మరి ధోని సంగతేమిటి?

మరి ధోని సంగతేమిటి?


న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లు ఆటగాళ్ల, టీం సపోర్టింగ్‌ స్టాఫ్‌ ల కాంట్రాక్టు ఫీజులు పెంచాలని బీసీసీఐ నిర్వాహకుల కమిటీని(సీఓఏ) కోరిన సంగతి తెలిసిందే. ఆదివారం హైదరాబాద్‌ లో సీఈవో రాహుల్‌ జోహ్రి, జాయింట్‌ సెక్రటరీ అమితాబ్‌ చౌదరిలకు కోచ్‌ అనిల్‌ కుంబ్లే పీజులు 150 శాతం పెంచాలని కోరుతూ పూర్తి నివేదికను అందజేశారు. ఇప్టటికే గ్రేడ్‌ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్‌ బి ఆటగాళ్లు రూ. 1కోటి,  గ్రేడ్‌ సీ వారు రూ. 50 లక్షలు పొందుతున్నారు. అయితే కోహ్లీ, కుంబ్లే లు అన్నిఫార్మాట్లలో కలిపి గ్రేడ్‌ ఏ ఆటగాళ్లకు ఒక్కో సీజన్‌ కు రూ. 5 కోట్లు పెంచాలని కోరారు.



ఈ కొత్త విధానం ధోనికి చేటు చేసేలా  ఉంది. ఇప్పటివరకూ ఫామ్, పేరు ప్రఖ్యాతుల ఆధారంగా భారత క్రికెటర్లు టాప్ గ్రేడ్ పొందుతున్నారు. ప్రస్తుతం కుంబ్లే, కోహ్లిలు కోరిన నివేదికలో అన్ని ఫార్మాట్లలో కలిపి గ్రేడ్ ఏ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం టెస్టు క్రికెటర్లకు అత్యధిక మొత్తం చెల్లించాలి. ఆ తరువాత వన్డేలు, టీ 20 ఆటగాళ్లు ఉండాలి. అంటే ఈ ప్రతిపాదన ఐపీఎల్ ఆడని చటేశ్వర పుజారా లాంటి క్రికెటర్ కు లాభిస్తుండగా, టెస్టు క్రికెట్ కు దూరమైన ధోనిపై ప్రభావం చూపక తప్పదు. ప్రస్తుతం ధోని 'ఏ' కేటగిరిలో ఉన్నప్పటికీ కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్కే పరిమితమయ్యాడు. అంటే ఈ ప్రతిపాదన అమలైతే ధోనికి ఆర్దికంగా నష్టం తప్పదు. 'ఏ' గ్రేడ్ లో ఉండి కూడా రెండు కోట్లు మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది. ఈ నెల 26వ తేదీన జరిగే బీసీసీస సర్వసభ్య సమావేశంలో కోహ్లి-కుంబ్లే ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top