తన ‘ఘనతే‘ తన శత్రువు!

తన ‘ఘనతే‘ తన శత్రువు!


 ‘అతని బ్యాటింగ్‌లో మునుపటి వేడి కనిపించడం లేదు. సెలక్టర్లు అతనిపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది... కెప్టెన్‌గా, ఆటగాడిగా కూడా అతను జట్టుకు భారంగా మారాడు. పాత ఘనతలను దృష్టిలో ఉంచుకొని అతడిని కొనసాగించడం సరి కాదు...’ ఇవీ మాజీ క్రికెటర్లు కొంత మంది మహేంద్ర సింగ్ ధోనిపై చేస్తున్న విమర్శలు. గణాంకాల గురించి పెద్దగా ఆలోచించకుండా అప్పటికప్పుడు టీవీ బైట్ల కోసం చేసే ఇలాంటి వ్యాఖ్యల్లో వాస్తవమెంత?

 

 ఒకప్పుడు అద్భుతమైన ఫినిషర్ అయినా ఒక కుర్ర బౌలర్‌ను ఎదుర్కొని చివరి ఓవర్లో 11 పరుగులు చేయలేకపోయాడు. ఇక అతను ఏ మాత్రం మ్యాచ్‌లను ముగించే ఆటగాడిగా కనిపించడం లేదు. ఇకపై ఆ స్థానం మరొకరికి అప్పగించాల్సిందే... ఇదీ  మరికొంతమంది అభిప్రాయం. నిజంగా ధోని మ్యాచ్‌లను గెలిపించలేడా!

 

 ఈ ఏడాది వన్డేల్లో టాప్ ఆర్డర్, మన నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ కోహ్లి 16 ఇన్నింగ్స్‌లలో కలిపి 29.92 సగటుతో చేసింది 389 పరుగులే. అదే సమయంలో ఫామ్‌లో లేడంటూ విరుచుకు పడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ధోని 13 ఇన్నింగ్స్‌లలో 41.72 సగటుతో 459 పరుగులు చేశాడు. కోహ్లి స్ట్రైక్ రేట్ 76.27తో పోలిస్తే ధోని స్ట్రైక్ రేట్ 84.22 చాలా ఎక్కువ. మరి వన్డేల్లో ఎవరు బాగా ఆడినట్లు? కానీ ధోనిని విమర్శించే ఏకైక మంత్రాన్నే జపిస్తున్న చాలా మంది ఈ అంకెలను పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడంతా ధోని ‘గతంలోలాగా’ ఆడటం లేదు అంటున్నారే తప్ప అతని గతం ఎంత అద్భుతమో ఆ వైపు దృష్టి పెట్టడం లేదు.

 

 అతను గీసిన గీత

 సమకాలీన వన్డే క్రికెట్‌లోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ధోని ఒకడనడంలో సందేహం లేదు. 250కి పైగా వన్డేలు ఆడి దాదాపు 9 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్. ఇప్పటికీ 50కు పైగా సగటు, 90 స్ట్రైక్ రేట్ కొనసాగించడం అసాధారణ విషయం. సాధారణంగా వన్డేల్లో 40 సగటు ఉన్నవారందరినీ మెరుగైన బ్యాట్స్‌మెన్‌గా గుర్తిస్తారు. కానీ ధోని వారికంటే చాలా ఎత్తులో ఉన్నాడు. ‘అభిమానులు ఇలాంటి ఎప్పుడో ఒకసారి ఓడిన మ్యాచ్‌ను గుర్తుంచుకుంటారు తప్ప ఎన్నో సార్లు గెలిపించిన విషయం పట్టించుకోరు’ అని ధోని చేసిన వ్యాఖ్యలో వాస్తవం ఉంది. ఒకటా, రెండా ఎన్నో మ్యాచ్‌లలో విజయాలు, అరుదైన రికార్డులతో ధోని వన్డే క్రికెట్‌లో భారత భాగ్యచక్రాన్ని మలుపు తిప్పాడు. ఇప్పుడు అతని ‘చరిత్ర’తో పోల్చడం వల్లే సమస్య పెద్దగా కనిపిస్తోంది. ప్రస్తుతం 40కు పైగా సగటుతో పరుగులు చేస్తున్నా.... కెరీర్ సగటు 52తో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తోంది.

 

 అవే కళ్లతో చూస్తే...

 ధోని బాగా ఆడటం లేదంటూ విమర్శించడం చాలా మందికి ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. కానీ ఇందులో ధోని వైఫల్యంకంటే ఇటీవల శ్రీలంక సిరీస్‌లో కోహ్లి సారథ్యంలో గెలవడం అనేది అందరికీ ఒక సాకుగా దొరికిపోయింది. అలాంటి దూకుడు కావాలంటూ కొంత మంది.... శ్రీనివాసన్ వెళ్లిపోయాక ధోని వల్ల కాదంటూ మరికొంత మంది.... రెడీమేడ్ తీర్పులతో సిద్ధంగా ఉండటం మహీకి సమస్యగా మారింది. కాన్పూర్ మ్యాచ్‌లో కోహ్లి క్రీజ్‌లో ఉన్న సమయంలో నెమ్మదిగా ఇన్నింగ్స్ సాగిన 6.2 ఓవర్లు (22 పరుగులు) కూడా జట్టు ఓటమికి కారణమయ్యాయి. కానీ కోహ్లిని ఎవరూ ఏమీ అనడం లేదు. 30 బంతుల్లో 31 పరుగులు చేసిన ధోని మాత్రం దొరికిపోయాడు.

 

 ప్రత్యామ్నాయం ఎక్కడ?

 ఎన్నో మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి ఒంటి చేత్తో గెలిపించడంతో ధోనిపై ఫినిషర్ ముద్ర పడింది. కానీ 5, 6 లేదా 7 స్థానాల్లో వచ్చి ఆ పాత్ర పోషించడం అంత సులువు కాదు. కొన్ని షాట్లు ఆడి ముగించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఒకటి, రెండు సార్లు విఫలం కావచ్చు కూడా. ధోనికి నిజానికి నాలుగో స్థానంలో వచ్చి ప్రశాంతంగా ఆడాలని కోరిక ఉన్నా అది సాధ్యం కాదు. రెగ్యులర్ బ్యాట్స్‌మెన్ రహానే, కోహ్లి, రైనాలను కాదని ముందుకు రాలేడు. పైగా చివర్లో అతనిలాంటి ఫిని షర్ ఎవరూ లేరు. బిన్నీకో మరొకరికో ఆ బాధ్యత అప్పగించగలరా! అతడిని దాటి సెలక్టర్లు ఆలోచించాలంటే ప్రత్యామ్నాయం ఉండాలి. ఆరో స్థానంలో కూడా 45కు పైగా సగటుతో ఆడగల వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ లభిస్తే అప్పుడు ధోనిని తప్పించే ఆలోచన చేయవచ్చు. ప్రపంచకప్ సెమీస్ తర్వాత ఆడింది కేవలం నాలుగే వన్డేలు. అప్పుడే జట్టుకు భారమంటే ఎలా? నిజానికి ధోని భారత జట్టుకు చాలా ఇచ్చాడు. ఇప్పుడు జట్టు కూడా తనకు ఎంతో కొంత తిరిగివ్వాలి. తన విషయంలో కాస్త సంయమనంతో వ్యవహరిస్తే మంచిది.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top