క్విటోవా, సఫరోవా అవుట్

క్విటోవా, సఫరోవా అవుట్


 ఫ్రెంచ్ ఓపెన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముర్రే

 

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో శుక్రవారం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), 11వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) మూడో రౌండ్‌లో ఇంటిముఖం పట్టారు. షెల్బీ రోజర్స్ (అమెరికా) 6-0, 6-7 (3/7), 6-0తో క్విటోవాపై... సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) 6-3, 6-7 (0/7), 7-5తో సఫరోవాపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-7 (6/8), 6-2తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, నాలుగో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6-3, 6-0తో విక్‌మాయెర్ (బెల్జియం)పై, ఆరో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా) 4-6, 6-2, 6-3తో ఒసాకా (జపాన్)పై, 13వ సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) 6-1, 6-4తో పావ్లీచెంకోవా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నారు.





పురుషుల సింగిల్స్ విభాగం మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-1, 6-4, 7-6 (7/3)తో కార్లోవిచ్ (క్రొయేషియా)పై, ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 3-6, 2-6, 6-4తో వెర్డాస్కో (స్పెయిన్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.



మూడో రౌండ్‌లో సానియా జంట

మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్) -మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన రెండో రౌండ్‌లో సానియా-హింగిస్ జంట 6-2, 6-0తో నవో హిబినో-ఎరి హొజుమి (జపాన్) ద్వయంపై గెలిచింది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో భారత స్టార్స్ లియాండర్ పేస్, రోహన్ బోపన్నలు వేర్వేరు భాగస్వాములతో కలిసి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

 

 

 గాయంతో వైదొలిగిన నాదల్


పురుషుల సిం గిల్స్ విభాగంలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) మోచేతి గాయం కారణంగా ఈసారి టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. ‘మోచేతికి గాయమైంది. ఈ టోర్నీలో మరిన్ని మ్యాచ్‌లు ఆడితే గాయం తీవ్రత పెరిగే అవకాశముంది. నా పరిస్థితి దారుణంగా ఉంది. ఈ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ కాకపోయుంటే అసలు బరిలోకి దిగేవాడిని కాదు’ అని నాదల్ అన్నాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top