ధోనికి విశ్రాంతి

ధోనికి విశ్రాంతి


సాక్షి, హైదరాబాద్: శ్రీలంకతో జరిగే తొలి మూడు వన్డేలనుంచి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటనకు ముందు అతనికి బోర్డు విశ్రాంతి కల్పించింది. ఫలితంగా భారత జట్టుకు విరాట్ కోహ్లి నాయకత్వం వహిస్తాడు. వచ్చే నెల 2న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం జట్టును సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం ఇక్కడ ప్రకటించింది. ధోనితో పాటు భువనేశ్వర్‌కు కూడా విశ్రాంతినిచ్చారు. వీరి స్థానాల్లో వృద్ధిమాన్ సాహా, వరుణ్ ఆరోన్ జట్టులోకి వచ్చారు. మరో వైపు విండీస్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న అశ్విన్ తిరిగి జట్టులోకి రాగా...ఆ సిరీస్‌లో మ్యాచ్ ఆడే అవకాశం రాని కుల్దీప్ యాదవ్‌ను సెలక్టర్లు పక్కన పెట్టారు. మూడు మార్పులు మినహా మిగతా జట్టును కొనసాగించారు.



 జట్టు వివరాలు: కోహ్లి (కెప్టెన్), ధావన్, రహానే, రైనా, రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్, మిశ్రా, విజయ్, ఆరోన్, అక్షర్ పటేల్.



 భారత ‘ఎ’ జట్టులో రోహిత్ శర్మ

 వన్డే సిరీస్‌కు ముందు లంకతో జరిగే వార్మప్ వన్డేలో తలపడే భారత ‘ఎ’ జట్టును కూడా సెలక్టర్లు ప్రకటించారు. గాయం కారణంగా విండీస్‌తో సిరీస్‌కు దూరమైన రోహిత్ శర్మకు ఇందులో చోటు లభించింది. ముఖ్యంగా అతని ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకే ఈ ఎంపిక చేసినట్లు తెలిసింది. ప్రాక్టీస్ మ్యాచ్ ఈ నెల 30న ముంబైలో జరుగుతుంది.



 భారత ‘ఎ’ జట్టు వివరాలు: మనోజ్ తివారి (కెప్టెన్), ఉన్ముక్త్ చంద్, మనన్ వోహ్రా, కరుణ్ నాయర్, రోహిత్ శర్మ, కేదార్ జాదవ్, సంజు శామ్సన్, పర్వేజ్ రసూల్, కరణ్ శర్మ, స్టువర్ట్ బిన్నీ, ధావల్ కులకర్ణి, బుమ్రా, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top