టాప్‌–4లో చేరడమే లక్ష్యం

టాప్‌–4లో చేరడమే లక్ష్యం


ఆండర్‌ హెరీరా ఇంటర్వ్యూ

ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఈపీఎల్‌) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెల్సీపై గత ఆదివారం మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టు 2–0తో నెగ్గింది. ఇందులో ఆండర్‌ హెరీరా కీలక పాత్ర పోషించడమే కాకుండా ఓ గోల్‌ కూడా సాధించాడు. తాజాగా నేడు (ఆదివారం) బర్న్‌లీతో జరిగే మ్యాచ్‌లోనూ నెగ్గి టాప్‌–4లో చోటు కోసం ఎదురుచూస్తున్నట్టు హెరీరా తెలిపాడు. ఆరంభంలో అంతగా విజయాలు దక్కకపోయినా ప్రస్తుతం తమ జట్టు దూసుకెళుతోందని, ఈ దూకుడు మున్ముందు కూడా కొనసాగుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.



గత నెల రోజులుగా మీ జట్టు విజయ ప్రస్థానం కొనసాగుతోంది. ఓటములు లేకున్నా ‘డ్రా’లు బాగానే ఎదురవుతున్నాయి. ఇది టైటిల్‌ వేటలో ఇబ్బందిగా మారనుందా?

కొంతవరకు ఇది నిజమే. మా జట్టుకు ‘డ్రా’లు ఎదురవుతున్నా మా ఆటతీరు చాలా మెరుగ్గా ఉంది. మా మేనేజర్‌ సూచనలతో ఎప్పటికప్పుడు తప్పులు సరిదిద్దుకుంటూ ముందుకెళుతున్నాం. ఇంకా చాలా పాయింట్లు సాధించాల్సి ఉంది.



చెల్సీపై గత వారం భారీ విజయం సాధించారు. ఈ సీజన్‌లో ఇది పెద్ద ఫలితంగా భావిస్తున్నారా?

ఖచ్చితంగా.. మా వరకైతే అది చాలా కీలక మ్యాచ్‌. టాప్‌–4లో చోటు దక్కించుకోవడమే కాకుండా వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్‌ లీగ్‌కు అర్హత సాధించాలని భావిస్తున్నాం. ఇలాగే విజయాలను కొనసాగిస్తాం.



ఆ గెలుపును ఎలా వర్ణిస్తారు. మీ జట్టు ఇటీవలి పురోగతిపై మీ కామెంట్‌?

చెల్సీ ఎలాంటి జట్టో మనకు తెలుసు. వారు ప్రీమియర్‌ లీగ్‌లో టాప్‌లో ఉన్నారు. టైటిల్‌ దక్కించుకునేందుకు వారికి ఎక్కువ అవకాశాలున్నాయి. ఇలాంటి జట్టును ఓడించాలంటే మా నుంచి ఎలాంటి ప్రదర్శన రావాలో కూడా తెలుసు. అదే నిరూపించాం. అయితే మున్ముందు కూడా ఇలాంటి ఆటతీరునే ప్రదర్శించడం అవసరం.



మీ ఆట మెరుగుదలలో మేనేజర్‌ మౌరిన్హో పాత్ర ఎలాంటిది?

మౌరిన్హో అగ్రస్థాయి మేనేజర్‌ అనే విషయం అందరికీ విదితమే. నన్ను తుది జట్టులో చేర్చుకోవడమే కాకుండా చాలా ఆత్మవిశ్వాసాన్ని అందించాడు. తన దృష్టిలో నేను చాలా ముఖ్యమైన ఆటగాడినని చెప్పారు. ఇంత పెద్ద క్లబ్‌ తరఫున ఆడటం గౌరవంగా భావిస్తున్నాను.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top