కోల్ కతా గ్రాండ్ విక్టరీ

కోల్ కతా గ్రాండ్ విక్టరీ


పుణె: ఐపీఎల్-8 లో భాగంగా ఇక్కడ శనివారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది.  156 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఆదిలో ఆందోళనకు గురైంది. వరుసుగా వికెట్లు చేజార్చుకున్న కోల్ కతా ఆండ్రీ రస్సెల్ దూకుడుతో తేరుకుని టోర్నీలో అద్భుత విజయాన్ని సాధించింది. 60 పరుగులకే ఐదు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న కోల్ కతాను రస్సెల్ (66; 36 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్(28;4 ఫోర్లు) జోడీ ఆదుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్ కు 95 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడంతో కోల్ కతా ఇంకా 13 బంతులు ఉండగానే జయభేరీ మోగించింది. మ్యాచ్ చివర్లో రస్సెల్ ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగినా.. అప్పటికే కోల్ కతా విజయం ఖరారైంది.  కోల్ కతా ఆటగాళ్లలో రాబిన్ ఊతప్ప (13), మనీష్ పాండే(11) , సూర్య కుమార్ యాదవ్(23), గౌతం గంభీర్(11) , డెస్కోటీ(0) లు పెవిలియన్ చేరి నిరాశపరిచినా.. చివరకు విజయం సాధించడం ఆ జట్టు అభిమానులకు ఊరటనిచ్చింది. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.





అంతకుముందు టాస్ ఓడిన కింగ్స్ పంజాబ్ 156 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. పంజాబ్ ఆదిలోనే మురళీ విజయ్ వికెట్ ను డకౌట్ రూపంలో కోల్పోయింది. అనంతరం వృద్ధిమాన్ సాహా(15), వీరేంద్ర సెహ్వాగ్(11) పరుగులు చేసి పెవిలియన్ చేశారు. ఆ తరుణంలో మ్యాక్స్ వెల్, జార్జ్ బెయిలీలు పంజాబ్ ఇన్నింగ్స్ కు మరమ్మత్తులు చేపట్టారు. అయితే మ్యాక్స్ వెల్(33) భారీ షాట్ కు యత్నించి నాల్గో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తరువాత తిషారా పెరీరా(9),గుర్ కీరత్ సింగ్(11), అక్షర్ పటేల్(2) నిరాశ పరచడంతో స్కోరు మందగించింది. కాగా కెప్టెన్ బెయిలీ (60) ఒక్కడే మరోసారి ఆకట్టుకోవడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top