ఆనందం ఆవిరి

ఆనందం ఆవిరి


ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్‌ను దక్కించుకోవాలనుకున్న భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కలలు కల్లలయ్యాయి. ఏడాదిలోపు అదే ప్రత్యర్థి చేతిలో ఆనంద్‌కు మరో షాక్... పాయింట్లలో తేడా మినహా అదే ఫలితం పునరావృతం... మ్యాచ్‌ను ఆఖరి గేమ్ వరకు నడిపించాలంటే ఓడకుండా ఉండాల్సిన మ్యాచ్‌లో ఆనంద్ తప్పటడుగు వేశాడు.



సాహసం చేయబోయి తాను వేసిన ఎత్తులో తానే చిక్కుకున్నాడు. ఫలితమే... మాగ్నస్ కార్ల్‌సన్ మోముపై మరోసారి చిరునవ్వు మెరిసింది. వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి చదరంగపు వేదికపై ‘కింగ్’ అనిపించుకున్నాడు.

 

 సోచి: విశ్వనాథన్ ఆనంద్-మాగ్నస్ కార్ల్‌సన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోరు ఒక గేమ్ ముందుగానే ముగిసింది. ఆదివారం జరిగిన 11వ గేమ్‌లో కార్ల్‌సన్ 45 ఎత్తులో ఆనంద్‌ను చిత్తు చేశాడు. ఫలితంగా 6.5-4.5 పాయింట్ల స్పష్టమైన ఆధిక్యంతో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. నల్ల పావులతో ఆడిన ఆనంద్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనే కనబర్చాడు.



అయితే 27వ ఎత్తులో వేసిన ఎత్తు అతడిని విజయానికి దూరం చేసింది. ఈ పొరపాటును ఉపయోగించున్న మాగ్నస్, మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను విజయం వైపు తీసుకుపోయాడు. ఈ గేమ్ గెలిస్తే అవకాశాలు నిలిచి ఉంటాయని భావించిన ఆనంద్, అనవసరపు దూకుడు ప్రదర్శించాడు. ‘డ్రా’కు కూడా మంచి అవకాశం ఉన్న దశలో ధైర్యం చేసి భిన్నమైన వ్యూహాన్ని ఎంచుకున్నాడు. అయితే అది పని చేయకపోగా, ప్రతికూల ఫలితాన్నిచ్చింది. ఈ చాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ 3 గేమ్‌లు, ఆనంద్ 1 గేమ్ గెలవగా, మిగతా 7 గేమ్‌లు డ్రాగా ముగిశాయి. ఫలితం తేలిపోవడంతో మంగళవారం జరగాల్సిన 12వ గేమ్ ఇక నిర్వహించరు.





 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top