తెలంగాణ జట్టుకు నో చాన్స్!


జాతీయ క్రీడలకు దూరమయ్యే అవకాశం

 ఆంధ్రప్రదేశ్ జట్టుకే ఐఓఏ అనుమతి

 రెండు జట్ల కోసం ఏపీఓఏ ప్రయత్నాలు


 

 సాక్షి, హైదరాబాద్: ఒక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తామని చెబుతోంది. క్రీడాకారులకు భారీ నగదు పురస్కారాలు అందిస్తోంది. కానీ జాతీయ స్థాయిలో సత్తా చాటి రాష్ట్రానికి గర్వంగా నిలవాల్సిన ఆటగాళ్లకు ఇప్పుడు ఆ అవకాశం దక్కదేమో అనిపిస్తోంది. జనవరి 31నుంచి ఫిబ్రవరి 14 వరకు కేరళలో జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టు పాల్గొనేందుకు ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అనాలోచిత వ్యవహారశైలితో పాటు ఏపీఓఏ, స్పోర్ట్స్ అథారిటీ అధికారుల అలసత్వం కూడా ఇందుకు కారణమైంది.

 

 ఏం జరిగిందంటే...

 రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలలు దాటినా ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఏపీఓఏ) మాత్రం ఇంకా విడిపోలేదు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అనుమతి రాకపోవడమే దీనికి కారణం. ఎన్ని సార్లు ఏపీఓఏ విజ్ఞప్తులు చేసినా ఐఓఏ దీనిపై స్పందించలేదు. మరో వైపు 35వ జాతీయ క్రీడలకు జట్లు పంపాల్సిందిగా ఐఓఏ పంపిన లేఖలో కేవలం ఆంధ్రప్రదేశ్ జట్టును మాత్రమే అనుమతిస్తున్నట్లుగా ఉంది. ఇందులో తెలంగాణ రాష్ట్రం పేరే లేదు. దాంతో ఈ నెల 19న చెన్నైలో జరిగిన ఐఓఏ జనరల్ బాడీ సమావేశంలో ఏపీఓఏ ఈ విషయాన్ని ప్రస్తావించింది. దాంతో రెండు జట్లకు అనుమతి ఇస్తామని, దీని సమన్వయానికి తామే అడ్‌హాక్ కమిటీలు ఏర్పాటు చేస్తామని ఐఓఏ చెప్పింది.

 

 మరో కమిటీ ఏర్పాటు

 అయితే వారం దాటినా ఐఓఏనుంచి ఎలాంటి సమాచారం రాలేదు. దాంతో గురువారం ఏపీఓఏ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు రాష్ట్రాల జట్ల ఎంపిక, నిర్వహణ తదితర కార్యకలాపాల కోసం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీని గుర్తించమని కోరుతూ ఏపీఓఏ... ఐఓఏకు లేఖ రాయనుంది. జాతీయ క్రీడలకు ప్రాథమికంగా జట్ల వివరాలను పంపేందుకు ఈ నెల 31 వరకే గడువు ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ఎంపిక ప్రక్రియ, శిక్షణా శిబిరాలు జరగనే లేదు.

 

 ప్రత్యామ్నాయమేంటి?

 ఆరు నెలలుగా పట్టించుకోని ఐఓఏ ఇప్పుడు ఇంత తొందరగా ఈ కమిటీని గుర్తిస్తుందని ఎలాంటి ఆశా లేదు. అదే జరిగితే కేవలం ఆంధ్రప్రదేశ్ జట్టుకు మాత్రమే క్రీడల్లో పాల్గొనే అర్హత ఉంటుంది. దాంతో కొత్త కమిటీ ద్వారా ఇరు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లతో జట్లను సిద్ధం చేయాలని ఏపీఓఏ భావిస్తోంది.  దీని వల్ల పాల్గొనే క్రీడాకారుల సంఖ్య సగానికి తగ్గి ఆటగాళ్లకు నష్టం జరుగుతుంది. ఒక వేళ తెలంగాణ క్రీడాకారులు విజయం సాధిస్తే, వారికి ఏపీ పేరిటే పతకం, సర్టిఫికెట్ లభిస్తాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్‌ను ఇరు రాష్ట్రాలు గుర్తించాలని ప్రభుత్వాలకు ఏపీఓఏ విజ్ఞప్తి చేయనుంది. రెండు రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తే సమస్య లేదు. లేదంటే ఈ జట్టు పాల్గొనేందుకు కావాల్సిన ఖర్చుల కోసం ఏ రాష్ట్రం డబ్బులు ఇవ్వాలో కూడా స్పష్టత లేదు.

 

 ఆటగాళ్లకు నష్టం జరగకూడదనే మా ప్రయత్నం. వాస్తవానికి సమైక్య ఏపీ జట్టును పంపిస్తే పునర్విభజన చట్టం ప్రకారం 42-58 శాతం పద్ధతిలో డబ్బులు కేటాయించాలి. అయితే జీఓ జారీ చేసినా గత ఐదేళ్ల మా బాకీలే ఇప్పటి వరకు రాలేదు. ఇలాంటప్పుడు వారిని ఎలా నమ్మగలం. ఎవరి ఆర్థిక సహకారంతోనైనా జట్లను పంపేందుకు ప్రయత్నిస్తాం. ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు కూడా స్పందించాలి. లేదంటే ప్రస్తుత నిబంధనల పరిస్థితి చూస్తే తెలంగాణ జట్టు పాల్గొనకపోవచ్చు.                      

 - జగదీశ్వర్ యాదవ్, ఏపీ ఒలింపిక్ సంఘం కార్యదర్శి

 

 స్వచ్ఛ భారత్‌లో సైనా నెహ్వాల్

 బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ చీపురు పట్టి రోడ్లను శుభ్రం చేసింది. స్వచ్ఛ భారత్‌లో భాగంగా గురువారం బంజారాహిల్స్ రోడ్ నెం. 11లో భారత్ పెట్రోలియం టెరిటరీ కార్యాలయం తరఫున తను పాల్గొంది. ఈ సందర్భంగా స్వచ్చ భారత్ మారథాన్‌ను ప్రారంభించడంతో పాటు క్రిస్‌మస్ కేక్‌ను కట్ చేశారు.    

 - సాక్షి, శ్రీనగర్‌కాలనీ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top