సరిలేరు మీకెవ్వరూ...

సరిలేరు మీకెవ్వరూ... - Sakshi


ఆసీస్ అంటే ఇదీ...

ఏం చెప్పాలి... ఏమని వర్ణించాలి...  అమోఘమన్నా...అద్భుతమన్నా... అద్వితీయమన్నా.. తక్కువే మీరు గెలవడానికే పుట్టారేమో... ఒకసారి గెలిస్తే గొప్ప... రెండోసారి గెలిస్తే అదృష్టం... మరీ ఐదుసార్లు గెలవడమంటే... క్రికెట్ ప్రపంచం మీకు దాసోహమైనట్లే. అందుకే మీ కీర్తి అనంతం... మీ ఆట అనితర సాధ్యం... మీ పయనం ఎదురులేని స్వప్నం... ఇక ఈ ఆటకు మీరే రారాజులు.. ఖండమేదైనా... ప్రత్యర్థి ఎవరైనా... మీరే గెలుస్తున్నారంటే... మీకు మీరే సాటి... సరిలేరు మీకెవ్వరూ పోటీ.

 

ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు సహజంగానే ఫేవరెట్‌లలో ఒకటి. కానీ టోర్నీ ఆరంభంలో ఆ జట్టు కాస్త మందగమనంలో కనిపించింది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసినా...బంగ్లాతో మ్యాచ్ రద్దు కావడంతో, రెండు వారాల దాకా మరో మ్యాచ్ లేకపోవడం ఆ జట్టు అందరి దృష్టినీ ఆకర్షించలేదు. పైగా కివీస్‌తో పరాజయం తర్వాత కొన్ని సమీకరణాలతో చివరి దాకా గ్రూప్‌లో ఏ స్థానమో ఖరారు కాలేదు.



కానీ అసలు పోరులో మాత్రం ఆసీస్ గర్జించింది. ఒక్కసారిగా తమ సత్తా ప్రదర్శించి మూడు నాకౌట్ మ్యాచ్‌లలోనూ చెలరేగింది. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడది అసలు సిసలైన ఆస్ట్రేలియా జట్టులా కనిపించింది. ఆస్ట్రేలియా మైదానంలో, అచ్చమైన ఆసీస్ స్టయిల్‌లో ఐదో సారి విశ్వ విజేతగా నిలిచింది. దీని వెనక ఏడాదిన్నర శ్రమ ఉంది. ఆటగాళ్లు, కోచ్‌లే కాదు అనేక మంది మాజీలు, దిగ్గజాలు సూచనలు, ప్రేరణ ఉన్నాయి. క్లార్క్ నాయకత్వ ప్రతిభ జట్టును అద్భుతంగా నడిపించింది.

 

అక్కడే మొదలు...

2013 జూన్... చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ విజేతగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కనీసం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. తమ గ్రూప్‌లో ఆ జట్టు ఇంగ్లండ్, శ్రీలంక, న్యూజిలాండ్ తర్వాత చివరి స్థానంలో నిలిచింది. వన్డేల్లో రారాజుగా వరుసగా మూడు ప్రపంచకప్‌లు గెలుచుకున్న ఆసీస్ జట్టు ఇదేనా అనిపించింది. ఆ సమయంలో డారెన్ లీమన్ కోచ్‌గా వచ్చారు. ఆ తర్వాత  ఆసీస్ అదృష్టం మారింది.



కొత్త తరాన్ని, కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ అప్పుడే లీమన్ ‘మిషన్ 2015 ప్రపంచకప్’ మొదలు పెట్టారు. అదే ఈ రోజు ఆ జట్టును మరోసారి శిఖరాన నిలబెట్టింది. అడుగడుగునా ప్రొఫెషనలిజం గుర్తు చేస్తూనే ఆటగాళ్లకు కావాల్సిన స్వేచ్ఛనిచ్చారు. అడ్డమైన నిబంధనలతో వారికి అడ్డంకులు సృష్టించకుండా ఆటపై దృష్టి పెట్టేలా చేయగలిగారు. చాంపియన్స్ ట్రోఫీలో విఫలమైన మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్, స్టార్క్, ఫించ్, మిషెల్ మార్ష్ ఇప్పుడు అదే జట్టును చాంపియన్‌గా నిలబెట్టారు

 

ఒకరిని మించి మరొకరు

ఆసీస్ విజయంలో అన్నింటికంటే పెద్ద పాత్ర పేస్ బౌలింగ్‌దే. ఇతర జట్లతో పోలిస్తే తిరుగులేని లైనప్‌తో పాటు సొంత మైదానాల్లో బౌలర్లు చెలరేగారు.  స్పిన్ పిచ్ అంటూ వినిపించిన చోట కూడా ఒక్కసారిగా ప్రణాళికలు మార్చుకోలేదు. తమ బలాన్ని నమ్ముకొనే బరిలోకి దిగింది. ముఖ్యంగా మిషెల్ స్టార్క్ అత్యుత్తమ స్వింగ్ బౌలర్‌గా ఎదిగాడు. ఫైనల్లో మెకల్లమ్‌ను అతను అవుట్ చేసిన బంతి ప్రపంచ క్రికెట్‌లో చిరకాలం గుర్తుండిపోతుంది. బ్యాటింగ్‌లో ఒకరు విఫలమైన చోట మరొకరు బ్యాటన్‌ను అందుకున్నారు. వ్యూహాలు, తుది జట్టు ఎంపిక విషయంలో ఆసీస్ మొహమాటాలకు పోలేదు.



పక్కా ప్రొఫెషనలిజంను ప్రదర్శించింది. జట్టు కోసం కొందరు ‘త్యాగాలు’ చేయాల్సి వచ్చినా తప్పలేదు. స్టార్క్ కోసం జాన్సన్‌ను కొత్త బంతినుంచి దూరంగా ఉంచారు. దానికి తగినట్లుగా అతను మధ్య ఓవర్లలో తన స్థాయి బౌలింగ్‌ను ప్రదర్శించాడు. వరుసగా విఫలమవుతున్న వాట్సన్‌ను ఒక మ్యాచ్‌నుంచి తప్పించి హెచ్చరించారు. దాంతో అతను తర్వాతి మ్యాచ్‌లలో ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాడు.



కెప్టెన్‌గా ఒక మ్యాచ్ ఆడి అర్ధ సెంచరీ చేసినా... క్లార్క్ కోసం బెయిలీ పక్కన కూర్చోవాల్సి వచ్చింది.స్మిత్‌ను మిడిలార్డర్ నుంచి మూడో స్థానానికి ప్రమోట్ చేశారు. యువ పేసర్లు హాజల్‌వుడ్, కమిన్స్‌లను మ్యాచ్‌కు అనుగుణంగా మారుస్తూ సమర్థంగా వాడుకోగా... ఆల్‌రౌండర్లుగా మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. మొత్తంమీద ఆసీస్ ఏం చేసినా కలిసొచ్చింది... కప్ నడిచొచ్చింది..!  

 -సాక్షి క్రీడా విభాగం

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top