ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’

ముంబై ఇండియన్స్ ‘హ్యాట్రిక్’


వరుసగా మూడో విజయం

పంజాబ్ ‘ప్లే ఆఫ్’ ఆశలు ఆవిరి!

రాణించిన సిమ్మన్స్, పార్థీవ్


ఆరంభంలో తడబడిన ముంబై ఇండియన్స్ జట్టు నెమ్మదిగా గాడిలో పడుతోంది. సమష్టి ప్రదర్శనతో నిలకడగా రాణిస్తూ వరుసగా మూడో విజయాన్ని సాధించింది. మరోవైపు జట్టులో స్టార్ ఆటగాళ్లున్నా... బ్యాటింగ్ వైఫల్యంతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో నిరుటి రన్నరప్ అయిన పంజాబ్ ‘ప్లే ఆఫ్’ అవకాశాలకు దాదాపు తెరపడిందనే చెప్పాలి.

 

మొహాలీ : సిమ్మన్స్ (56 బంతుల్లో 71; 9 ఫోర్లు, 1 సిక్స్), పార్థీవ్ పటేల్ (36 బంతుల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరోచిత బ్యాటింగ్‌కు తోడు... బౌలర్లు సమయోచితంగా స్పందించడంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ తడబడటంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రోహిత్‌సేన 23 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 3 వికెట్లకు 172 పరుగులు చేసింది. తర్వాత పంజాబ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసి నెగ్గింది. మిల్లర్ (37 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్), విజయ్ (34 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. సిమ్మన్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.



ఓపెనర్లు అదుర్స్ : పంజాబ్ బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో ముంబై ఓపెనర్లు సిమ్మన్స్, పార్థీవ్ చెలరేగారు. తొలి ఓవర్‌లో సిమ్మన్స్ వరుసగా రెండు ఫోర్లు కొడితే.. జాన్సన్ వేసిన ఐదో ఓవర్‌లో పార్థీవ్ రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చిపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై స్కోరు 51 పరుగులకే చేరింది.



ఓవరాల్‌గా జాన్సన్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న 9 బంతుల్లో పార్థీవ్ 28 పరుగులు రాబట్టాడు. తర్వాత సిమ్మన్స్ మరో మూడు ఫోర్లు బాదడంతో ముంబై తొలి 10 ఓవర్లలో 96 పరుగులు చేసింది. ఈ క్రమంలో పార్థీవ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తర్వాత అక్షర్ పటేల్ ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టి ఆ తర్వాతి ఓవర్‌లో అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 111 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రోహిత్ (20 బంతుల్లో 26; 2 ఫోర్లు) మెల్లగా ఆడినా.. రెండో ఎండ్‌లో సిమ్మన్స్ జోరు కనబర్చాడు.



ఈ ఇద్దరు సింగిల్స్, డబుల్స్‌తో రన్‌రేట్ తగ్గకుండా చూశారు. చివరకు రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించాకా రోహిత్ వెనుదిరిగాడు. 38 బంతుల్లో అర్ధశతకం సాధించిన సిమ్మన్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో అవుటైనా.. అప్పటికే ముంబై భారీ స్కోరు ఖాయమైంది. అనురీత్, జాన్సన్, కరణ్‌వీర్ తలా ఓ వికెట్ తీశారు.



చకచకా...: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. రెండో ఓవర్‌లోనే సెహ్వాగ్ (2), ఐదో ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ (9 బంతుల్లో 12; 2 ఫోర్లు)లు అవుట్‌కావడంతో పవర్‌ప్లేలో పంజాబ్ స్కోరు 45/2. తర్వాత వచ్చిన మిల్లర్, విజయ్‌కు చక్కని సహకారం అందించాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేసినా.. అవసరమైనప్పుడు ఫోర్లు, సిక్సర్లు బాదారు. అయితే నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 12వ ఓవర్‌లో హర్భజన్ అవుట్ చేశాడు.



అప్పటికే సుచిత్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన విజయ్... భజ్జీ బౌలింగ్‌లో మరో షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో ఉన్ముక్త్ చేతికి చిక్కాడు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. తర్వాత బెయిలీ (18 బంతుల్లో 21; 1 ఫోర్) సహకారంతో మిల్లర్ ఇన్నింగ్స్‌ను నడిపించినా రన్‌రేట్‌ను కాపాడలేకపోయాడు.



అయితే గెలుపునకు 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో మిల్లర్‌ను 17వ ఓవర్‌లో మలింగ బోల్తా కొట్టించాడు. ఈ జోడి నాలుగో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తర్వాత సాహా (12 బంతుల్లో 12; 1 ఫోర్) భారీ షాట్లకు ప్రయత్నించినా 19వ ఓవర్‌లో బెయిలీ, అక్షర్ పటేల్ (0) వరుసగా రనౌట్‌కావడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు. మలింగ 2 వికెట్లు తీశాడు.

 

స్కోరు వివరాలు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : సిమ్మన్స్ (సి) అక్షర్ (బి) అనురీత్ 71; పార్థీవ్ (సి) విజయ్ (బి) కరణ్‌వీర్ 59; రోహిత్ శర్మ (సి) అనురీత్ (బి) జాన్సన్ 26; పొలార్డ్ నాటౌట్ 7; అంబటి రాయుడు నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 172.

వికెట్ల పతనం : 1-111; 2-154; 3-166.

బౌలింగ్ : సందీప్ 3-0-24-0; అనురీత్ 4-0-30-1; జాన్సన్ 4-0-41-1; అక్షర్ 3-0-24-0; కరణ్‌వీర్ 4-0-30-1; విజయ్ 1-0-12-0; మ్యాక్స్‌వెల్ 1-0-8-0.



కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్ : మురళీ విజయ్ (సి) ఉన్ముక్త్ చంద్ (బి) హర్భజన్ సింగ్ 39; వీరేంద్ర సెహ్వాగ్ (సి) పొలార్డ్ (బి) లసిత్ మలింగ 2; మ్యాక్స్‌వెల్ (సి) వినయ్ కుమార్ (బి) సుచిత్ 12; మిల్లర్ (సి) రోహిత్ శర్మ (బి) లసిత్ మలింగ 43; బెయిలీ రనౌట్ 21; వృద్ధిమాన్ సాహా రనౌట్ 12; అక్షర్ పటేల్ రనౌట్ 0; మిచెల్ జాన్సన్ నాటౌట్ 8; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 149.

వికెట్ల పతనం : 1-9; 2-38; 3-86; 4-119; 5-140; 6-140; 7-149.

బౌలింగ్ : మెక్లీంగన్ 4-0-25-0; లసిత్ మలింగ 4-0-31-2; వినయ్ కుమార్ 3-0-17-0; సుచిత్ 4-0-33-1; హర్భజన్ సింగ్ 4-0-27-1; పొలార్డ్ 1-0-7-0.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top