ముంబై మెరిసింది

ముంబై మెరిసింది


పరుగుల వేటలో ఎక్స్‌ప్రెస్ వేగంతో దూసుకుపోయిన ముంబై ఇండియన్స్ సీఎల్ టి20 క్వాలిఫయింగ్‌లో దుమ్మురేపింది. బౌలింగ్‌లో కాస్త విఫలమైనా.. . బ్యాటింగ్‌లో వీరోచిత పోరాటంతో ప్రధాన టోర్నీకి అర్హత సాధించే ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సదరన్ జట్టు టోర్నీ నుంచి దాదాపుగా నిష్ర్కమించినట్లే!

 

 రాయ్‌పూర్: తొలి మ్యాచ్ పరాభవం నుంచి ముంబై ఇండియన్స్ తొందరగానే తేరుకుంది. ఒక్క రోజులోనే తమ బ్యాటింగ్‌లో సంచలన మార్పు చూపిస్తూ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో రెచ్చిపోయింది. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ముంబై ఓపెనర్లు సిమ్మన్స్ (51 బంతుల్లో 76 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), మైక్ హస్సీ (40 బంతుల్లో 60; 5 ఫోర్లు, 3 సిక్సర్లు)... లక్ష్యాన్ని నీళ్లు తాగినంత సులువుగా ఛేదించారు. దీంతో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సదరన్ ఎక్స్‌ప్రెస్ జట్టును చిత్తు చేసింది.

 టాస్ గెలిచి ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన సదరన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. మహరూఫ్ (22 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), గుణతాలిక (23 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. ఎంజెలో పెరీరా (28 బంతుల్లో 28; 3 ఫోర్లు), ప్రసన్న (7 బంతుల్లో 15; 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించారు. ఓపెనర్లలో కుశాల్ పెరీరా (8) విఫలమైనా... గుణతాలిక, యశోద లంకతో కలిసి రెండో వికెట్‌కు 27 పరుగులు జోడించాడు. అయితే ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో వీరిద్దరితో పాటు ముబారక్ (16) స్వల్ప విరామాల్లో అవుటయ్యారు. చివర్లో ఎంజెలో పెరీరా, మహరూఫ్‌లు ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి. వీరిద్దరు ఆరో వికెట్‌కు 35 బంతుల్లో 58 పరుగులు జోడించారు. చివరి ఐదు ఓవర్లలో 59 పరుగులు రాబట్టడంతో సదరన్ జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించింది.

 అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై 16.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 165 పరుగులు చేసి గెలిచింది. సదరన్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో సిమ్మన్స్, హస్సీలు వీరవిహారం చేశారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ వేగంగా పరుగులు చేశారు. తొలి వికెట్‌కు 88 బంతుల్లో 139 పరుగులు జోడించి మెరుపు ఆరంభాన్నిచ్చారు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో హస్సీ అవుటైనా... బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చిన కెప్టెన్ పొలార్డ్ (7 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మూడు భారీ సిక్సర్లతో చెలరేగాడు. సిమ్మన్స్‌తో కలిసి రెండో వికెట్‌కు 10 బంతుల్లోనే అజేయంగా 26 పరుగులు జోడించడంతో ముంబై మరో 22 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. పతిరనాకు ఒక వికెట్ దక్కింది. సిమ్మన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మ్యాచ్‌లకు సోమవారం విశ్రాంతి దినం. మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ మ్యాచ్‌ల్లో సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో లాహోర్ లయన్స్; నార్తర్న్ డిస్ట్రిక్ట్‌తో ముంబై ఇండియన్స్ తలపడతాయి.

 స్కోరు వివరాలు

 సదరన్ ఎక్స్‌ప్రెస్ ఇన్నింగ్స్: కుశాల్ పెరీరా (సి) గోపాల్ (బి) బుమ్రా 8; గుణతాలిక (సి) హర్భజన్ (బి) జలజ్ 30; యశోద లంక (సి) రాయుడు (బి) పొలార్డ్ 9; ముబారక్ (బి) ఓజా 16; ఎంజెలో పెరీరా (బి) మలింగ 28; ప్రసన్న రనౌట్ 15; మహరూఫ్ నాటౌట్ 41; డి. పెరీరా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 161

 వికెట్ల పతనం: 1-13; 2-40; 3-50; 4-65; 5-90; 6-148

 బౌలింగ్: హర్భజన్ 4-1-18-0; బుమ్రా 3-0-23-1; మలింగ 4-0-28-1; గోపాల్ 2-0-29-0; పొలార్డ్ 2-0-18-1; జలజ్ సక్సేనా 1-0-3-1; ఓజా 4-0-35-1.

 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ నాటౌట్ 76; మైక్ హస్సీ (సి) ఎంజెలో పెరీరా (బి) పతిరనా 60; పొలార్డ్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (16.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 165

 వికెట్ల పతనం: 1-139

 బౌలింగ్: జయంపతి 3-0-14-0; మహరూఫ్ 3-0-39-0; జయరత్నే 4-0-38-0; డి.పెరీరా 3-0-28-0; ప్రసన్న 2-0-19-0; పతిరనా 1.2-0-26-1.





ముంబై ఇండియన్స్, సీఎల్ టి20 క్వాలిఫయింగ్‌, సదరన్ ఎక్స్‌ప్రెస్  

Mumbai Indians, siel T-20 qualification, the Southern Express

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top