ఆ రెండు అధిగమిస్తే ముంబైదే టైటిల్

ఐపీఎల్‌ ఫైనల్: ముంబైలో కలవరం!


హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-10లో తుది అంకానికి రెండుజట్లు రైజింగ్ పుణే సూపర్ జెయింట్, రెండుసార్లు చాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ చేరుకున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పుణే వరుస విజయాలతో ఫైనల్ చేరగా, ముంబై మాత్రం కొన్ని విషయాలలో ఆందోళన చెందుతుంది. ముంబై ఇండియన్స్‌ను రెండు సెంటిమెంట్లు ప్రస్తుతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ సీజన్లో పుణే చేతిలో మూడు పర్యాయాలు ఓడిపోవడం ఒకటి. రెండో విషయం ఏంటంటే.. లీగ్ దశలో టాప్ 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడితే లీగ్‌లో రెండో స్థానంలో నిలిచన టీమ్‌ను ఐపీఎల్ కప్ వరిస్తుండటం ముంబైపై ఒత్తిడి పెంచుతుంది.



లీగ్ దశలో 14 మ్యాచ్‌లకుగానూ 10 మ్యాచ్‌లు నెగ్గి నాలుగింట్లో ఓడగా, రెండు పర్యాయాలు పుణే చేతిలో ఓటమి పాలవడం ఇప్పుడు ముంబై జట్టును కలవరపాటుకు గురిచేస్తుంది. తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లోనూ తమ చేతిలో ఓడిన ముంబైతో ఫైనల్ మ్యాచ్ కావడం పుణేలో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. లీగ్‌ దశలో 20 పాయింట్లు, 18 పాయింట్లతో పట్టికలో ముంబై, పుణే తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆపై తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌తో సహా ఈ సీజన్లో తలపడిన మూడు పర్యాయాలు పుణే చేతిలో ముంబై ఓటమి పాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై నెగ్గి ముంబై ఫైనల్లోకి దూసుకెళ్లినా పుణే అడ్డంకిని అధిగమిస్తేనే వారు మూడోసారి చాంపియన్‌గా అవతరిస్తారు.



మరోవైపు ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్ (క్వాలిఫయర్) సంప్రదాయం ప్రవేశపెట్టిన 2011 ఏడాది నుంచి ఫైనల్ విజేతల వివరాలను గమనిస్తే ముంబైకి ఫైనల్ ఫీవర్ తప్పదని చెప్పవచ్చు. 2011లో చెన్నై సూపర్ కింగ్స్ (2), ఆర్సీబీ(1) తలపడగా చెన్నై నెగ్గింది. 2013 ఫైనల్లో ముంబై (2), సీఎస్కే(1) ఆడగా ముంబై టైటిల్ సాధించగా, 2014లో పంజాబ్(1)పై కేకేఆర్(2) విజయం సాధించగా, చివరగా 2015లో చెన్నై(1)ని ముంబై(2) ఓడించి సగర్వంగా కప్పును రెండో సారి అందుకుంది. ముంబై నెగ్గిన రెండు సీజన్లలోనూ లీగ్ లో చెన్నై(1)పైనే రెండో స్థానంలో ఉన్న ముంబై(2) గెలుపొందడం గమనార్హం.



2011 నుంచి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల వివరాలివే..

2011: చెన్నై సూపర్ కింగ్స్ (2) వర్సెస్ ఆర్సీబీ(1)     - విజేత చెన్నై

2012: కేకేఆర్(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(4)    - విజేత కేకేఆర్

2013: ముంబై ఇండియన్స్(2) వర్సెస్ సీఎస్కే(1)     - విజేత ముంబై

2014: కేకేఆర్(2) వర్సెస్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్(1)     - విజేత కేకేఆర్

2015: ముంబై(2) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్(1)     - విజేత ముంబై

2016: ఆర్సీబీ(2) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్(3)    - విజేత సన్‌రైజర్స్

2017: పుణే(2) వర్సెస్ ముంబై ఇండియన్స్ (1)         - విజేత   ?

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top