన్నం. ఇక మా ఆటగాడు నెయ్‌మార్‌కు మంచి భవిష్యత్తు ఉంది’ అని మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించిన 74 ఏళ్ల పీలే తెలిపారు.

 

 చిన్నప్పటి నుంచే మక్కువ పెంచాలి

 భారత్‌లో ఫుట్‌బాల్ ఇప్పుడున్న పరిస్థితి నుంచి మెరుగుపడాలంటే చిన్నారులకు క్షేత్రస్థాయి నుంచే ఆటపై మక్కువ పెంచాల్సి ఉంటుందని పీలే అభిప్రాయపడ్డారు. అలాగే వర్ధమాన ఆటగాళ్లతో వీలైనంత విదేశీ పర్యటనలు చేయించాలని అన్నారు. ‘అన్నింటికన్నా ముఖ్యం ఆటగాళ్లను శిక్షణ కోసం విదేశాలకు పంపాలి. ఒక్కోసారి మీ దగ్గర మంచి నైపుణ్యం కలిగిన యువ ఆటగాళ్లు ఎలాంటి అంతర్జాతీయ అనుభవం లేకుండా ఉండొచ్చు. కానీ ఫలితం ఉండదు. స్కూల్ లేక క్లబ్ స్థాయిలో వారికి సరైన వసతులు కల్పించకపోతే ఎలా ఎదుగుతారు?’ అని పీలే ప్రశ్నించారు. ఫుట్‌బాల్‌లో తాను కింగ్‌నైతే.. మరో ఆటలో గంగూలీ ప్రిన్స్ అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. అట్లెటికో డి కోల్‌కతా జట్టుకు చెందిన జెర్సీని సహ యజమానులు గంగూలీ, సంజీవ్ గోయెంకా, ఉత్సవ్ పరేఖ్, నియోషియా కలిసి పీలేకు బహూకరించారు. కోల్‌కతాలో లభించిన స్వాగతానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీలే ఆటగాడిగా ఉన్నప్పుడు చూడలేకపోయినా ఇప్పుడు ప్రత్యక్షంగా కలుసుకోవడం సంతోషాన్నిస్తోందని గంగూలీ చెప్పారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top