రేసులో వారసుడొచ్చాడు...

రేసులో వారసుడొచ్చాడు...


దిగ్గజాల్లాంటి తండ్రి అడుగు జాడల్లో కొడుకులు నడవటం కొత్త కాదు. డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్, క్రికెటర్ కొడుకు క్రికెటర్ కావడం చూసేశాం. ఇప్పుడు రేసర్ తనయుడు రేసర్‌గా వారసత్వం నిలబెట్టేందుకు సిద్ధమయ్యాడు. దాదాపు దశాబ్ద కాలం పాటు ఎఫ్1 ప్రపంచాన్ని శాసించి... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన స్టార్ డ్రైవర్ మైకేల్ షుమాకర్ కొడుకు మిక్ షుమాకర్ ఎఫ్1 లక్ష్యంగా అడుగులు వేస్తున్నాడు. స్కీయింగ్ చేస్తూ గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమైన తండ్రి ఆశలకు కొత్త ఊపిరి పోసేందుకు 16 ఏళ్ల మిక్ సన్నద్ధమయ్యాడు.



శనివారం ప్రారంభమైన యూరోపియన్ ఏడీఏసీ ఫార్ములా-4 పోటీల్లో నెదర్లాండ్స్‌కు చెందిన వాన్ అమర్స్‌ఫూర్ట్ జట్టు తరఫున బరిలోకి దిగాడు. యూరోపియన్ కార్టింగ్ చాంపియన్‌షిప్ విజేతగా నిలిచి అతను ఈ రేస్‌లకు అర్హత సాధించాడు. చాన్నాళ్లుగా మిక్ షుమాకర్ రేసింగ్ పోటీల్లో కనిపిస్తున్నా... తన తండ్రి పేరు ఎక్కడా తెలీకుండా జాగ్రత్త పడ్డాడు. కార్టింగ్‌లో అతను తల్లి పేరు కొరిన్నా జత చేసి బరిలోకి దిగేవాడు.



ఇప్పుడు ఇది బయటపడటంతో అతనిపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. వారసుల విజయాలు, వైఫల్యాలు సంగతి ఎలా ఉన్నా... తండ్రి పేరు భారం మోస్తూ అంచనాల మధ్య సత్తా చాటడం అంత సులువు కాదు. అయితే రేసింగ్ ప్రపంచం మొత్తం మిక్‌కు అండగా నిలుస్తోంది. అతనిలో అపార ప్రతిభ ఉందని, కచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టగలడని మాజీ డ్రైవర్లు, ఎఫ్1 దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. ఈ కుర్రాడు భవిష్యత్తులో ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top