స్టీవ్ స్మిత్‌పై ఎలాంటి చర్యల్లేవు

స్టీవ్ స్మిత్‌పై ఎలాంటి చర్యల్లేవు


‘రివ్యూ’ రగడకు తెర!

ఐసీసీ జోక్యం కోరిన బీసీసీఐ

భారత్‌ విజ్ఞప్తిని పట్టించుకోని ఐసీసీ   




బెంగళూరు: ఆస్ట్రేలియా ‘డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ’ ఘటనను అంత సులభంగా వదలరాదని భావించిన భారత్‌కు నిరాశే ఎదురైంది. స్మిత్‌ రివ్యూ రెండో టెస్టు మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, మ్యాచ్‌లో మన జట్టు ఘన విజయం సాధించినా కూడా ఆసీస్‌ కెప్టెన్‌ వ్యవహార శైలిని మళ్లీ నిలదీయాలని టీమిండియా ఆశించింది. భారత మాజీ ఆటగాళ్లు, వ్యాఖ్యాతలు కూడా స్మిత్‌ను విమర్శిస్తూ అగ్గిరాజేసే ప్రయత్నం చేశారు. కానీ చివరకు అంత ర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంది. రివ్యూ ఘటనపై జోక్యం చేసుకోవాలంటూ బీసీసీఐ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా... వివాదం మరింత పెంచకుండా ఐసీసీ ముగించేసింది. తాజా ఘటనపై విచారణ, స్మిత్‌ను హెచ్చరించడంలాంటి అంశాల గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా తర్వాతి మ్యాచ్‌కు సిద్ధం కావాలంటూ పెద్దన్న తరహాలో సుద్దులు చెప్పడం విశేషం. ఐసీసీ తమ నిర్ణయం ప్రకటించే ముందు ఇరు బోర్డులతో సంప్రదించినట్లు సమాచారం.



కోహ్లికి అండగా...

ముందుగా వివాదాస్పద రివ్యూ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)ని బుధవారం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కోరింది. మైదానంలో జరిగిన పరిణామాల విషయంలో జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని బోర్డు వెనకేసుకొచ్చింది. ‘వివాదాస్పద రివ్యూకు సంబంధించి వీడియో రీప్లేలు చూశాక తీవ్రంగా చర్చించిన అనంతరం ఈ విషయంలో భారత జట్టుకు, కెప్టెన్‌ కోహ్లికి బీసీసీఐ గట్టిగా మద్దతు పలుకుతోంది. కోహ్లి పరిణతి చెందిన, అనుభవజ్ఞుడైన క్రికెటర్‌. మైదానంలో అతని ప్రవర్తన చాలా బాగుంది. అనుచిత రీతిలో సహకారం తీసుకుంటున్న స్మిత్‌ను అంపైర్‌ నైజేల్‌ లాంగ్‌ అడ్డుకోవడాన్ని బట్టి చూస్తే కోహ్లి వ్యవహార శైలిని ఆయన కూడా సమర్థించినట్లే’ అని బీసీసీఐ ప్రకటించింది. ‘మీడియా సమావేశంలో మాట్లాడుతూ రివ్యూ  సమయంలో తన బుర్ర పని చేయలేదంటూ స్మిత్‌ స్వయంగా అంగీకరించిన విషయాన్ని గుర్తిస్తూ ఈ అంశాన్ని పరిశీలించాలని కూడా ఐసీసీకి బీసీసీఐ విజ్ఞప్తి చేసింది’ అని భారత బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.



‘అతి’ చేస్తున్నారు...

తాజా వ్యవహారంపై ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు సహజంగానే తమ కెప్టెన్‌ స్మిత్‌కు అండగా నిలిచింది. ‘స్మిత్‌ వ్యక్తిత్వాన్ని, ఆస్ట్రేలియా జట్టు నిజాయితీని ప్రశ్నిస్తూ చేస్తున్న ఆరోపణలు అసాధారణం. ఇవి జట్టుకు హాని చేసేలా, అతిగా ఉన్నాయి. స్మిత్‌ అద్భు తమైన క్రికెటర్‌. వ్యక్తిగా కూడా ఎంతో మంది యువ క్రికెటర్లకు అతను స్ఫూర్తిగా నిలిచాడు. అతనిపై మాకు పూర్తి నమ్మకముంది. స్మిత్‌ చర్యల్లో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. మా పరువుకు భంగం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలనైనా మేం ఖండిస్తున్నాం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మా ఆటగాళ్లందరికీ అండగా నిలుస్తున్నాం’ అని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ వ్యాఖ్యానించారు.



ఐసీసీ ప్రకటన

‘బెంగళూరు టెస్టులో జరిగిన ఘటనల విషయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ఆటగాడిపై కూడా ఆరోపణలు నమోదు చేయడం లేదని ఐసీసీ నిర్ధారిస్తోంది. ముఖ్యంగా స్టీవ్‌ స్మిత్, కోహ్లికి సంబంధించి జరిగిన రెండు సంఘటనలు కూడా మ్యాచ్‌లో భాగంగానే ఐసీసీ చూస్తోంది కాబట్టి ఆటగాళ్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవు. ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా కీలక పాత్ర పోషించిన అద్భుతమైన టెస్టు మ్యాచ్‌ను మనం చూశాం. తమ శక్తియుక్తులను రాంచీలో జరిగే తదుపరి టెస్టుపై కేంద్రీకరించాలని మేం ప్రోత్సహిస్తున్నాం. దానికి ముందు మ్యాచ్‌ రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లను కలిసి ఆటకు సంబంధించి వారి బాధ్యతలను గుర్తు చేస్తారు.’



‘రివ్యూ’పై ఎవరేమన్నారు..

‘ప్లేయర్స్‌ బాక్స్‌ వైపు చూడమని స్మిత్‌కు నేనే సలహా ఇచ్చాను. అది నా తప్పే. నిబంధనలపై నాకు అవగాహన లేదు. ఒక అద్భుతమైన మ్యాచ్‌ గొప్పతనాన్ని ఇలాంటి ఘటన తగ్గించలేదు’

– పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్, రివ్యూ సమయంలో నాన్‌స్ట్రైకర్‌



‘రివ్యూల విషయంలో ఆటగాళ్లు మైదానం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌ సభ్యులతో చర్చించడం అంతకు ముందు అసలెప్పుడూ జరగలేదని గట్టిగా చెప్పగలను. కోహ్లి అలా అనడం చాలా ఆశ్చర్యం కలిగించింది. అయితే అది అతని అభిప్రాయం అయితే మాకూ మా సొంత అభిప్రాయం ఉంటుంది’

– డారెన్‌ లీమన్, ఆస్ట్రేలియా కోచ్‌



‘స్మిత్‌ రివ్యూలాంటి వ్యవహారం గురించి నేనెప్పుడూ వినలేదు. చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. నా చిన్నప్పుడు అండర్‌–10 స్థాయి మ్యాచ్‌లలో అలా జరిగినట్లు గుర్తుంది. ఆ రోజుల్లో కవర్‌ ఫీల్డర్, పాయింట్‌ ఫీల్డర్‌లు ఎక్కడ నిలబడతారో మా కోచ్‌ బయటి నుంచి సూచనలు ఇచ్చేవారు’

– అశ్విన్, భారత బౌలర్‌



‘ఒక అద్భుతమైన మ్యాచ్‌లో ఇలాంటి ఒక్క ఘటనపై మనం దృష్టి పెట్టడం దురదృష్టకరం. స్మిత్‌కు ఉన్న గుర్తింపు కారణంగా అతని మాటలు నేను నమ్ముతున్నాను. స్మిత్‌ కూడా సిగ్గుపడి పాఠం నేర్చుకొని ఉంటాడు. దీనిని ఇంతటితో వదిలేస్తే మంచిది’

–స్టీవ్‌ వా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌



‘ఇది చాలా అరుదైన ఘటన. ఇలా జర గకుండా ఉండాల్సింది. స్మిత్‌కు హ్యాండ్స్‌కోంబ్‌ సలహా ఇవ్వడమే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది’

–మైకేల్‌ క్లార్క్, ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top