గౌరవం కాపాడింది... మన అమ్మాయిలే!

గౌరవం కాపాడింది...   మన అమ్మాయిలే! - Sakshi


జాతీయ క్రీడా అవార్డు విజేతలకు ప్రధాని ఆతిథ్యం

నేడు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం


న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ విజేతలు పీవీ సింధు, సాక్షి మలిక్‌లతో పాటు జాతీయ క్రీడా పురస్కారాలు పొందిన అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసం 7, రేస్ కోర్స్ రోడ్‌లో ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా సింధు, సాక్షి తాము సాధించిన పతకాలను ఆయనకు చూపించారు. నేడు (సోమవారం) జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా సింధు, సాక్షి, దీప, జీతూ రాయ్‌లు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర పురస్కారాన్ని అందుకోనున్నారు. అలాగే అర్జున, ద్రోణాచార్య, మేజర్ ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారాలు ఆయా ఆటగాళ్లు స్వీకరించనున్నారు. ‘ప్రధానికి నా రజత పతకాన్ని చూపించాను.  దేశం గర్వించదగ్గ స్థాయిలో చాలా బాగా ఆడావు అని ప్రశంసించారు. ఆయనతో సంభాషణ చాలా సంతోషాన్నిచ్చింది’ అని సింధు తెలిపింది. సాక్షి కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ‘నన్ను కొట్టవు కదా’ అని ప్రధాని సరదాగా అన్నట్టు తెలిపింది.




రియో ఒలింపిక్స్‌లో దేశ గౌరవాన్ని కాపాడింది మన అమ్మాయిలేనని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా తన ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ఆయన వీరిని ప్రశంసించారు. ‘మనకు వచ్చిన రెండు పతకాలు ఈ దేశ పుత్రికలు సాధించినవే. ఏ విషయంలోనూ తాము తక్కువ కాదని వారు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతానికి చెందిన ఈ ముగ్గురు మనందరినీ గర్వపడేలా చేశారు. తమ పిల్లలను ఏదో ఒక ఉద్యోగంలో చేరేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ క్రీడలతో సమయం వృథాగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనాసరళిని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని ప్రధాని అన్నారు. ప్రతీ రాష్ట్రం ఏదేని రెండు క్రీడలపై ఫోకస్ పెట్టాలని, క్రీడల అభివృద్ధికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్‌లో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపడేందుకు ఇప్పటికే తాము టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మరోవైపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మేజర్ ధ్యాన్ చంద్‌ను గుర్తుచేసుకున్నారు. క్రీడా స్ఫూర్తి, దేశ భక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top