‘దెయ్యాలు’ వెంటాడుతున్నాయి!

‘దెయ్యాలు’ వెంటాడుతున్నాయి!


ఇంగ్లండ్ క్రికెటర్ల వణుకు

 హోటల్ గదుల్లో భయం.. భయంగా


 

 లండన్: ‘నేను ఆన్ చేయకుండానే బాత్‌రూమ్ కుళాయిలో నుంచి నీళ్లు వచ్చేశాయి. లైట్లు వేయగానే నీళ్లు ఆగిపోయాయి. లైట్లు ఆపివేయగానే మళ్లీ నీళ్లు వచ్చాయి. గది ఒక్కసారిగా వేడిగా మారిపోయింది. నాకు చాలా భయం వేసింది’ ఇదేదో హారర్ స్టోరీలో పేరా కాదు. ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌కు ఇటీవల తన హోటల్ రూమ్‌లో ఎదురైన అనుభవం.  ఇంతకు ముందు శ్రీలంకతో సిరీస్‌లో దీని గురించి చెప్పుకోకుండా మౌనంగా ఉన్న పాపానికి ఇప్పుడు బ్రాడ్‌కు నిద్ర కరువైంది. భారత్‌తో సిరీస్‌లోనూ ఇంగ్లండ్ జట్టుకు ఇప్పుడు అదే హోటల్‌ను కేటాయించారు. 1865లో నిర్మించిన లండన్‌లోని ప్రతిష్టాత్మక (చారిత్రక) హోటల్ ‘లాంగమ్’లో టీమ్ అంతా ఉంటోంది. అయితే తమను దెయ్యాలు వెంటాడుతున్నాయని, వెంటనే గదులను మార్చమంటూ ఆటగాళ్లు మేనేజ్‌మెంట్ ముందు పోరు పెడుతున్నారు. ‘నా గర్ల్‌ఫ్రెండ్ చాలా భయపడుతోంది. మొయిన్ అలీ భార్య పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక బెన్ స్టోక్స్‌కీ నిద్ర పట్టడం లేదు. లంకతో టెస్టు సమయంలోనైతే రాత్రి 1.30 గంటలకు నా గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపించింది’ అని బ్రాడ్ ఆవేదనగా చెప్పాడు. ముఖ్యంగా హోటల్ మూడో అంతస్థులో... గది నంబర్ 333లో భూతాలు తిరుగుతున్నాయని ఆటగాళ్లు భావిస్తున్నారు.

 

  భయంతో బ్రాడ్, ప్రయర్ ఉన్న గదిని పంచుకునేందుకు సిద్ధం కాగా, స్టోక్స్ మూడో ఫ్లోర్ నుంచే మారాడు. ఈ హోటల్‌లో కనీసం ‘ఏడు’ దెయ్యాలు ఉన్నాయని ప్రచారం ఉంది! దీనిపై స్పందించడానికి హోటల్ వర్గాలు నిరాకరిస్తున్నా... ఇలాంటి నిద్ర లేని రాత్రులు తమ ఆటపై ప్రభావం చూపిస్తున్నాయని ఇంగ్లండ్ ఆటగాళ్లు చెబుతున్నారు. అన్నట్లు... 2005లో డర్హమ్‌లోని హోటల్‌లో కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైతే, భయంతో బయటికి వచ్చిన అతను బ్రెట్‌లీ రూమ్‌ను పంచుకున్నాడు!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top