చిరకాలం... మదిలో మెదిలేలా...

చిరకాలం... మదిలో మెదిలేలా...


ప్రపంచకప్-2015 జ్ఞాపకాలు


నాలుగేళ్ల క్రితం ముంబై వాంఖడే మైదానంలో ఆఖరి బంతికి ధోని కొట్టిన సిక్సర్ ప్రతీ భారత అభిమాని గుండెల్లో నిలిచిపోయింది. కొన్ని వందల సార్లు టీవీల్లో, ఇంటర్‌నెట్‌లో, వార్తా చర్చల్లో ఎక్కడ అది కనిపించినా మన మనసు ఆనందంతో ఉప్పొంగేది. ఈసారి టోర్నీలో మన ‘హెలికాప్టర్’ అనుకున్నంత ఎత్తుకు ఎగరలేదు.

 

అయితే గప్టిల్, గేల్ ‘డబుల్’ మోతల నుంచి స్టార్క్, సౌతీ వికెట్ల పండగ వరకు... తొలి మ్యాచ్‌ను గెలిచిన      అఫ్ఘన్‌ల సంబరం... ఎదురులేని శతకాల సంగక్కర వరకు... వహ్వా అనిపించుకున్న వహాబ్ నుంచి ఇలియట్ సిక్సర్ వరకు... ఇలా 2015 ప్రపంచకప్ ఎన్నో జ్ఞాపకాలను పంచింది. విజేతలు, పరాజితులు ఎవరైనా కొన్ని క్షణాలు మాత్రం సగటు క్రికెట్ అభిమానికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచ కప్ అనగానే మదిలో మెదిలే కొన్ని అపురూప ఘట్టాలను గుర్తు చేసుకుంటే...

 

డబుల్ ‘డబుల్’

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రపంచకప్ రెండు వ్యక్తిగత డబుల్ సెంచరీలను చూసే అవకాశం కల్పించింది. ముందుగా క్రిస్ గేల్ జింబాబ్వేపై చెలరేగితే, ఆ తర్వాత గప్టిల్, అదే విండీస్‌ను చావబాదాడు. విధ్వంసక ఆటగాడు గేల్ విశ్వరూపం ఎవరినీ ఆశ్చర్యపరచకపోయినా, గప్టిల్ మాత్రం తన డబుల్‌తో అందరికీ షాక్ ఇచ్చాడు. 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో గేల్ 215 పరుగులు చేయగా... 163 బంతుల్లో 24 ఫోర్లు, 11 సిక్సర్లతో 237 పరుగులు చేసి గప్టిల్ నాటౌట్‌గా నిలిచాడు.

 

సూపర్ బౌలింగ్

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కివీస్ బౌలర్ టిమ్ సౌతీ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కనబర్చాడు. 33 పరుగులకే 7 వికెట్లు పడగొట్టిన సౌతీ, ఈ క్రమంలో కివీస్ తరఫున పలు కొత్త రికార్డులు నమోదు చేశాడు. ఇక కివీస్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ స్టార్క్ అద్భుతమైన స్వింగ్ బౌలింగ్‌తో చెలరేగాడు. కేవలం 152 పరుగుల లక్ష్యంతో ఆడుతున్న కివీస్‌ను అతని బౌలింగ్ బెంబేలెత్తించింది. ఆసీస్ ఒక వికెట్‌తో మ్యాచ్ ఓడినా స్టార్క్ (6/28) సూపర్ బౌలింగ్ చిరస్మరణీయం.

 

రియాజ్ x వాట్సన్

ఆసాంతం బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించిన ఈ ప్రపంచకప్‌లో ఒక బౌలర్, బ్యాట్స్‌మన్‌కు దడ పుట్టించడం ఏ అభిమానీ మరిచిపోలేడు.  ప్రతీ బంతి దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో విసురుతూ నాలుగు ఓవర్ల పాటు పాకిస్తాన్ పేసర్ వహాబ్ రియాజ్, ఆసీస్‌ను అల్లాడించాడు. అర గంట పాటు సాగిన ఈ పోరులో వార్నర్, క్లార్క్ పెవిలియన్ చేరగా... వాట్సన్ బిత్తరపోయాడు. సగం బంతులు అతని శరీరాన్ని ఎక్కడో ఒక చోట తాకాయి. ఒక పేసర్ ముందు ఆసీస్ బ్యాట్స్‌మన్ ఇలా భీతిల్లడం అనూహ్యం. చివరకు వాట్సన్ ఎలాగో కోలుకున్నా... టోర్నీ మొత్తానికే ఇది హైలైట్ స్పెల్.

 

శతకాల నాదం

ప్రపంచకప్‌లో ఒక్క సెంచరీ చేస్తే చాలు చాలా మంది బ్యాట్స్‌మెన్ తమ జన్మ ధన్యమైనట్లుగా భావి స్తారు. కానీ ఒకటి కాదు రెండు కాదు వరుసగా 4 శతకాలు బాది ఔరా అనిపిం చాడు శ్రీలంక దిగ్గజం సంగక్కర. ఇది ప్రపంచకప్‌లోనే కాకుండా వన్డేల్లోనే కొత్త రికార్డు కావడం విశేషం. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌లపై సంగ వరుసగా 105 నాటౌట్, 117 నాటౌట్, 104, 124 పరుగులు చేశాడు. లంక క్వార్టర్ ఫైనల్లోనే నిష్ర్కమించినా సంగక్కర ఘనత ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

 

కన్నీటి సంద్రం

ఆటలో గెలుపోటములు సహజమే అని వారు సరిపెట్టుకోలేదు. కన్నీళ్లను దాచుకుంటూ లేని గాంభీ ర్యాన్ని ప్రదర్శించి ‘హార్డ్ లక్’ అంటూ సర్దుకుపోలేదు. పరాజయం ఎంత బాధిస్తుందో దక్షిణాఫ్రికా క్రికెటర్లకు తప్ప మరొకరికి తెలీదు. న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ ఓడిన క్షణాన జట్టు మొత్తం విషాదంలో మునిగింది. తమ భావోద్వేగాలు నియంత్రించుకోకుండా అందరి ముందే సఫారీలు ఏడవటం ప్రత్యర్థులకు కూడా అయ్యో అనిపించింది. ముఖ్యంగా మోర్నీ మోర్కెల్ రోదనను ఏ క్రికెట్ అభిమాని కూడా మరచిపోలేడు.

 

ఇలియట్ షాట్

సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు గ్రాంట్ ఇలియట్ కొట్టిన సిక్సర్ అపురూపం. ఈ టోర్నీ మొత్తానికి నిస్సందేహంగా ఇదే బెస్ట్ షాట్. ఆక్లాండ్ మైదానంలో 45 వేల మందితో హోరెత్తించిన ఈ షాట్, అటు దక్షిణాఫ్రికా గుండెలు ముక్కలు చేసిం ది. విజయానికి రెండు బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో స్టెయిన్ వేసిన గుడ్ లెంగ్త్ బంతిని ఇలియట్ వైడ్ లాంగాన్ మీదుగా అద్భుతంగా ఆడాడు. ఏడేళ్ల కెరీర్‌లో ఎన్నడూ తనకంటూ గుర్తింపు తెచ్చుకోని ఇలియట్‌ను ఈ సిక్సర్ ఒక్కసారిగా హీరోను చేసింది.

 

బంగ్లా భళా...

ప్రతీ ప్రపంచకప్‌లో ఏదో ఒక సంచలన సాధించడం అలవాటుగా పెట్టుకున్న బంగ్లాదేశ్ ఈ సారి కూడా అదే చేసింది. మూడు సార్లు ఫైనలిస్ట్, క్రికెట్ పుట్టిల్లుగా చెప్పుకునే ఇంగ్లండ్ పుట్టి ముంచింది. లీగ్ మ్యాచ్‌లో 15 పరుగులతో ఇంగ్లండ్‌ను ఓడించి బంగ్లా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా ఇంగ్లండ్ అవమానకరంగా టోర్నీనుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. తాజా ఫలితంతో ఇంగ్లండ్‌కు అసలు వన్డే స్థాయి కానీ అర్హత లేదని అన్ని వైపులనుంచి విమర్శలు వచ్చాయి. మరో వైపు ఐర్లాండ్ కూడా వెస్టిండీస్‌పై విజయం సాధించినా, అది టోర్నీపై పెద్దగా ప్రభావం చూపించలేదు.

 

ఆనంద బాష్పాలు

నిత్యం సమరాల నీడలో బతుకుతూ క్రికెట్‌లో తమ ముద్ర కోసం తపించిన అఫ్ఘానిస్థాన్ ఒక అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. ప్రపంచప్‌లో ఒక్క విజయం ఆటగాళ్లను, ఆ దేశాన్ని ఊపేసింది. స్కాట్లాండ్‌పై అఫ్ఘానిస్థాన్ ఒక వికెట్‌తో గెలిచిన క్షణాన అన్ని బాధలను మరచిపోయారు. అప్పుడు ప్రపంచమంతా అఫ్ఘని విజయాన్ని కాంక్షించిందనడం అతిశయోక్తి కాదు. 211 పరుగుల లక్ష్య ఛేదనలో 96 పరుగులతో సమీయుల్లా షెన్వారి చేసిన పోరాటం ఎవరూ మర్చిపోలేరు.

 

మెకల్లమ్ ‘బౌల్డ్’

మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు... ప్రపం చ కప్ ఫైనల్ మ్యాచ్... ఐదో బంతికే అద్భుతం జరిగింది. కివీస్ ఆశలను తుం చేస్తూ స్టార్క్ వేసిన ఆ బంతి మెకల్లమ్ స్టంప్స్‌ను గిరాటేసింది. తొలిసారి ఫైనల్ చేరి ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ సమరానికి అక్కడే అడ్డుకట్ట పడింది. టోర్నీ ఆసాంతం స్ఫూర్తిదాయకంగా ఆడిన కివీస్ ప్రదర్శన గురించి ఎంత గొప్పగా చెప్పినా...ఆ వికెట్ మాత్రం సగటు అభిమానిని జీవితాంతం వెంటాడుతుంది.

 

నేను కాదు మనం...

డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీస్‌లోనే ఓడినా... భారత జట్టు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే కొన్ని తీపి జ్ఞాపకాలను మనకు అందించింది.  ముఖ్యంగా వరుసగా ఏడు విజయాలు అభిమానులకు ఆనందాన్ని పంచాయి. పాక్‌పై అజేయ రికార్డు, దక్షిణాఫ్రికాపై తొలి విజయం, ధావన్ రెండు సెంచరీలు, రైనా, రోహిత్ శతకాలు, మన బౌలర్ల ప్రదర్శన, ఫీల్డింగ్ గుర్తుంచుకునేలా చేశాయి. ధోని సిక్సర్‌లాంటి క్షణాలు లేకున్నా విమర్శలు తావు లేని రీతిలో టీమిండియా సంతృప్తికర ప్రదర్శన కనబర్చింది. సరిగ్గా చెప్పాలంటే వ్యక్తిగతంగా చూస్తే ఏ ఒక్కరి ప్రదర్శనో టోర్నీలో హైలైట్ కాలేదు కానీ జట్టుగా మాత్రం అంతా సమష్టితత్వం కనిపించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top