ఆటగాళ్లతో ‘ఆట’లు!

ఆటగాళ్లతో ‘ఆట’లు! - Sakshi


* ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు అందని కిట్‌లు

* జాతీయ క్రీడల మార్చ్ పాస్ట్‌కు పలువురు దూరం


సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రులు, క్రీడా దిగ్గజాల సమక్షంలో తమ రాష్ట్రానికి చెందిన సహచరులందరూ సగర్వంగా, సంతోషంగా మార్చ్ పాస్ట్ చేస్తుంటే... వారి సరసనే ముందుకు నడవాల్సిన మరికొందరు మాత్రం ప్రేక్షకుల్లా గ్యాలరీలకే పరిమితమైపోయారు. కేరళలో శనివారం ప్రారంభమైన జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు క్రీడాకారులకు చేదు అనుభవం ఎదురైంది. క్రీడాధికారుల అత్యుత్సాహం అనాలో... నిర్లక్ష్యం అనాలో... తొందరపాటు చర్య అనాలో తెలియదు కానీ కొందరి చర్యల వల్ల మార్చ్ పాస్ట్‌లో పాల్గొనాల్సిన పలువురు ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు నిరాశ ఎదురైంది.



వివరాల్లోకి వెళితే... జనవరి 27న జాతీయ క్రీడల్లో పాల్గొంటున్న తమ రాష్ర్ట క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి కిట్‌లను అందజేసింది. అదే రోజున సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ఏపీ జిమ్నాస్టిక్స్ క్రీడాకారులకు ఆగమేఘాలమీద కిట్‌లను ప్రదానం చేశారు. అయితే వారికి అందజేసిన ట్రాక్ సూట్‌లు, కిట్‌లపై లోగో, పేర్లు లేకపోవడంతో కార్యక్రమం ముగిసిన వెంటనే ఏపీ క్రీడాధికారులు వాటిని వెనక్కి తీసుకున్నారు. 28న కేరళకు బయలుదేరేముందు రైల్వే స్టేషన్‌లో లోగోలు ముద్రించిన కిట్‌లను అందజేస్తామని తెలిపారు.



కానీ అలా జరగలేదు. కేరళకు చేరుకున్నాక కూడా ఏపీ జిమ్నాస్ట్‌లకు అధికారిక కిట్‌లు అందలేదు. మరోవైపు 28వ తేదీన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మాత్రం అన్ని వివరాలు ముద్రించిన కిట్‌లను ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు అందించారు. వాళ్లందరూ మార్చ్ పాస్ట్‌లో పాల్గొన్నారు. అయితే హైదరాబాద్‌లో తూతూమంత్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిట్‌లు అందుకొని, అధికారుల కోరిక మేరకు... ఆ తర్వాత వాటిని వెనక్కి ఇచ్చిన క్రీడాకారులకు మాత్రం కిట్‌లు అందలేదు. దాంతో అధికారిక ట్రాక్ సూట్ లేదని మార్చ్ పాస్ట్‌లో పాల్గొనేందుకు జాతీయ క్రీడల నిర్వాహకులు అనుమతి ఇవ్వలేదు. దాంతో చేసేదేమీ లేక మైదానంలో ఉండాల్సిన వారందరూ గ్యాలరీల్లో ప్రేక్షకులుగా మారిపోయారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top