'కింగ్' కార్ల్‌సెన్

'కింగ్' కార్ల్‌సెన్


వరుసగా మూడో సారి ప్రపంచ విజేత

చాంపియన్‌షిప్ పోరులో కర్జాకిన్‌పై విజయం


టైబ్రేకర్‌లో తేలిన ఫలితం  


64 గడులూ అతడిని చూసి అసూయపడేలా... బోర్డులోని పావులన్నీ దాసోహమయ్యేలా... ప్రపంచ చెస్ మేధావులంతా అచ్చెరువొందేలా... చదరంగపు సామ్రాజ్యానికి తానే     రారాజునని మాగ్నస్ కార్ల్‌సెన్ నిరూపించాడు. విశ్వ వేదికపై చతురంగ బలాలను సమర్థంగా నడిపించి వరుసగా మూడోసారి జగజ్జేతగా నిలిచాడు. 2013లో ఒడిసి పట్టిన ప్రపంచ కిరీటాన్ని చేజార్చుకోకుండా తన జైత్రయాత్రను కొనసాగించాడు. వేదిక, ప్రత్యర్థి మారడం మినహా ఇన్నేళ్లలో తన ఎత్తుల్లో పవర్ తగ్గలేదని నిరూపిస్తూ ‘బ్లాక్ అండ్ వైట్’ రంగుల్లో తన హస్తాక్షరాన్ని ముద్రించాడు. అందనంత ‘ఎత్తు’లో శిఖరాన నిలిచిన ఈ నార్వే కుర్రాడు తన 26వ పుట్టిన రోజునాడే తనకు తాను అమూల్యమైన కానుక సాధించుకున్నాడు. 


న్యూయార్క్: ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ (నార్వే) చెస్ ప్రపంచంలో మరో సారి తన ఆధిక్యాన్ని చాటుకున్నాడు. వరుసగా మూడో సారి అతను ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన చాంపియన్‌షిప్ పోరులో కార్ల్‌సెన్ ‘టైబ్రేకర్’లో రష్యాకు చెందిన సెర్గీ కర్జాకిన్‌పై విజయం సాధించాడు. 12 క్లాసిక్ రౌండ్‌ల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు చెరో 6 పారుుంట్లతో సమ ఉజ్జీలుగా నిలవడంతో నాలుగు గేమ్‌ల ర్యాపిడ్ రౌండ్‌ను నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో కార్ల్‌సెన్ 3-1తో తేడాతో కర్జాకిన్‌పై గెలుపొందాడు. ఇందులో తొలి రెండు గేమ్‌లు డ్రా కాగా... మూడు, నాలుగు గేమ్‌లను మాగ్నస్ సొంతం చేసుకొని సత్తా చాటాడు. చాంపియన్‌షిప్‌కు ముందు విజేతకు 6 లక్షల యూరోలు, పరాజితుడికి 4 లక్షల యూరోలు ప్రైజ్‌మనీగా ప్రకటించినా... పోరు అదనపు సమయం వరకు వెళ్లడంతో దానిని 5 లక్షల 50 వేల యూరోలు (దాదాపు రూ. 4 కోట్లు), 4 లక్షల 50 వేల యూరోలు (దాదాపు రూ. 3 కోట్ల 27 లక్షలు)గా మార్చారు. కార్ల్‌సెన్ 2013, 2014లలో విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.


పోరు సాగిందిలా...

చాంపియన్‌షిప్ పోరులో క్లాసిక్ విభాగంలో ఇద్దరి మధ్య 12 గేమ్‌లు జరిగారుు. ఇం దులో తొలి 7 గేమ్‌లు డ్రా అయ్యారుు. ఆ తర్వాత  8వ గేమ్‌లో కర్జాకిన్ సంచలన విజయంతో కార్ల్‌సెన్‌కు షాక్ ఇచ్చాడు. అరుుతే కోలుకున్న నార్వే స్టార్ 10వ గేమ్‌ను గెలుచుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాతి రెండు గేమ్‌లు కూడా డ్రాగా ముగిశారుు. దాంతో విజేతలను తేల్చడం కోసం 25 నిమిషాల చొప్పున ఉండే నాలుగు గేమ్‌లను బుధవారం నిర్వహించారు.


కర్జాకిన్ తెల్ల పావులతో ఆడిన తొలి గేమ్ 37 ఎత్తులో డ్రాగా ముగిసింది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో కార్ల్‌సెన్ తనకు లభించిన పలు అవకాశాలు వృథా చేసుకోవడంతో చివరకు 84 ఎత్తుల్లో ఈ గేమ్ కూడా డ్రా అరుుంది. అరుుతే మూడో గేమ్‌లో నల్లపావులతోనే ఆడిన మాగ్నస్ ఈ సారి తన పట్టు వదల్లేదు. ర్యాపిడ్ విభాగంలో కూడా తనకున్న పట్టును నిరూపించుకుంటూ వేగంగా వేసిన ఎత్తులతో కర్జాకిన్‌ను గందరగోళంలో పడేశాడు. చివరకు 38 ఎత్తుల్లో గేమ్ గెలుచుకొని ఆధిక్యంలో నిలిచాడు. టైటిల్ గెలిచేందుకు డ్రా చేసుకుంటే సరిపోయే స్థితిలో నాలుగో గేమ్ బరిలోకి దిగిన వరల్డ్ నంబర్‌వన్... అదే దూకుడును కొనసాగించాడు. చివరకు నాలుగో గేమ్‌లోనూ 50 ఎత్తుల్లో కర్జాకిన్ తలవంచగా... కార్ల్‌సెన్ మరోసారి చాంపియన్‌గా నిలిచాడు.


కోటి మంది ప్రేక్షకులు

1995లో ఆనంద్, కాస్పరోవ్ మధ్య వరల్డ్ ట్రేడ్ సెంటర్ 107వ అంతస్తులో ప్రపంచ చాంపియన్‌షిప్ నిర్వహించిన తర్వాత న్యూయార్క్‌లో ఈ పోరు జరగడం ఇది రెండోసారి. 1200 డాలర్ల టికెట్‌తో వీఐపీ గ్యాలరీనుంచి, 500-1000 డాలర్ల టికెట్‌తో సాధారణ గ్యాలరీనుంచి ఈ మ్యాచ్‌ను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా కోటి మంది ప్రేక్షకులు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను చూసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. 


మిస్టర్ మేధావి 

రెండేళ్ల వయసులో 50 భాగాల పజిల్‌ను నిమిషాల్లో పరిష్కరించేశాడు... నార్వేలోని ప్రాంతాల పేర్లు, వివిధ దేశాల జాతీయ జెండాలు, రాజధానుల పేర్లరుుతే మంచినీళ్ల ప్రాయంలా చెప్పేసేవాడు... 14 ఏళ్ల పిల్లల కోసం తయారైన ‘లెగో’ బిల్డింగ్‌లను నాలుగేళ్ల వయసులోనే పేర్చేసి ఔరా అనిపించుకున్నాడు! ఇవన్నీ కార్ల్‌సెన్ బాల మేధావి లక్షణాలకు సూచికలు. చిన్నప్పుడు ఇదే తరహాలో కనిపించి ఆ తర్వాత సాధారణంగా మిగిలిపోయేవారు మనలో చాలా మంది కనిపిస్తారు. కానీ కార్ల్‌సెన్ తండ్రి తన కుమారుడి ప్రతిభను మరో యుద్ధం వైపు మళ్లించాడు. నాడు ఐదేళ్ల వయసులో నేర్పిన అరవై నాలుగు గళ్ల పాఠాలనుంచి నేడు ప్రపంచ చాంపియన్ స్థారుుకి చేర్చే వరకు నాన్న నీడలా వెంట నిలిచాడు. ఆ ప్రోత్సాహం, అండదండలే మాగ్నస్‌ను మెగా ప్లేయర్‌గా మార్చేశారుు. 13 ఏళ్ల 4 నెలల వయసులో గ్రాండ్‌మాస్టర్‌గా మారిన అతను, ఇప్పుడు వరుసగా మూడో సారి విశ్వ విజేతగా తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు.


‘ఫిడే’ ర్యాంకింగ్‌‌సలో 2010లో తొలి సారి 19 ఏళ్ల వయసులోనే వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచిన కార్ల్‌సెన్ మధ్యలో కొంత కాలం మినహా ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. తర్వాతి ఏడాది కాస్పరోవ్ పేరిట ఉన్న అత్యుత్తమ రేటింగ్ (2851) రికార్డును అతను బద్దలు (2861) కొట్టాడు. ఆ తర్వాత అత్యధికంగా 2882తో ఆల్‌టైమ్ బెస్ట్ రేటింగ్‌ను సాధించిన కార్ల్‌సెన్, చెస్ ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని చాటాడు. 2013లో మన విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అతను తర్వాతి ఏడాది మళ్లీ ఆనంద్‌నే ఓడించి దానిని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఒకే సమయంలో స్టాండర్డ్ (క్లాసిక్), ర్యాపిడ్, బ్లిట్జ్ మూడు విభాగాల్లోనూ ఏకకాలంలో ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను తన వద్ద ఉంచుకున్న ఏకై క ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. మూడేళ్ల క్రితమే ప్లే మాగ్నస్ పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్ విడుదల కాగా... ఇటీవల కార్ల్‌సెన్ పేరుతో మరో చెస్ ట్రైనింగ్ యాప్ వచ్చింది. సాధారణగా చెస్ ఆటగాళ్లతో పాటు బయట కార్ల్‌సెన్ లైఫ్ స్టరుుల్ భిన్నంగా ఉంటుంది. అనేక సంస్థలకు మోడలింగ్ చేయడంతో పాటు ఒమెగా, పోర్ష్‌లాంటి ప్రఖ్యాత బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరించిన కార్ల్‌సెన్ 2013లో ప్రముఖ కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ‘సెక్సీయెస్ట్ మెన్’లలో ఒకరిగా గుర్తించడం విశేషం. 2014లో అతనిపై రూపొందించిన మూవీ కం డాక్యుమెంటరీ అనేక చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.


కష్టపడి గెలిచాడు  పెంటేల హరికృష్ణ

ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కార్ల్‌సెన్ బాగా సన్నద్ధమయ్యాడు. ఏ గేమ్‌లో కూడా ఓపెనింగ్‌లో తను తడబడలేదు. తను ఓడిన 8వ గేమ్‌లో కూడా విజయం కోసం బాగా ప్రయత్నించడం వల్ల ఓడిపోయాడు. ఆ ఓటమి తర్వాత తను తప్పనిసరిగా హాజరుకావలసిన మీడియా సమావేశానికి కూడా రాలేదు. ఆ మ్యాచ్‌లో తను ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నాడో చెప్పడానికి ఇది ఉదాహరణ. పదో గేమ్‌లో గెలిచి స్కోరు సమం చేయడం కార్ల్‌సెన్ విజయంలో కీలకం. ఈ గేమ్‌లో కర్జాకిన్‌కు డ్రా చేసుకునే అవకాశం లభించినా వినియోగించుకోలేకపోయాడు.



ఒకవేళ పదో గేమ్ డ్రా అరుుతే ఫలితం మరోలా ఉండేది.  కార్ల్‌సెన్ పుట్టినరోజు నాడు టై బ్రేకర్స్ జరిగారుు. బర్త్‌డే రోజు ఆడటం చాలామంది ఆటగాళ్లకు ఎంతో ఒత్తిడితో కూడుకున్న పని. కానీ కార్ల్‌సెన్ అద్భుతంగా ఆడాడు. నాలుగో గేమ్‌లో తన క్యూహెచ్6 మూవ్ అత్యద్భుతం. మొత్తం మీద చూస్తే కర్జాకిన్ డిఫెన్సివ్ నైపుణ్యం వల్ల కార్ల్‌సెన్‌కు గట్టిపోటీ లభించింది. చాలా గేమ్‌లలో తను ఓడిపోతాడనుకున్న సమయంలోనూ కర్జాకిన్ పుంజుకుని డ్రా చేసుకున్నాడు. తను కూడా బాగా సన్నద్ధమయ్యాడు. ఏమైనా కర్జాకిన్ పోరాట పటిమ వల్ల కార్ల్‌సెన్ విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. 2008 తర్వాత రష్యా ఆటగాడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆడటం వల్ల ఈ మ్యాచ్‌పై ఎక్కువ ఆసక్తి ఏర్పడింది.  2018లో జరిగే చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సెన్‌తో తలపడేందుకు పెద్ద క్రీడాకారులంతా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.  (భారత స్టార్ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ ప్రపంచ చాంపియన్‌షిప్ సందర్భంగా సాక్షికి రాసిన ప్రత్యేక వ్యాసమిది)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top